‘డై’నేజీ
ABN , Publish Date - May 22 , 2025 | 01:00 AM
నగరంలో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. పట్టుమని పది నిమిషాలు చిన్నపాటి వర్షం పడితే చాలు.. రోడ్లు, వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నగరంలో జనాభాకు తగిన విధంగా డ్రెయినేజీ వ్యవస్థ లేదు.
నగరంలో అస్తవ్యస్తంగా డ్రెయినేజీ వ్యవస్థ
చిన్నపాటి వర్షానికి మునిగిపోతున్న రోడ్లు
మురుగు నీటి పారుదల నిర్వహణలో నిర్లక్ష్యం
పట్టించుకోని కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం
ఎండకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే..
రానున్న వర్షాకాలం దుస్థితిపై భయాందోళనలు
కార్పొరేషన్, మే 21 (ఆంధ్రజ్యోతి) : నగరంలో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. పట్టుమని పది నిమిషాలు చిన్నపాటి వర్షం పడితే చాలు.. రోడ్లు, వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నగరంలో జనాభాకు తగిన విధంగా డ్రెయినేజీ వ్యవస్థ లేదు. దీంతో నిత్యం డ్రెయిన్లు పొంగిపొర్లుతూనే ఉన్నాయి. సమగ్ర ప్రణాళిక రూపొందించి, డ్రెయినేజీని సక్రమంగా నిర్వహించడంలో వీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు విఫలమయ్యారు. గత ఆదివారం కురిసిన చిన్నపాటి వర్షానికి నగరం జలమయమైంది. వీధులు, రోడ్లు మురుగు, వర్షపునీటితో చెరువులను తలపించాయి. ఎక్కడ రోడ్డు ఉందో, ఎక్కడ డ్రెయిన్ ఉందో తెలియక పాదచారులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు డ్రెయిన్లలో పడి గాయాలపాల య్యారు. వేసవిలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే వర్షాకాలంలో పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు కలుగుతున్నాయి. నగరపాలక సంస్థ పూడికతీత పనులను క్రమం తప్పకుండా చేయకపోవడమే ఇందుకు కారణం. వీఎంసీ సక్రమంగా ప్రధాన డ్రెయిన్లతో పాటు అనుసంధానంగా ఉన్న డ్రెయిన్లలో పూడికతీత చేపడితే సమస్య పరిష్కారం అవుతుంది. నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వల్ల దుర్వాసన, మశూచి, డెంగ్యూ వంటి రోగాలు ప్రబలే అవకాశం ఉండటంతో పాటు రోడ్లు దెబ్బతింటాయి.
డ్రెయినేజీ ఇలా అయితే ఎలా..?
డ్రెయిన్లు బ్లాక్ అయ్యి, సరిగ్గా నీరు ప్రవహించకుండా ఉండటంతో పాటు రోడ్లపై మురుగు, వర్షపు నీరు పొంగిపొర్లడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలకు ఆటంకాలు కలుగుతున్నాయి. అధికారులు ప్రణాళిక ప్రకారం వేసవిలోనే ప్రధాన డ్రెయిన్లతో పాటు అనుసంధానంగా ఉన్న డ్రెయిన్లలో పూడికతీత పనులు చేపట్టడమే ఈ సమస్యకు పరిష్కారం. డ్రెయిన్లలో మురుగు, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుని నీటి ప్రవాహానికి అడ్డు పడుతున్నాయి. దీంతో చిన్నపాటి వర్షానికి డ్రెయిన్లు పొంగిపొర్లుతున్నాయి.