దొంగబిల్లుల దోపిడీ..!
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:05 AM
అప్పనంగా ప్రభుత్వ డబ్బు కొట్టేయటానికి విజయవాడ కార్పొరేషన్‌లోని వైసీపీ పాలకపక్షం వేసిన స్కెచ్ చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. 2020లో వైసీపీ హయాంలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమానికి సంబంధించిన అక్రమ బిల్లులను కూటమి ప్రభుత్వం వచ్చాక చెల్లింపులు చేసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తోంది. ఈ అక్రమ బిల్లులను సక్రమం చేసుకునేందుకు స్టాండింగ్ కమిటీ అజెండాలో చేర్చింది. శుక్రవారం మేయర్ అధ్యక్షతన జరగనున్న స్టాండింగ్ కమిటీలో ఈ అంశం ప్రధానంగా చర్చకు రానుండగా, దీనివెనుక పాలక పక్షానికి లబ్ధి కలిగేలా భారీ ముడుపుల వ్యవహారాలు, అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. రూ.కోటి కథ కూడా దీని వెనుకే నడుస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

కార్పొరేషన్‌లోని పాలకపక్షం బరితెగింపు
నేటి స్టాండింగ్ కమిటీ ముందుకు దొంగబిల్లులు
2020లో పారిశుధ్య నిర్వహణకు 150 మంది కార్మికులు
సగంమందితో పనిచేయించి 150 మందికీ బిల్లులు
మరో పారిశుధ్య కార్యక్రమంలోనూ ఇదే పరిస్థితి
నాటి బిల్లులను నేడు ఆమోదించుకునే కుట్ర
రూ.లక్షల్లో దోచేసేందుకు ప్రయత్నాలు
వీటి ఆమోదం తర్వాత మరో పెద్ద ఫైల్‌కు స్కెచ్
వరదల సమయంలో పనివారి బిల్లులు రూ.కోటి
తక్కువ మందితో పనులు.. ఎక్కువ మందిగా లెక్కలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : 2020లో విజయవాడ కార్పొరేషన్‌లోని ప్రజారోగ్యశాఖ నేతృత్వంలో స్వచ్ఛత సర్వేక్షణ్ పేరుతో నగరంలోని పలు డివిజన్లలో శానిటేషన్ పనుల కోసమని కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేందుకు 150 మందిని తీసుకునేందుకు ఓ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారు. ఆ ఏజెన్సీ నడుపుతున్న కాంట్రాక్టర్ దాదాపు వారం పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. కానీ, కార్పొరేషన్ నిర్దేశించిన 150 మంది కాకుండా, అందులో సగంమంది మాత్రమే పనిచేశారు. ప్రజారోగ్యశాఖ అధికారులు మాత్రం మొత్తం పనిచేసినట్టుగా ఫైల్‌ను తయారు చేశారు. ఈ వ్యవహారంలో ప్రజారోగ్యశాఖలోని సెక్షన్ ఉద్యోగి ఒకరు చక్రం తిప్పినట్టుగా తెలుస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ప్రజారోగ్యశాఖాధికారిణి హస్తం కూడా ఇందులో ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనిచేసిన ఒక్కో సిబ్బందికి రోజుకు రూ.400 ప్రాతిపదికన చెల్లించాలి. ఈ లెక్కన అందరూ పనిచేస్తే రోజుకు రూ.60 వేల చొప్పున ఏడు రోజులకు రూ.4.20 లక్షలు చెల్లించాలి. ఇలా ఏడు రోజులకు తీసుకున్న వారిని 21 రోజుల పాటు ఉపయోగించుకున్నారు. 21 రోజులకు కలిపి రూ.16.80 లక్షలు చెల్లించేందుకు స్థాయీ సంఘం ముందు ప్రతిపాదన పెట్టారు. వాస్తవానికి ఇందులో సగంమంది మాత్రమే పనిచేశారు. కాబట్టి బిల్లు రూ.8 లక్షల్లోపే చెల్లించాల్సి ఉంటుంది. కానీ, కార్పొరేషన్ వైసీపీ పాలకపక్షం మాత్రం తెలివిగా ఆ ఏజెన్సీతో డీల్ కుదుర్చుకుని మొత్తం పనిచేసినట్టుగా బిల్లు చెల్లించటానికి సిద్ధం కావటం గమనార్హం.
మరో కార్యక్రమంలో కూడా..
స్వచ్ఛత సర్వేక్షణ్‌లో భాగంగా నగరంలోని పలు డివిజన్లలో శానిటేషన్ పేరుతో నామినేషన్ ప్రాతిపదికన మరో ఏజెన్సీ నుంచి 150 మందిని పనివారిని తీసుకున్నారు. వీరిని కూడా అప్పట్లో వారం రోజులకే తీసుకున్నా 28 రోజుల పాటు కొనసాగించారు. వీరి ఏజెన్సీకి కూడా రూ.16.80 లక్షలు చెల్లించాలన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ రెండు ఏజెన్సీలు కూడా క్షేత్రస్థాయిలో సగం సిబ్బందినే నియమించాయి. కానీ, పూర్తి సిబ్బంది ఉన్నట్టుగా బిల్లులు చెల్లించేందుకు పావులు కదిపారు. దొంగ బిల్లులు పెట్టుకోవటానికి సిద్ధమయ్యారని కమిషనర్ ధ్యానచంద్రకు ఫిర్యాదులు రావటంతో ఆయన చెల్లింపులకు సిద్ధపడలేదు. దీంతో తెలివిగా పాలకపక్ష సభ్యులు స్థాయీసంఘం దృష్టికి తీసుకొచ్చి ఆమోదింపజేసేందుకు పావులు కదిపారు. స్థాయీసంఘంలో కచ్చితంగా ఆమోదం పొందితేనే డబ్బు చెల్లించే వీలుంటుంది. కొన్ని సందర్భాల్లో కమిషనర్ ముందుగా డబ్బు చెల్లించినా వాటిని స్టాండింగ్ కమిటీ సమావేశంలో పెట్టి ర్యాటిఫై ప్రతిపాదనలు తీసుకొస్తారు. ఈ రెండు ప్రతిపాదనల పేరుతో రూ.16 లక్షలకు పైగా నొక్కేయటానికి వైసీపీ పాలకపక్షం కన్నేసింది.
రూ.కోటి కొట్టేసే కుట్ర
వరదల సమయంలో పారిశుధ్య నిర్వహణ కోసం 250 మందిని తీసుకోవటానికి నామినేషన్ ప్రాతిపదికన మరో ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో ఇంజనీరింగ్ విభాగం వీరిని నియమించింది. క్షేత్రస్థాయిలో కేవలం 100 మందిలోపే పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ, 250 మంది పనిచేసినట్టుగా బిల్లులు పెట్టుకోవటానికి సిద్ధం చేశారు. ఈ ఫైల్ విలువ రూ.కోటికి పైగా ఉంటుంది. ఈ ఫైల్‌ను ఆమోదించటానికి వీలుగా ముందుగా పై రెండు ఫైళ్లను గప్‌చుప్‌గా పరిష్కరించాలనుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవి ఆమోదం అయిపోతే, ఆ తర్వాత రూ.కోటి ఫైల్‌ను కూడా ఆమోదించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రజారోగ్యశాఖలో పనిచేసే ఉద్యోగి ఈ ఒప్పందాన్ని నడిపినట్టుగా తెలుస్తోంది.