పేరుకే రాష్ట్ర పండుగ.. నిధులివ్వరు నిండుగా..
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:25 AM
‘రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఒకటి. ఇక్కడ ఏటా జరిగే దసరా ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తున్నాం.’ 2017లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రకటన ఇది. నాటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు రాష్ట్ర పండుగగానే జరుగుతున్నాయి.
దసరా ఉత్సవాల ఖర్చు భారమంతా దేవస్థానంపైనే
రాష్ట్ర హోదా కల్పించినా పైసా విదల్చని ప్రభుత్వాలు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ‘రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఒకటి. ఇక్కడ ఏటా జరిగే దసరా ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తున్నాం.’ 2017లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రకటన ఇది. నాటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు రాష్ట్ర పండుగగానే జరుగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా నిధుల కేటాయింపులో మాత్రం స్పష్టత లేదు. దసరాను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం తప్ప అందుకు అవసరమైన నిధులు మాత్రం విడుదల చేయట్లేదు. ఆ భారమంతా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంపై పడుతోంది.
అక్కడ బతుకమ్మ.. ఇక్కడ దసరా ఉత్సవాలు
ఆంధ్రాలో దసరా శరన్నవరాత్రులు ప్రారంభమైతే, తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఆరంభమవుతాయి. 2014లో రాష్ట్ర విభజన జరిగాక బతుకమ్మను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించుకుని ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం దసరాను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కానీ, ఎలాంటి నిధుల కేటాయింపులు చేయలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దసరాను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని ప్రకటనలు చేసింది. శరన్నవరాత్రుల నిర్వహణకు ఒక్క రూపాయి కేటాయించలేదు. నాలుగేళ్ల క్రితం సీఎంగా ఉన్న జగన్ మూలానక్షత్రం రోజున పట్టువస్ర్తాలు సమర్పించడానికి రావడానికి ముందు కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో కొంత మాత్రమే విడుదల చేసి మిగతా వదిలేసింది. అంతే తప్ప శరన్నవరాత్రుల నిర్వహణకు మాత్రం ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులివ్వలేదు. శరన్నవరాత్రుల్లో విధుల నిర్వహణకు వివిధ ఆలయాల నుంచి అధికారులు, సిబ్బంది వస్తారు. వారు కాకుండా బందోబస్తు నిమిత్తం పోలీసులు, ప్రాథమిక వైద్యసేవలు నిర్వహించడానికి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వివిధ జిల్లాల నుంచి వస్తుంటారు. పారిశుధ్య నిర్వహణకు వీఎంసీ కార్మికులు, స్నానఘాట్ల వద్ద గస్తీకి ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బంది ఉంటారు. వీరందరికీ భోజన, వసతి సదుపాయాలను దేవస్థానం కల్పించాలి. అంత సామర్థ్యం దేవస్థానానికి లేదు. దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతున్నా దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇక్కడ ఎలాంటి వసతి సదుపాయం లేదు. దీంతో ఉత్సవాల్లో పాలుపంచుకున్న వివిధ శాఖలు తీసుకొచ్చే సిబ్బందికి ఆ శాఖాధికారులే భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు. దీనికయ్యే ఖర్చును మాత్రం దేవస్థానం చెల్లించాలి.
ఏటా పెరుగుతున్న భారం
ఉత్సవాల నిర్వహణ భారం మొత్తం దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంపైనే పడుతోంది. ఏటా ఈ భారం పెరుగుతోంది. ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోవడంతో మొత్తం నిధులను దేవస్థానం సమకూర్చుకోవాల్సి వస్తోంది. శరన్నవరాత్రులకు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఖర్చును దేవస్థానమే సమకూర్చుకోవాలి. ఈ ఏడాదైనా ప్రభుత్వం రాష్ట్ర పండుగకు నిధులు కేటాయిస్తుందా లేదా అని దేవస్థాన వర్గాలు ఎదురుచూస్తున్నాయి.