పదోన్నతుల పైసా వసూల్
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:48 AM
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రీతిలో విజయవాడ కార్పొరేషన్‌లోని అధికార వైసీపీ ఆలోచిస్తోంది. అధికారం ఉన్న కొద్దిరోజుల్లో మామూళ్లు దండుకునే అవకాశాలను సృష్టించుకుంటోంది. ఇందుకోసం తాజాగా హెల్త్ అసిస్టెంట్ల పదోన్నతుల పేరుతో హెల్త్ వర్కర్ల నుంచి రూ.లక్షలు వసూలు చేసే కుట్రకు తెరతీసింది. ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలను పక్కన పెట్టి, కమిషనర్‌ను ఏమార్చి హెల్త్ అసిస్టెంట్ల పదోన్నతులకు అంగీకారం తీసుకున్నారు. కొద్దిరోజుల్లో స్టాండింగ్ కమిటీ ముందుంచి, ఆమోదం పొందేందుకు పావులు కదుపుతున్నారు.
కార్పొరేషన్‌లో అధికార వైసీపీ నిర్వాకం
డబ్బు కోసం లేని పోస్టులను సృష్టించే ప్రయత్నం
పాత జీవో పేరు చెప్పి కమిషనర్‌ను ఏమార్చి..
స్టాండింగ్ కమిటీలో పెట్టి.. ఆమోదించుకునే కుట్ర
హెల్త్ అసిస్టెంట్ల పదోన్నతులంటూ హెల్త్ వర్కర్లకే గేలం
రూ.లక్షల్లో వసూలు.. చేతి‘వాటాలు’
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ కార్పొరేషన్‌లోని ప్రజారోగ్య శాఖలో ఎంతమంది ఉద్యోగులు పనిచేయాలన్న దానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. 2008లో హెల్త్ అసిస్టెంట్ల పదోన్నతులకు సంబంధించి ఇచ్చిన 780 జీవో ప్రకారం శానిటరీ మేసి్త్ర ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ, బైపీసీ ఉత్తీర్ణుడై ఉండాలి. అయితే, రెండేళ్ల తర్వాత ఆ జీవోను సవరించారు. 2010లో 218 జీవో ఇచ్చి, శానిటేషన్ టెక్నాలజీ (డిప్లొమా) కోర్సు చేసిన వారే శానిటరీ మేసి్త్రగా అర్హులని నిర్ణయించారు. అలాగే, లక్షమంది జనాభాకు ఒక హెల్త్ అసిస్టెంట్ ఉండాలని నిర్దేశించారు. దీనిప్రకారం చూస్తే ప్రస్తుత విజయవాడ జనాభా 15.6 లక్షలు ఉండగా, 16 మంది హెల్త్ అసిస్టెంట్లకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విజయవాడలో 16 మంది హెల్త్ అసిస్టెంట్లు ఉన్నారు. కాబట్టి అదనంగా హెల్త్ అసిస్టెంట్లను తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, కాసుల కోసం అధికారపక్షం హెల్త్ అసిస్టెంట్లు అవసరమన్న వాదనను తెరపైకి తెచ్చింది. హెల్త్ వర్కర్లుగా పనిచేస్తున్న వారికి హెల్త్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వటం ద్వారా అదనంగా మరో ఐదుగురిని నియమించాలని కుట్ర పన్నింది. జనాభా ప్రకారం 16 పోస్టులను 21కు చేర్చాలని నిర్ణయించింది. ఎడాపెడా పోస్టులు తీసుకుంటే అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో తొలుత ఐదుగురికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. కొందరు హెల్త్ వర్కర్లతో బేరాలు సాగించారు. పదోన్నతి కల్పిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల చొప్పున మొత్తం ఆరుగురు హెల్త్ వర్కర్ల దగ్గర రూ.30 లక్షలకు బేరం పెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ డబ్బును అధికారపక్షంలోని బిగ్‌బాస్‌తో పాటు స్టాండింగ్ కమిటీ, ప్రజారోగ్యశాఖలోని ఓ అధికారికి వాటాలు పంచేలా ఒప్పందాలు జరిగినట్టు తెలుస్తోంది.
పాత జీవో ప్రకారమే స్కెచ్
సవరించిన కొత్త జీవో ప్రకారమే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాల్సి ఉండగా, కార్పొరేషన్‌లోని అధికారపక్షం మాత్రం పాత 780 జీవోను తెరపైకి తెచ్చింది. దీని ప్రకారమే హెల్త్ అసిస్టెంట్ల పదోన్నతులకు రంగం సిద్ధం చేసింది. కొత్త జీవో ప్రకారం శానిటేషన్ టెక్నాలజీలో డిప్లొమా విద్యార్హత ఉండాలి. అలాకాకుండా, పాత జీవో ప్రకారం ఇంటర్ విద్యార్హత ఉన్న వారిని తీసుకోవాలని నిర్ణయించింది. కొత్త జీవో అయితే కొత్తగా ఎవరినీ తీసుకోవటానికి అవకాశం ఉండదు కాబట్టి, పాత జీవోను తెలివిగా అమలు చేశారు.