Share News

అంతిమంగా విడిపోయారు

ABN , Publish Date - Jul 18 , 2025 | 12:58 AM

ఊర్లు వేరైనా ఉపాధి ఇద్దరినీ కలిపింది. విధి కూడా విడదీయలేనంత స్నేహాన్ని పెంచింది. ప్రాణ స్నేహితులుగా మార్చింది. సాఫీగా సాగిపోతున్న వారి స్నేహంలోకి ఓ రౌడీషీటర్‌ ప్రవేశించాడు. వారి మైత్రిని చూసి కుళ్లుకున్నాడు. అదునుగా భావించి కత్తితో పొడిచి పొడిచి ఇద్దరు స్నేహితులను చంపేశాడు. విధి ఎంత బలీయమైనదో.. ఇన్నాళ్లూ కలిసుండి, మరణంలోనూ కలిసి పోరాడి, ఆ తర్వాత మాత్రం ఆ స్నేహితులు విడిపోయారు. ఒక స్నేహితుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు విజయనగరం తీసుకెళ్లిపోగా, మరో స్నేహితుడికి ఎవరూ లేకపోవడంతో అనాథలా మార్చురీలోనే ఉండిపోయాడు. బుధవారం గవర్నర్‌పేటలో జరిగిన జంట హత్య కేసులో ఇద్దరు స్నేహితుల కథ అలా విషాదాంతమైంది.

అంతిమంగా విడిపోయారు
మార్చురీ వద్ద రాజు, వెంకటరమణ మృతదేహాలు

ఇద్దరు స్నేహితుల కథ విషాదాంతం

జంట హత్యల కేసులో దారుణం

క్యాటరింగ్‌ పనిలో కలిసిన ఇద్దరు స్నేహితులు

కలిసిమెలిసి ఒకే గదిలో పెరిగిన మైత్రీబంధం

రౌడీషీటర్‌ రాకతో మొదలైన గొడవలు

ఇద్దరి స్నేహంపై పగ పెంచుకుని హత్య

వెంకటరమణ మృతదేహాన్ని తీసుకెళ్లిన బంధువులు

రాజు బంధువులు రాకపోవడంతో మార్చురీలోనే మృతదేహం

ఇన్నాళ్లూ కలిసి ఉన్న స్నేహం.. మరణంతో దూరం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయనగరానికి చెందిన జి.వెంకటరమణ (38) తన కుటుంబ అవసరాలకు డబ్బు పంపడానికి ఉపాధి నిమిత్తం విజయవాడ వచ్చాడు. ఇక్కడ క్యాటరింగ్‌ పనిలో చేరాడు. వన్‌టౌన్‌కు చెందిన ఎన్‌.రాజు (35) 15ఏళ్ల కిందట కుటుంబ సభ్యులతో గొడవ పడి బయటకు వచ్చేశాడు. అతడూ క్యాటరింగ్‌లో చేరాడు. ఆ తర్వాత ఇంటిముఖం చూడలేదు. తల్లిదండ్రులు, అన్నయ్య ఉన్నప్పటికీ ఎప్పుడూ ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. క్యాటరింగ్‌లో ఏర్పడిన పరిచయంతో రాజు, వెంకటరమణ గవర్నరుపేటలో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వీరిద్దరి మధ్యలోకి 20 రోజుల కిందట రౌడీషీటర్‌ జమ్ము కిషోర్‌ వచ్చాడు. క్యాటరింగ్‌ పనిలో చేరి, ఇద్దరు స్నేహితుల గదిలోకీ ప్రవేశించాడు. మొదటి నుంచి వారితో గొడవలు పడుతున్నాడు. రాజుతో ఎక్కువగా గొడవ పడినప్పుడు వెంకటరమణ మద్దతుగా ఉండేవాడు. రాజుపై కిషోర్‌ పలు సందర్భాల్లో దాడికి ప్రయత్నించాడు. ఆ సమయంలో వెంకటరమణ అడ్డుకున్నాడు. దీంతో కిషోర్‌లో వారిపై పగ పెంచుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం రాజు, వెంకటరమణతో పాటు బాషా, మరో యువకుడు మందు పార్టీ చేసుకున్నారు. ఉదయం 11 గంటల సమయంలో కిషోర్‌ గదికి వచ్చాడు. తాను నిద్రపోవాలని, ఇక్కడ మందు తాగితే ఎక్కడ నిద్రపోవాలని వారిని ప్రశ్నించాడు. వివాదం పెద్దదైంది. గదిలో ఉన్న కూరగాయలు కోసే కత్తి తీసుకుని రాజు, వెంకటరమణను కసితీరా పొడిచాడు. ఆ సమయంలో బాషాతో పాటు మరో యువకుడు అక్కడే ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే బాషా పరుగులు తీసుకుంటూ గవర్నరుపేట పోలీసుస్టేషన్‌కు వెళ్లి చెప్పాడు. కాగా, రాజు, వెంకటరమణ మృతదేహాలకు ప్రభుత్వాసుపత్రి మార్చురీలో గురువారం పోస్టుమార్టం నిర్వహించారు. వెంకటరమణ మరణవార్త తెలుసుకుని అతడి తల్లిదండ్రులు వెంకటరావు దంపతులు విజయనగరం నుంచి వచ్చారు. ఏకైక కుమారుడు చనిపోవడంతో వారు కన్నీరుమున్నీరై మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారు. కానీ, రాజుకు ఎవరూ లేకపోవడంతో అతని మృతదేహం అనాథలా మార్చురీలోనే ఉండిపోయింది.

సికింద్రాబాద్‌లో దొరికిన కిషోర్‌

రాజు, వెంకటరమణను హత్య చేసిన తర్వాత పారిపోయిన కిషోర్‌ పోలీసులకు లొంగిపోవాలనుకున్నాడు. వన్‌టౌన్‌లోని నైజాంగేటు ప్రాంతానికి చేరుకున్నాక మనసు మార్చుకున్నాడు. ఆ సమయంలో అతడి వద్ద రూ.6 వేలు ఉన్నాయి. నైజాంగేటు వద్ద రైళ్లు నెమ్మదిగా వెళ్తుంటాయి. అక్కడ రైలెక్కి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. గురువారం ఉదయం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి నైజాంగేటు వద్ద ఉన్న స్నేహితుడికి ఫోన్‌ చేశాడు. హత్య జరిగినప్పటి నుంచి కిషోర్‌ స్నేహితుడిని పోలీసులు ట్రాక్‌ చేస్తున్నారు. కాల్‌ రాగానే అతడిని అదుపులోకి తీసుకున్నారు. కిషోర్‌ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషనలో ఉన్నాడని నిర్ధారించుకున్న పోలీసులు అతడి ఫొటోలను హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు పంపారు. అక్కడి ప్రత్యేక బృందాలు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నాయి. విజయవాడ నుంచి ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి కిషోర్‌ను నగరానికి తీసుకొచ్చింది. కాగా, రౌడీషీటర్‌ కిషోర్‌లో భక్తికోణం కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

Updated Date - Jul 18 , 2025 | 12:58 AM