Share News

డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణం మెట్రోదే..

ABN , Publish Date - Jun 01 , 2025 | 12:59 AM

: నిడమానూరు నుంచి రామవరప్పాడు రింగ్‌రోడ్డు వరకు నిర్మించే డబుల్‌ డెక్కర్‌ నిర్మాణంపై ఓ స్పష్టత వచ్చింది. ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఆర్‌సీ) మాత్రమే నిర్మించనుంది. ఈ మేరకు ఎన్‌హెచ్‌, ఏపీఎంఆర్‌సీ మధ్య అవగాహన కుదిరింది. కాగా, రామవరప్పాడు జంక్షన్‌ నుంచి మహానాడు జంక్షన్‌ వరకు సాధారణ ఫ్లై ఓవర్‌ను ఎన్‌హెచ్‌ నిర్మిస్తుంది.

డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణం మెట్రోదే..

నిడమానూరు- రామవరప్పాడు వరకు..

రామవరప్పాడు-మహానాడు బాధ్యతలు ఎన్‌హెచ్‌కు..

ఏపీఎంఆర్‌సీ-ఎన్‌హెచ్‌ మధ్య కుదిరిన ఒప్పందం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నిడమానూరు నుంచి రామవరప్పాడు రింగ్‌రోడ్డు వరకు నిర్మించే డబుల్‌ డెక్కర్‌ నిర్మాణంపై ఓ స్పష్టత వచ్చింది. ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఆర్‌సీ) మాత్రమే నిర్మించనుంది. ఈ మేరకు ఎన్‌హెచ్‌, ఏపీఎంఆర్‌సీ మధ్య అవగాహన కుదిరింది. కాగా, రామవరప్పాడు జంక్షన్‌ నుంచి మహానాడు జంక్షన్‌ వరకు సాధారణ ఫ్లై ఓవర్‌ను ఎన్‌హెచ్‌ నిర్మిస్తుంది.

ఇప్పటికి స్పష్టత

నిడమానూరు జంక్షన్‌ నుంచి మహానాడు జంక్షన్‌ వరకు రూ.600 కోట్లతో 7 కిలోమీటర్ల ఆరు వరసల ఫ్లై ఓవర్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి ఏడాది కావస్తోంది. డీపీఆర్‌ కారణంగా జాప్యం జరిగింది. డీపీఆర్‌ వచ్చాక దీనికి టెండర్లు పిలుస్తారనుకున్న దశలో ఇదే అలైన్‌మెంట్‌లో మెట్రోలైన్‌ కూడా వస్తుండటంతో ఇబ్బందిగా మారింది. దీంతో ఏపీఎంఆర్‌సీ, ఎన్‌హెచ్‌ అధికారులు భేటీ కావాల్సి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించటానికి వీలుగా డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌ చేపట్టాలన్న ఆలోచన వచ్చింది. కింద రోడ్డు, పైన మొదటి ఫ్లై ఓవర్‌ మీద వాహనాలు, ఆ పైన మెట్రో ఎలివేటెడ్‌ కారిడార్‌ వస్తుంది. ఈ డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌కు సంబంధించి అంచనాలను ఏపీఎంఆర్‌సీ రూపొందించింది. డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌కు 4.2 కిలోమీటర్ల మేర రూ.1,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి ప్రతిపాదనలను మోర్తుకు పంపించారు. మోర్తు నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావటమే ఆలస్యం. అయితే, డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌ ఎవరు చేపడతారన్న అంశంపై ఇప్పటికి స్పష్టత వచ్చింది. సింగిల్‌ ఫ్లై ఓవర్‌కు అయ్యే ఖర్చును ఎన్‌హెచ్‌ భరిస్తుంది. మెట్రో ఎలివేటెడ్‌ కారిడార్‌, డబుల్‌ డెక్కర్‌ పిల్లర్ల కోసం అయ్యే ఖర్చును ఏపీఎంఆర్‌సీ భరిస్తుంది. రామవరప్పాడు నుంచి మహానాడు వరకు అయ్యే సాధారణ ఫ్లై ఓవర్‌ ఖర్చును ఎన్‌హెచ్‌ భరిస్తుంది.

Updated Date - Jun 01 , 2025 | 12:59 AM