నిధి.. హతవిధీ..!
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:36 AM
గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, అక్రమ మైనింగ్ కార్యకలాపాల వల్ల ఉమ్మడి కృష్ణాజిల్లాకు మూడేళ్లుగా ఎలాంటి ఆదాయం రాలేదు. లక్షలాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్, ఇతర నిక్షేపాలను తవ్వుకుపోయిన అక్రమార్కులు రూ.కోట్లు గడించినా ప్రభుత్వానికి మాత్రం పైసా చెల్లించింది లేదు.
నీరుగారుతున్న మైనింగ్ మినరల్ ఫండ్ లక్ష్యం
ఉమ్మడి కృష్ణాజిల్లాకు రూ.180.17 కోట్ల ఆదాయం
సింహభాగం గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనిదే..
వైసీపీ హయాంలో అనధికారిక మైనింగ్ కార్యకలాపాలు
భారీగా అక్రమార్జన.. ప్రభుత్వానికి పైసా చెల్లించలేదు
ఉన్న నిధులను ఉపయోగించడంలో జిల్లా యంత్రాంగం విఫలం
మైనింగ్ ప్రాంతాలను మరిచి.. ఇతర కార్యక్ర మాలకు వినియోగం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : 2015లో టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా మినరల్ ఫౌండేషన్ చట్టాన్ని తీసుకొచ్చారు. అధికారిక మైనింగ్ కార్యకలాపాల ద్వారా 2016 నుంచి ఉమ్మడి కృష్ణాజిల్లా యంత్రాంగానికి భారీగా ఆదాయం సమకూరింది. ఈ ఆదాయాన్ని జిల్లా మినరల్ ఫండ్ (డీఎంఎఫ్)గా పేర్కొంటారు. కాగా, 2016 నుంచి 2022 వరకు మాత్రమే అధికారికంగా మైనింగ్ కార్యకలాపాలు జరిగాయి. అయినప్పటికీ ఉమ్మడి కృష్ణాజిల్లా యంత్రాంగానికి భారీగానే మినరల్ ఫండ్స్ వచ్చాయి. 2022 నుంచి వైసీపీ ప్రభుత్వం ముగిసే వరకు ఎలాంటి ఆదాయం రాలేదు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జోరుగా సాగటమే ఇందుకు కారణం. గ్రావెల్ నిక్షేపాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ.. అనధికారికంగా లక్షలాది క్యూబిక్ మీటర్లు తవ్వేసి సొమ్ము చేసుకున్నారు. ఎన్నికలకు ముందు రెండేళ్లు జరిగిన ఈ అనధికార మైనింగ్ వల్ల ఉమ్మడి కృష్ణాజిల్లాకు పైసా ఆదాయం రాలేదు.
మొత్తం మినరల్ ఫండ్ రూ.180.17 కోట్లు
ఉమ్మడి కృష్ణాజిల్లాలో అధికారిక మైనింగ్ కార్యకలాపాల ద్వారా 2016 నుంచి ఇప్పటివరకు (వైసీపీ హయాంలోని రెండేళ్లు మినహా) రూ.180.17 కోట్ల ఆదాయం సమకూరింది. వైసీపీ హయాంలోని ఆ రెండేళ్లు కూడా మినరల్ ఫండ్ వచ్చి ఉంటే ఆదాయం రూ.250 కోట్ల వరకూ వెళ్లేది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సింహభాగం మినరల్ ఫండ్స్ వచ్చాయి. అప్పుడు ఉమ్మడి కృష్ణాజిల్లాగా ఉండటంతో అప్పటి కలెక్టర్లు ఈ నిధుల్లోని రూ.47.62 కోట్లను వివిధ కార్యక్రమాలకు ఖర్చు పెట్టారు. 2022, జూన్ 10 నాటికి ఉమ్మడి కృష్ణాజిల్లా ఖాతాలో రూ.132.55 కోట్ల మినరల్ ఫండ్ మిగిలి ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల విభజన కారణంగా రూ.75.66 కోట్ల మినరల్ ఫండ్‌లో రూ.17.78 కోట్లు కృష్ణాజిల్లాకు, రూ.55.60 కోట్లు ఎన్టీఆర్ జిల్లాకు, రూ.2.28 కోట్లు ఏలూరు జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు కేటాయించారు. ఇంకా రూ.56.89 కోట్ల మినరల్ ఫండ్స్ మిగిలి ఉన్నాయి. వీటిని దామాషా ప్రకారం కృష్ణాజిల్లాకు రూ.13.37 కోట్లు, ఎన్టీఆర్ జిల్లాకు రూ.41.80 కోట్లు, ఏలూరు జిల్లాకు రూ.1.72 కోట్లు బదలాయించారు.
మైనింగ్ ప్రభావిత ప్రాంతాలకే ఖర్చు చేయాలి
అధికారిక మైనింగ్ కార్యకలాపాల ద్వారా రాయల్టీగా వచ్చే జిల్లా మినరల్ ఫండ్ (డీఎంఎఫ్)ను వాస్తవంగా ఎక్కడైతే మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లోని 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయాలి. కానీ, జిల్లాస్థాయిలో ప్రాధాన్యతా కార్యక్రమాల కోసం ఖర్చు చేశారు. మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేసింది స్వల్పం. ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ, జి.కొండూరు, విజయవాడ రూరల్ మండలాల పరిధిలో మైనింగ్ కార్యకలాపాలు పెద్దసంఖ్యలో జరిగాయి. ఈ ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం ఖర్చు పెట్టింది శూన్యమనే చెప్పాలి. కృష్ణాజిల్లాలో గన్నవరం, మల్లవల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మైనింగ్ కార్యకలాపాలకు అనుమతులిచ్చారు. కానీ, ఈ ప్రాంతాల పరిధిలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో అధికారిక ఇసుక రీచల ద్వారా వచ్చే మినరల్ ఫండ్‌ను కూడా ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం ఖర్చు చేయలేదు.
లక్ష్యాన్ని నీరుగార్చారు
జిల్లా మినరల్ ఫండ్ నిధుల ఉద్దేశాన్ని నాటి ఉమ్మడి కృష్ణాజిల్లా యంత్రాంగం కానీ, పునర్విభజన తర్వాత ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగాలు కానీ నెరవేర్చలేదు. మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉండగా, జిల్లా యంత్రాంగాలు తమ ప్రాధాన్యత కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు. మైనింగ్ ప్రభావిత గ్రామాల్లో దుమ్మూదూళి, కాలుష్యం వంటివి పెచ్చుమీరుతున్నాయి. రోడ్లు కూడా దెబ్బతింటున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగాలు మైనింగ్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
కేటాయింపులు ఘనం.. ఖర్చు శూన్యం
రెండు జిల్లాల పరిధిలో మినరల్ ఫండ్ నిధులతో మొత్తం 996 పనులు చేపట్టారు. తాగునీటి సరఫరా, కాలుష్య నియంత్రణ చర్యలు, స్ర్తీ శిశు సంక్షేమం, దివ్యాంగ పిల్లల సంక్షేమం, నైపుణ్య శిక్షణ, శానిటేషన్, ఇతర ప్రాధాన్యతా పనుల కోసం జిల్లా మినరల్ ఫండ్ నిధులు కేటాయించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.179.82 కోట్ల నిధులను పైన చెప్పుకొన్నట్టుగా కేటాయింపులు చేయగా, ఇప్పటివరకు కేవలం రూ.71.87 కోట్లే ఖర్చు చేశారు. దీనిని బట్టి చూస్తే మినరల్ ఫండ్స్ వినియోగం సక్రమంగా లేదని అర్థమవుతోంది.