Share News

మామి..డీలా

ABN , Publish Date - May 16 , 2025 | 01:15 AM

ఈ ఏడాది మామిడి వ్యాపారం కుదేలైంది. కరోనా సమయాన్ని మినహాయిస్తే దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా ఎగుమతులు పడిపోయాయి. ఉత్తరాది రాషా్ట్రల వ్యాపారులు, వాహనాలతో ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ మార్కెట్‌ ఆసియాలోనే అతిపెద్దది. అలాంటి మార్కెట్‌లో ఈసారి దుకాణాలు అరకొర కాయలతోనే కనిపిస్తున్నాయి. అకాల వర్షాలు, గాలివానలకు తోడు అటు కోడిపేను తెగులు, ఇటు మామిడి రైతులనే కాకుండా వ్యాపారులను కూడా నిండా ముంచేసింది.

మామి..డీలా
నున్న మార్కెట్‌లో వ్యాపారాలు లేక దిగాలుగా..

వెలవెలబోతున్న నున్న మ్యాంగో మార్కెట్‌

గతంతో పోలిస్తే పడిపోయిన అమ్మకాలు

కోడిపేను తెగులుతో పాడైపోయిన కాయలు

అకాల వర్షం, గాలివానల ప్రభావం ఎక్కువే..

ఎగుమతులు లేక కుదేలైన రైతులు, వ్యాపారులు

విజయవాడ రూరల్‌, మే 15 (ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది మామిడి వ్యాపారం కుదేలైంది. కరోనా సమయాన్ని మినహాయిస్తే దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా ఎగుమతులు పడిపోయాయి. ఉత్తరాది రాషా్ట్రల వ్యాపారులు, వాహనాలతో ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ మార్కెట్‌ ఆసియాలోనే అతిపెద్దది. అలాంటి మార్కెట్‌లో ఈసారి దుకాణాలు అరకొర కాయలతోనే కనిపిస్తున్నాయి. అకాల వర్షాలు, గాలివానలకు తోడు అటు కోడిపేను తెగులు, ఇటు మామిడి రైతులనే కాకుండా వ్యాపారులను కూడా నిండా ముంచేసింది.

అకాల వర్షాలు, తెగుళ్లతో తగ్గిన దిగుబడి

ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా మామిడి పూత పూసింది. అయితే, కాయకాసే సమయానికి కోడిపేను తెగులు పట్టి పూత మొత్తం మాడిపోయింది. గోరుచుట్టు మీద రోకలిపోటు అన్నట్టు అకాల వర్షాలు, గాలివానలతో పంట దిగుబడి భారీగా తగ్గిపోయింది. కాసిన అరకొర కాయలు కూలీలను పెట్టి కోసి మార్కెట్‌కు తీసుకొచ్చే పరిస్థితులు లేవు.

పడిపోయిన ఎగుమతులు

గతంతో పోలిస్తే మ్యాంగో మార్కెట్‌లో ఎగుమతులు భారీగా పడిపోయాయి. గతంలో ఇక్కడి నుంచి సీజన్‌లో రోజుకు 400 నుంచి 500 టన్నుల ఎగుమతులు జరిగేవి. అయితే ఈ ఏడాది రోజుకు 200 టన్నులు ఎగుమతులుకావడమే కష్టంగా మారింది.

టన్ను రూ.25 వేలు పలికితే ఎక్కువే..

మామిడి సీజన్‌ ప్రారంభ, ముగింపు సమయాల్లో బంగినపల్లి, రసాలు టన్ను రూ.50 వేల నుంచి రూ.55 వేల వరకు పలికేది. ఇక సీజన్‌లో టన్ను రూ.30 వేల నుంచి రూ.35 వేలు ఉండేది. అయితే, ఈ ఏడాది సీజన్‌లో టన్ను మొదటి క్వాలిటీ రూ.25 వేలు పలకడం గగనమైంది. తక్కువ రకం కాయల ధరలు రూ.10 వేల నుంచి రూ.15 వేలు పలికితే ఎక్కువగా ఉంది. సాధారణంగా మూడు టన్నుల కాయలు కూలీలను పెట్టి కోసి మార్కెట్‌కు వాహనాల ద్వారా తరలించేందుకు రూ.10 వేలపైనే రైతులకు ఖర్చవుతుంది. మొదటి రకం కాయలైతే ఫర్వాలేదు కానీ, తక్కువ రకం కాయలైతే రైతులకు కూడా మిగిలేదేం ఉండదు.

అకాల వర్షంతో లావెక్కిన కాయలు

నున్న మామిడి మార్కెట్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు ఎగుమతులు అవుతుంటాయి. ఆయా రాషా్ట్రల్లో మన మామిడికి మంచి డిమాండ్‌ ఉంది. అయితే, అకాల వర్షం కారణంగా కాయ నీరెక్కి సైజు పెరగడం ఎగుమతులపై ప్రభావం చూపిందని వ్యాపారులు చెబుతున్నారు. సైజు పెరిగిన కాయ కొనడానికి ఆయా రాషా్ట్రల్లో వినియోగదారులు ఇష్టపడరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 16 , 2025 | 01:15 AM