Share News

ప్రమాదానికి దారులు

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:56 AM

జిల్లాలోని రహదారులపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. అడుగుకో గొయ్యితో అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నాయి. కనీస మరమ్మతులైనా చేయండి మహాప్రభో.. అంటూ ప్రజలు వేడుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కొద్దిపాటి వర్షం కురిస్తే రహదారులపై వర్షపునీరు నిలిచి ఎక్కడ గోతులున్నాయో, ఎక్కడ రోడ్డు ఉందో తెలియని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో రాష్ట్ర, జిల్లా రహదారులు 2,786.50 కిలోమీటర్ల మేర ఉండగా, సగానికి పైగా గోతులమయంగానే ఉండటం గమనార్హం. - ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం

ప్రమాదానికి దారులు
పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురంలో ఆర్‌అండ్‌బీ రోడ్డు పరిస్థితి ఇది

దారుణంగా జిల్లాలోని రహదారులు

తుఫాను, భారీ వర్షాల తాకిడికి అస్తవ్యస్తం

గుంతలు పడి.. కంకర లేచి.. తారు కొట్టుకుపోయి..

చాలాచోట్ల నిధులు విడుదలైనా పనుల్లో జాప్యం

ప్రమాదాలకు గురవుతున్న వాహనచోదకులు

పట్టపగలూ ప్రయాణానికి నరకయాతనే..

మరమ్మతులు చేయించాలంటున్న స్థానికులు

వివిధ ప్రాంతాల్లో రహదారుల దుస్థితి ఇలా..

  • మచిలీపట్నం-కమ్మవారిచెరువు వయా చిన్నాపురం రహదారి విస్తరణ పనులను ఐదేళ్ల క్రితం ప్రారంభించారు. ఉన్న రోడ్డును పగలగొట్టారు. అనంతరం వేర్వేరు కారణాలతో ఈ పనులు నిలిపివేశారు. ఈ ఏడాది సంభవించిన వాయుగుండం, మొంథా తుఫాను కారణంగా ఈ రహదారి గుంతలమయంగా మారింది. ఏడు కిలోమీటర్ల ర హదారికి మరమ్మతులు చేసేందుకు రూ.6 కోట్ల అంచనాలు రూపొందించారు. మచిలీపట్నం-కమ్మవారిచెరువు వయా కోన రహదారి 3.630 కిలోమీటర్ల మేర రూ.3 కోట్లతో మరమ్మతులు చేసేందుకు అనుమతులు ఇచ్చారు. ఎప్పటికి పనులు చేస్తారో తెలియని దుస్థితి నెలకొంది.

  • పామర్రు నుంచి చల్లపల్లి వరకు 27.2 కిలోమీటర్ల మేర రహదారి ఉంది. ఇది రాష్ట్ర రహదారి. పామర్రు వద్ద జాతీయ రహదారి 216-ఏకు అనుసంధానం చేసి, జాతీయ రహదారుల ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని పాలకులు, అధికారులు ఏళ్ల తరబడి చెబుతూనే ఉన్నారు. కానీ, దీనిని జాతీయ రహదారిగా మార్చకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ రహదారిని అభివృద్ధి చేసేందుకు సాంకేతిక కారణాలు చూపి అలానే ఉంచేశారు. దీంతో పదేళ్లుగా ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. ఈ రహదారి కూచిపూడి, మొవ్వ గ్రామాల మీదుగా చల్లపల్లి వెళ్తుంది. గుంతలమయంగా మారడంతో పలు గ్రామాల ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు.

  • గుడివాడ-కంకిపాడు రహదారి 28.4 కిలోమీటర్లమేర ఉంది. ఈ రహదారిని అభివృద్ధి చేయకుండా అలాగే వదిలేశారు. పెదపారుపూడి నుంచి వెంట్రప్రగడ వరకు 5 కిలోమీటర్ల మేర రహదారి పనులను నిలిపివేశారు. కనీస మరమ్మతులు కూడా చేయట్లేదు. దీంతో పెద్ద గోతులు ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుడివాడ-పోలుకొండ 12 కిలోమీటర్ల మేర రహదారి పూర్తిగా పాడైంది. అయినా బాగుచేయలేదు. నందివాడ నుంచి లక్ష్మీనరసింహపురం వరకు ఉన్న రహదారి పాడైనా పట్టించుకునేవారు లేరు.

  • గన్నవరం-పుట్టగుంట రహదారి 8,800 కిలోమీటర్ల గుంతలమయంగా మారింది. ఈ రోడ్డును రూ.7 కోట్ల అంచనాలతో మరమ్మతులకు అనుమతులు వచ్చినా పనులు ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

  • పెడన నియోజకవర్గం నడుపూరు-వాడవల్లి కోరుకొల్లు రహదారి 4.800 కిలోమీటర్ల మేర దెబ్బతింది. ఈ రహదారిని ఎప్పటికి అభివృద్ధి చేస్తారో తెలియక స్థానికులు అవస్థలు పడుతున్నారు.

  • కోసూరు వయా నిమ్మకూరు, అవిరిపూడి రహదారితో పాటు నిమ్మకూరు వయా పోలవరం, ఉండ్రపూడి, నిభానుపూడి రహదారి 8 కిలోమీటర్ల మేర గుంతలయమంగా మారాయి.

  • నాగాయలంక-కోడూరు ర హదారితో పాటు అవనిగడ్డ ఫ్లడ్‌బ్యాంకు నుంచి అశ్వారావుపాలెం వరకు, నాగాయలంక-నాలి రహదారులు ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. రహదారులకు కనీస మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

  • జిల్లాలోని తొమ్మిది రాష్ట్ర, జిల్లా రహదారులను పూర్తిస్థాయిలో గుంతలు లేకుండా చేసేందుకు గతనెలలో ప్రభుత్వం రూ.40.70 కోట్లు విడుదల చేసింది. టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి పనులు త్వరగా చేపట్టాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Nov 23 , 2025 | 12:56 AM