యూజీడీ.. అలజడి
ABN , Publish Date - Dec 23 , 2025 | 01:08 AM
నగరంలోని భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ షట్‌డౌన్ కానుందా? రానున్న రోజుల్లో మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లనున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. తీవ్రమైన గ్యాస్ పీడనం, పూడుకుపోయిన యూజీడీ పైపులతో భవిష్యత్తులో సంభవించే పరిణామాలను కార్పొరేషన్ ముందే పసిగట్టింది. ఇందులో భాగంగానే ‘యూజీడీ-2060’ పేరుతో భవిష్యత్తు అవసరాల ప్రాతిపదికన సరికొత్త యూజీడీ డీపీఆర్‌కు రూపకల్పన చేస్తోంది.
నగరంలో పాతికేళ్ల కిందటి భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ
అప్పట్లో 50 ఏళ్ల అవసరాల మేరకు నిర్మాణం
25 ఏళ్లకే తీవ్రమైన డ్రెయినేజీ సమస్యలు
నగర జనాభా భారీగా పెరగడమే కారణం
అప్రమత్తమైన కార్పొరేషన్ అధికారులు
యూజీడీ-2060 డీపీఆర్ రూపకల్పనకు శ్రీకారం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) షట్‌డౌన్ అవుతుందేమోనన్న భయంతో కార్పొరేషన్ అప్రమత్తమైంది. కమిషన ర్ ధ్యానచంద్ర సూచనల మేరకు ఇంజనీరింగ్ విభాగం ‘యూజీడీ-2060’ పేరుతో భవిష్యత్తు అవసరాల ప్రాతిపదికన సరికొత్త యూజీడీ డీపీఆర్‌కు రూపకల్పన చేస్తోంది.
నాటి యూజీడీనే..
నగరంలో యూజీడీ వ్యవస్థకు 2000వ సంవత్సరం ప్రారంభంలో దశలవారీగా కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది. అప్పట్లో 50 ఏళ్లు, అంతకుమించి అవసరాల ప్రాతిపదికన దీని ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ తయారు చేసి, దానికి అనుగుణంగా డీపీఆర్‌కు రూపకల్పన చేశారు. సాధారణ నిధులు, జేఎన్‌ఎన్యూఆర్‌ఎం నిధులు.. ఇలా అనేక రకాలుగా అందుబాటులో ఉన్న నిధులతో 2010 నాటికి నగరవ్యాప్తంగా 80 శాతం మేర యూజీడీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వ్యవస్థ ఏర్పాటుచేసినా, మిగులు పనులు, సీవేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు అనుసంధానించకపోవటం వంటివి ఇప్పటికీ సమస్యాత్మకంగా ఉన్నాయి. అప్పట్లో పైపులైన్ల నిడివి తక్కువగా ఉండటం కూడా సమస్యగా మారింది. మెయిన్ రోడ్లలో యూజీడీ పైపులు 18 అడుగుల లోతున వేశారు. ఇప్పుడు వాటిని తీయాలన్నా సమస్యగా మారుతోంది.
ఊపందుకున్న భారీ నిర్మాణ రంగం
పాతికేళ్లలో విజయవాడలో జనసాంద్రత పెరిగింది. ప్రస్తుతం నగర జనాభా 14 లక్షలు. ఉపాఽధి కల్పనా కేంద్రంగా మారటంతో వలసలు పెద్దసంఖ్యలోనే జరిగాయి. అద్దెలకు వచ్చేవారి సంఖ్య పెరిగింది. కొండప్రాంతాలు, కాల్వగట్లు, కృష్ణానదీ తీరం వెంబడి ఆక్రమణలు కూడా పెరిగాయి. ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో నగరంలో వాంబే, జేఎన్‌ఎన్యూఆర్‌ఎం వంటి పథకాల ద్వారా పేదల ఇళ్ల నిర్మాణం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తయితే భారీ నిర్మాణరంగం ఊపందుకుంది. భారీ గ్రూప్‌హౌస్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత గృహ నిర్మాణాలు పెరిగాయి. అంతస్థుల మీద అంతస్థుల నిర్మాణం జరిగింది. దీంతో జనసాంద్రతతో విజయవాడ నగరం అట్టుడుకుతోంది. సీవేజీ ఉత్పత్తి కూడా పెరిగింది.
నగరవ్యాప్తంగా యూజీడీ సమస్యలు
సర్కిల్-1 పరిధిలో 70 శాతం యూజీడీ మాత్రమే జరిగింది. మరో 30 శాతం జరగాల్సి ఉంది. జరిగిన 70 శాతంలో కూడా కేవలం హెచ్‌బీ కాలనీలో 30 శాతం మినహా మిగిలిన 40 శాతం వినియోగంలో లేదు. ప్రస్తుతం ఈ 40 శాతం యూజీడీ నెట్‌వర్క్ పూడుకుపోయింది. సర్కిల్-2 పరిధిలో అజితసింగ్‌నగర్‌లోని 57, 58, 59, 60, 61, 62, 63, 64 డివిజన్లలో యూజీడీ లేదు. 1, 30 డివిజన్లలో మాత్రమే రూ.30 కోట్లతో తాజాగా టెండర్లు పిలిచారు. సర్కిల్-3 పరిధిలో నూరు శాతం యూజీడీ పూర్తయినా సీవేజీ ఉత్పత్తి పెరుగుదలతో మ్యాన్‌హోల్స్ పొంగిపోతున్నాయి. పటమట, దర్శిపేట, మొగల్రాజపురం, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు, బెంజిసర్కిల్, లబ్బీపేట తదితర ప్రాంతాల్లో తరచూ యూజీడీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
లెక్క తప్పింది..!
2000 ప్రారంభంలో నగర జనాభా 8.5 లక్షలు. నాటి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూగర్భ మురుగునీటి పథకం (యూజీడీ) యాక్షన్ ప్లాన్‌ను రూపొందించారు. 2025 నాటికి ఆ ప్రణాళికలన్నీ చిత్తయ్యాయి. ఎంచుకున్న డిస్ర్టిబ్యూషన్ నెట్‌వర్క్ విషయంలో లోపాలు జరిగాయి. ఖర్చు కోణాన్ని దృష్టిలో ఉంచుకుని రానున్న 50 ఏళ్ల అవసరాల అంచనా ప్రాతిపదికన యూజీడీని రూపొందిస్తే పాతికేళ్లకే లెక్కతప్పింది.
రూ.500 కోట్లు కావాలి
యూజీడీ వ్యవస్థపై కార్పొరేషన్ అధికారులు సరికొత్త డీపీఆర్ తయారు చేస్తున్నారు. సర్కిల్-2లో బ్యాలెన్స్ పనులు పూర్తిచేయాలంటే రూ.150 కోట్ల నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. సర్కిల్-1లో రూ.200 కోట్లు, సర్కిల్-3 పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పైపులను మార్చటానికి రూ.150 కోట్లు కావాలి.