Share News

ముగిసిన అద్విక విచారణ

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:30 AM

లక్ష రూపాయల పెట్టుబడి పెడితే నెలకు రూ.6 వేలు వడ్డీ వస్తుందని ఆశ చూపించి అనేక మందిని మోసం చేసిన అద్విక ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కథ ముగిసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని బయటకు లాగడానికి ఏర్పాటైన సిట్‌ దర్యాప్తును ముగించింది. డబ్బు వసూలుకు మాస్టర్‌ మైండ్‌ను ఉపయోగించిన కంపెనీ ఎండీ తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్య, ఆయన భార్య సుజాతతో పాటు 15 మందిని పోలీసులు అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ అరెస్టులను రెండు రోజుల్లో అధికారికంగా ధ్రువీకరించనున్నారు.

ముగిసిన అద్విక విచారణ
అద్విక ఎండీ ఆదిత్య

నిందితులుగా 15 మంది నిర్ధారణ

ఏ1గా ఎండీ ఆదిత్య, ఏ2గా ఆయన భార్య సుజాత

అధిక వడ్డీల పేరుతో పెట్టుబడుల వసూళ్లు

రూ.500 కోట్ల వరకు వసూలు చేసినట్టు ధ్రువీకరణ

రెండు రోజుల్లో అరెస్టు చూపే అవకాశం

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేసే తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్య కొన్నేళ్ల క్రితం నగరంలో అద్విక ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని ఏర్పాటు చేశాడు. ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీకి ఎదురుగా ఉన్న భారీ భవనంలో ఈ సంస్థ కార్యకలాపాలు సాగాయి. రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.6 వేలను వడ్డీగా చెల్లిస్తానని సులువుగా డబ్బు సంపాదించాలనుకునే వారికి ఎర వేశాడు. అతడి మాటలు నమ్మిన చాలామంది ఒకరిని చూసి మరొకరు పెట్టుబడులు పెట్టారు. ప్రారంభంలో మాత్రం.. ఇచ్చిన మాట ప్రకారం రూ.6 వేల వడ్డీని చెల్లించాడు. తర్వాత ఆశలు అంతస్థులకు ఎదగడంతో చాలామంది రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది జూలైలో ఖాతాదారులకు ఆదిత్య షాక్‌లు ఇచ్చాడు. ఒక్కొక్కరికీ భారీగా బకాయిలు పెట్టాడు. తెలంగాణ, ఏపీలో కలిసి మొత్తం 2 వేల మంది నుంచి రూ.500 కోట్ల వరకు వసూలు చేసినట్టు తేలింది. కంపెనీ ప్రారంభంలో ఖాతాదారులుగా చేరినవారు తర్వాత ఏజెంట్ల అవతారమెత్తారు. కొత్తగా ఖాతాదారులను తీసుకొచ్చిన వారికి కమీషన్లుగా 12 నుంచి 20 శాతం వరకు ఇస్తానని హామీలు ఇచ్చాడు. ఇలా ఎడాపెడా ఆశలు చూపించిన ఆదిత్య ఒక్కసారిగా బోర్డు తిప్పేశాడు. కమీషన్లకు ఆశపడిన ఏజెంట్లు తమకు పరిచయం ఉన్న వారందరినీ సభ్యులుగా చేర్పించారు. తర్వాత ఏజెంట్లు రూ.లక్షలు వెనుకేసుకున్నారు. ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు, ప్రభుత్వ అధికారులు, పలువురు పోలీసులు అద్వికలో పెట్టుబడులు పెట్టారు. తెలంగాణాకు చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రూ.29 కోట్లను అద్వికలో పెట్టాడు. బాధితులంతా క్యూ కట్టడంతో మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిత్య కుట్రపూరితంగా ఈ పెట్టుబడులు సేకరించినట్టు ప్రాథమికంగా గుర్తించిన పోలీసు కమిషనర్‌ రాజశేఖరబాబు దర్యాప్తునకు సిట్‌ను నియమించారు. అద్విక ఖాతాల్లో వచ్చిన డబ్బు, ఈ ఖాతాల నుంచి ఎవరెవరి ఖాతాలకు ఎంతెంత వెళ్లిందన్న లెక్కలను సిట్‌ సాంకేతికంగా తేల్చింది.

సిట్‌ విచారణలో నిజాలు

ఈ కేసు దర్యాప్తునకు పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు క్రైమ్స్‌ డీసీపీ తిరుమలేశ్వరరెడ్డి చీఫ్‌గా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆగస్టులో ఏర్పాటు చేశారు. ఈ సిట్‌ అద్విక లెక్కలను సాంకేతికంగా నిర్ధారించింది. లెక్కలు పూర్తిగా తేలడంతో ఆదిత్య, సుజాతతో పాటు వారికి సహకరించిన ఏజెంట్లు, ఉద్యోగులు మొత్తం 15 మందిని నిందితులుగా తేల్చారు. వారిలో కొంతమంది వేర్వేరు ప్రాంతాల్లో ఉండటంతో వారికోసం ప్రత్యేకంగా పోలీసు బృందాలను పంపారు. అందరికీ సంకెళ్లు పడ్డాక సంయుక్తంగా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్‌ బ్యాంక్‌లో రికవరీ మేనేజర్‌గా పనిచేసిన ఆదిత్య భార్య సుజాత ఓ ప్రైవేట్‌ బ్యాంకు లాకర్‌లో తమ బంగారు ఆభరణాలు ఉంచారు. పోలీసులు బ్యాంకులకు వెళ్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఆమె తెలివిగా వాటిని విడిపించుకుని తీసుకెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సిట్‌ సిబ్బంది కొద్దిరోజుల క్రితం ఆ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

Updated Date - Oct 28 , 2025 | 12:30 AM