Share News

రూపాయికే వైద్యం

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:40 AM

వైద్యం వ్యాపారమైన ఈరోజుల్లో రూపాయికే వైద్యం చేయడమంటే మామూలు విషయం కాదు. ఆర్థిక పరిస్థితులతో పాటు అంతకుమించిన సంకల్పబలం ఉండాలి. చిన్న జ్వరానికే వేలల్లో ఫీజులు గుంజుతున్న ప్రైవేట్‌ ఆసుపత్రులను చూసి భయపడిపోతున్న రోగులకు నేనున్నానంటూ భరోసా ఇస్తూ రూపాయికే కంటి వైద్యం చేస్తున్నారు డాక్టర్‌ ఆళ్ల రామశేషయ్య. కన్నకొడుకు చనిపోయినా ఆ బాధను గుండెల్లో దాచుకుంటూ కళ్లను దానంచేసి వృత్తిపట్ల నిబద్ధతను చాటుకోవడంతో పాటు మరణాంతరం శరీరాన్ని ప్రభుత్వాసుపత్రికి దానం చేసి.. అవయవదానంపై రోగులకు అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

రూపాయికే వైద్యం
వైద్యం చేస్తున్న డాక్టర్‌ ఆళ్ల రామశేషయ్య

కానూరులోని కంటి డాక్టర్‌ ఆళ్ల రామశేషయ్య ఔదార్యం

సుమారు 30 ఏళ్లుగా పేదలకు వైద్య సహాయం

మొదట్లో రూ.5కే.. ఇప్పుడు రూపాయికే కన్సల్టెన్సీ

అవయవదానంపై రోగులకు అవగాహన

చనిపోయిన కుమారుడి పేరిట ట్రస్ట్‌ ఏర్పాటు చేసి సేవ

తన శరీరాన్ని ప్రభుత్వాసుపత్రికి దానం చేస్తూ వీలునామా

రూపాయి కంటి డాక్టర్‌గా ప్రత్యేక గుర్తింపు

(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : గుడివాడ సమీపంలోని తమిరిశ గ్రామానికి చెందిన ఆళ్ల రామశేషయ్య ఉన్నత కుటుంబంలో జన్మించారు. చిన్నతరంలో తమ పొలంలో పనులకు వచ్చిన కూలీల పిల్లలతో ఆయన స్నేహం చేసేవారు. వారి పేదరికాన్ని చూసి చలించిపోయేవారు. ఎవరికీ తెలియకుండా స్నేహితులకు ధాన్యాన్ని దానం చేసేవారు. ఈ విషయంలో తండ్రి మందలించినా.. తల్లి కొడుకులోని సేవాగుణాన్ని మెచ్చుకునేవారు. నాటి నుంచి తల్లి కళ్లలో ఆనందం కోసం, తన ఆత్మసంతృప్తి కోసం పేదలకు ఏదో రూపంలో సేవ చేయాలని నిర్ణయించుకున్నారు రామశేషయ్య. ప్రాథమిక విద్య తమిరిశలో, 1961లో ఎస్‌ఎల్‌సీసీ (10+2) ఈడుపుగల్లులో పూర్తిచేసి, లయోలా ప్రీ యూనివర్సిటీలో ఒక ఏడాది కోర్సు పూర్తిచేశారు. 17 ఏళ్లకే పెళ్లి చేసుకున్నారు. అనంతరం గుంటూరు మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసి 1969లో ఏటీ అగ్రహారంలో ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. ప్రాక్టీస్‌ సమయంలోనే ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా బయట ఒక డబ్బా ఏర్పాటుచేసి అందులో ఎవరికి తోచినంత డబ్బు వేయాలని చెప్పేవారు. ఆ విధంగా వచ్చిన మొత్తాన్ని పేదల వైద్యానికి ఉపయోగించేవారు.

1973 నుంచే రూ.5కే వైద్యం

గుంటూరు మెడికల్‌ కాలేజీలో 1969-73లో ఎంఎస్‌ పూర్తిచేసి పేదలకు ఐదు రూపాయలకే కంటి వైద్యం చేయడం ప్రారంభించారు. అప్పట్లో ఆసుపత్రుల్లో ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోవడం, బయట భవనాలు తీసుకునే స్థోమత లేకపోవడంతో పేద రోగులకు ఇంట్లోనే కంటి ఆపరేషన చేసేవారు. కటిక పేదరికంతో తన వద్దకు వచ్చే రోగులకు దుస్తులు, వృద్ధులకు చేతికర్రలు, చెప్పులు సాయం చేసేవారు. డాక్టర్‌గా సేవలందించడమే కాకుండా ఎన్నో దానధర్మాలు చేశారు. ఆయన సేవలను గుర్తించిన రోటరీ క్లబ్‌ 1974లో సర్వీస్‌ ఇనచార్జిగా బాధ్యతలు అప్పగించింది. నాటి నుంచి ప్రతి పల్లెకు సైకిల్‌పై తిరుగుతూ రచ్చబండ వద్ద కంటి ప్రాధాన్యత వివరించడమే కాకుండా అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించేవారు. 1979లో రోటరీ క్లబ్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు 70 వేల మందికి ఉచితంగా సేవలందించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లంబాడీల బాధలను చూసి ఆయన చలించిపోయారు. ఇద్దరు, ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన దంపతుల నుంచి కనీసం ఒకరిని దగ్గరలోని మిరియం అనాథ ఆశ్రమంలో చేర్పించేవారు. వారికయ్యే ఖర్చును భరించేవారు. అనాథాశ్రమానికి తన వంతుగా గదులు, పాఠశాల భవనాలు నిర్మించారు. సుమారు 30 మంది ఆడపిల్లల పేరిట రూ.5 వేలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి వారిలో చాలామందికి సొంతఖర్చుతో పెళ్లిళ్లు చేశారు. అనంతరం కానూరులోని ఆటోనగర్‌ రోడ్డులో శ్రీఅమరావతి కంటి ఆసుపత్రిని ఏర్పాటుచేసి రూపాయి కన్సల్టెన్సీ ఫీజుకే వైద్యం చేయడం ప్రారంభించారు. చిన్నచిన్న ఆపరేషన్లను సైతం ఉచితంగా చేస్తున్నారు.

అమ్మ సంతోషం కోసం.. : డాక్టర్‌ ఆళ్ల రామశేషయ్య

సర్వేంద్రియానాం నయనం ప్రధానమన్నారు పెద్దలు. అదే విభాగంలో వైద్యవృత్తి చేస్తున్న నేను నా వృత్తిని అమ్ముకోదలచుకోలేదు. చిన్నతనం నుంచి మా అమ్మ ఏ మంచిపని చేసినా ప్రోత్సహించేంది. ఎవరికైనా సహాయం చేసిన రోజు మనసుకు చాలా ఆనందంగా ఉండేది. ఎంతోమంది పేదలు చికిత్స చేయించుకోలేక కళ్లు పోగొట్టుకుంటున్నారు. మా పెద్దబ్బాయి అజయ్‌ 1987లో చనిపోయాడు. అతని పేరుమీద అజయ్‌ జ్యోతి రూరల్‌ ఐ ట్రస్ట్‌ నడుపుతున్నాను. అనేకమంది పేదలు చికిత్సకు వచ్చిన సమయంలో బట్టలు లేకుండా రావడం బాధ కలిగించింది. నాటి నుంచి వైద్యంతో పాటు మగవారికి చొక్కాలు, మహిళలకు చీరలు పంచుతున్నాను. మా బంధువుల నుంచి దుస్తులు సేకరిస్తున్నప్పుడు పేదలు తీసుకోరని చెప్పేవారు. నాకు కూడా అలాగే అనిపించింది. మొదట్లో ఇవ్వడానికి భయపడ్డా. ఇవ్వడం మొదలుపెట్టాక ఎవరూ కాదనలేదు. నా మరణం తరువాత నా శరీరం వృథా కాకూడదు. అందుకే ప్రభుత్వాసుపత్రికి దానం చేస్తున్నా.

Updated Date - Aug 26 , 2025 | 12:40 AM