Share News

‘స్పా’ట్‌ మార్చారు

ABN , Publish Date - May 06 , 2025 | 12:58 AM

స్పా ముసుగు మార్చుకుంటోంది. ఇప్పటివరకు భవనాల్లో సాగిన మసాజ్‌ ఇప్పుడు లాడ్జీలవైపు మారింది. పోలీసుల తనిఖీలు ముమ్మరం కావడంతో స్పా సెంటర్‌ నిర్వాహకులు ఉత్తరాది అమ్మాయిలను లాడ్జీల్లోని ఓ గదిలో ఉంచి జస్ట్‌ డయల్‌ యాప్‌లో ఫోన్‌ నెంబర్‌ పెడుతున్నారు. ఆకర్షితులై వస్తున్న విటులను మరో గదిలో యథేచ్ఛగా వ్యభిచారం నడిపిస్తున్న వ్యవహారం గత శనివారం బట్టబయలు కాగా, ఇలాంటి మరిన్ని వ్యవహారాలు లాడ్జీల్లో జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

‘స్పా’ట్‌ మార్చారు
శనివారం నగరంలోని ఓ లాడ్జీలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉత్తరాది అమ్మాయిలు

స్పా సెంటర్ల నుంచి లాడ్జీలవైపు మళ్లిన వ్యభిచారం

ఉత్తరాది అమ్మాయిలను తీసుకొచ్చి గదుల్లో వ్యాపారం

పోలీసుల తనిఖీల నేపథ్యంలో స్పా నిర్వాహకుల ప్లాన్‌

ఓ యాప్‌ ద్వారా అన్ని వ్యవహారాలు ఫోన్‌లోనే..

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరంలోని స్పా కేంద్రాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఉత్తరాది యువతులతో చలసాని ప్రసన్న భార్గవ్‌ అనే వ్యక్తి అత్యాధునిక సాంకేతిక పరికరాలను అమర్చుకుని వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యవహారాన్ని మాచవరం పోలీసులు బట్టబయలు చేశారు. దీంతో చాటుమాటుగా స్పా కేంద్రాలను నిర్వహిస్తున్న వారంతా రూటు మార్చారు. ఎలా అంటే..

తొలుత ఉత్తరాది యువతులకు వల

తొలుత స్పా కేంద్రాల నిర్వాహకులు ఉత్తరాది ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారు. కోల్‌కతా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ముంబయి ప్రాంతాల్లో ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువతులకు వివిధ స్పా కేంద్రాల్లో పనిచేసే యువతులతో ట్రాప్‌ వేయిస్తున్నారు. నెలకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఆదాయం చూపిస్తామని చెప్పి ఇక్కడికి తీసుకొస్తున్నారు. తర్వాత వారిని సెక్స్‌ సర్వీసులకు ఉపయోగిస్తున్నారు.

లాడ్జీల్లో రాసలీలలు

సాధారణంగా సినిమాలు, టీవీ షోల్లో అవకాశాల కోసం ఎదురుచూసే అమ్మాయిలకు ఆడిషన్స్‌ నిర్వహిస్తారు. ఉత్తరాది నుంచి తీసుకొచ్చే యువతులను ఎంపిక చేసుకోవడానికి నిర్వాహకులు ఇలాంటి ఆడిషన్సే నిర్వహిస్తున్నారు. చూడగానే విటులు మంత్రముగ్ధులయ్యే అందమైన అమ్మాయిలను ఎంచుకుని వారితో కాంట్రాక్ట్‌ కుదుర్చుకుంటున్నారు. వారికోసం నగరంలోని లాడ్జీల్లోప్రత్యేక గదులు బుక్‌ చేస్తున్నారు. ఉత్తరాది రాషా్ట్రల్లోని సిటీల నుంచి ఐదారుగురిని ఎంపిక చేసి ఇక్కడికి తీసుకొస్తున్నారు. లాడ్జీల్లో రెండు గదులను పక్కపక్కనే ఉండేలా బుక్‌ చేస్తున్నారు. ఒక గదిలో యువతులను ఉంచుతున్నారు. మరో గదిని రాసలీలలు సాగించేందుకు ఉపయోగిస్తున్నారు. విటులు సంప్రదించడానికి నిర్వాహకులు ప్రత్యేకంగా ఒక సెల్‌ నెంబరు తీసుకుంటున్నారు. ఆ నెంబర్‌ను జస్ట్‌ డయల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈ నెంబరుకు ఫోన్‌ చేసిన వారికి లాడ్జీ చిరునామా, గది నెంబరు చెప్పి పంపుతున్నారు. అక్కడికి వెళ్లిన విటులు నచ్చిన యువతిని తీసుకుని పక్క గదిలోకి వెళ్తున్నారు. ఇలా ఆ యువతులను రెండు, మూడు రోజులకు ఒక లాడ్జీ నుంచి మరో లాడ్జీకి మారుస్తున్నారు. ఒకే లాడ్జీలో ఎక్కువ రోజులు ఈ యువతులను ఉంచడం వల్ల సమాచారం పోలీసులకు చేరుతుందన్న ఉద్దేశంతో నిర్వాహకులు ఇలా ప్లాన్లు వేస్తున్నారు.

Updated Date - May 06 , 2025 | 12:58 AM