అసౌకర్యాల ఆవాసాలు
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:47 AM
జగనన్న లే అవుట్లలో కనీస సౌకర్యాలు లేక నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని 665 లే అవుట్లలో సెంటు, సెంటున్నర భూమి చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినా అధికశాతం లబ్ధిదారులకు నేటికీ వారికి కేటాయించిన స్థలం ఎక్కడుందో తెలియదు. తమ స్థలం ఎక్కడుందో తెలుసుకుని, ఇళ్లు నిర్మించుకున్న వారికి కనీస సౌకర్యాలు కల్పించలేదు. దీంతో జిల్లాలోని చాలా లే అవుట్లలో నివాసితులు పడరాని పాట్లు పడుతున్నారు.

జగనన్న లే అవుట్లలో కనీస సౌకర్యాలు మృగ్యం
కొన్నిచోట్ల ఇళ్లు నిర్మించినా రహదారులు లేవు
మెరక పనుల్లో నాటి వైసీపీ నేతల చేతివాటం
తూతూమంత్రంగా పనులు.. నేడు అవస్థలు
వర్షం పడితే కాలు బయటపెట్టలేని పరిస్థితి
జిల్లాలో 665 లే అవుట్లలో ఇదే దుస్థితి
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని 665 లే అవుట్లలో 86,084 ఇళ్లు నిర్మిస్తామని గత వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. కొందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఇందులో ఇప్పటివరకు 28,456 ఇళ్లు నిర్మించారు. 29,080 ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభమే కాలేదు. 28,548 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే, ఇప్పటికే ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నవారు కాలు బయటపెట్టాలంటే భయపడిపోతున్నారు. ఈ లే అవుట్లలో మెరక పనులు సక్రమంగా చేయలేదు. తూతూమంత్రంగా చేసి బిల్లులు పెట్టుకున్నారు. ఈ కాలనీల్లో అంతర్గత రహదారుల పనులు చేయించే బాధ్యత అప్పట్లో పంచాయతీరాజ్ విభాగానికి అప్పగించారు. గన్నవరం, తదితర మండలాల్లోని లే అవుట్లలో రహదారుల నిర్మాణ పనులు చేసినా బిల్లులు మంజూరు కాకపోవడంతో కొందరు కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు.
అంతర్గత రహదారులు లేక ఇబ్బందులు
జగనన్న లే అవుట్లలో అంతర్గత రహదారులు నిర్మించకపోవడంతో నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. మచిలీపట్నం మండలం రుద్రవరంలో ఏర్పాటుచేసిన రెండు లే అవుట్లలో సగానికి పైగా లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకున్నారు. ఈ లే అవుట్లలో రూ.1.50 కోట్లతో మెరక పనులు చేశామని బిల్లులు కూడా చేసుకున్నారు. కానీ, పనులు సక్రమంగా చేయలేదు. ఇళ్ల మధ్య రహదారులకు సంబంధించి పనులు చేయనేలేదు. దీంతో ఈ కాలనీలో నివాసం ఉంటున్నవారు ఇళ్లలోకి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో కొద్దిపాటి వర్షానికే అంతర్గత రహదారులు బురదగా మారుతున్నాయి. రుద్రవరం లే అవుట్‌కు సమీపంలోని గుండుపాలెం పల్లెపాలెంలో ఇళ్ల స్థలాలుగా ఇచ్చిన భూమి పల్లపు ప్రాంతంలో ఉంది. ఈ లే అవుట్‌లో మెరక సక్రమంగా చేయకుండానే వైసీపీ నాయకులు బిల్లులు చేసుకున్నారు. ఈ లే అవుట్ వద్ద ఇళ్ల నిర్మాణం నిమిత్తం ఇటుకలు, ఇసుక, కంకర, ఇతరత్రా మెటీరియల్‌ను ట్రాక్టర్లలో సైతం తీసుకెళ్లేందుకు అవకాశంలేని పరిస్థితి ఏర్పడింది. కరగ్రహారంలోని లే అవుట్‌లో 16 వేల మందికి సెంటు భూమి చొప్పున ఇచ్చారు. ఇక్కడ అంతర్గత రహదారులకు సంబంధించి ఒక్క పని కూడా జరగలేదు. గన్నవరం మండలం కేసరపల్లి లే అవుట్‌కు వెళ్లేందుకు రూ.3 కోట్లతో ఏడాదిన్నర కాలం క్రితం వంతెన నిర్మాణానికి అనుమతులు వచ్చాయని ప్రచారం చేశారు. ఇంతవరకు ఈ వంతెన పనులు ప్రారంభించలేదు. ఇక్కడ ఎకరం రూ.70 లక్షలకు పైగా చెల్లించి మరీ 60 ఎకరాలు కొని లే అవుట్ వేశారు. 3,400 మందికి స్థలాలు ఇచ్చారు. ఈ లే అవుట్‌కు వెళ్లే దారికోసం వంతెన నిర్మాణాన్ని మాత్రం పక్కన పెట్టేశారు. దీంతో ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని లే అవుట్లలో అంతర్గత రహదారులను మెరక చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ తరచూ అధికారులకు సూచిస్తున్నా, ఆ దిశగా అంచనాలు కూడా తయారు చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రతిపాదనలు లేవ్..!
జిల్లాలోని జగనన్న లే అవుట్లలో అంతర్గత రహదారులను అభివృద్ధి చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదనలు, అంచనాలు తయారు చేయలేదని పంచాయతీరాజ్ విభాగం అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అంచనాలు తయారుచేసి పనుల కోసం టెండర్లు పిలిచినా, కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని, దీంతో ఈ పనులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటున్నారు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో కొందరు కాంట్రాక్టర్లు కోర్టులను ఆశ్రయించారని, దీంతో ఈ కేసులకు సంబంధించిన వాయిదాల నిమిత్తం కోర్టుల చుట్టూ తిరుగుతున్నామంటున్నారు. స్థలాలు ఇచ్చేందుకు భూమి కొనుగోలు, మెరక పనులు వైసీపీ నాయకులు సక్రమంగా చేయకపోవడం తదితర అంశాలపై పలు లే అవుట్లలో జరిగిన అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విజిలెన్స్ అధికారులతో విచారణ చేయిస్తోంది. ఈ లెక్కలన్నీ ఎప్పటికి కొలిక్కివస్తాయి.. ఎప్పటికి అంతర్గత రహదారుల పనులు చేస్తారనే అంశం సందిగ్ధంగా మారింది. ఈ వేసవిలోనైనా లే అవుట్లలో అంతర్గత రహదారులను కనీసంగానైనా మెరక చేయించాలని నివాసితులు కోరుతున్నారు.