అన్నదమ్ముల సవాల్
ABN , Publish Date - Apr 26 , 2025 | 01:12 AM
కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. తనపై చేసిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని).. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ.100 కోట్లకు దావా వేస్తానని హెచ్చరిస్తూ శుక్రవారం మాజీ ఎంపీ కేశినేని నానీకి లీగల్ నోటీసు పంపారు. ఈ నోటీసుకు స్పందించిన నాని ఫేస్‌బుక్ వేదికగా ఘాటుగా విమర్శలు చేశారు. రూ.లక్ష కోట్లకు దావా వేసుకున్నా లొంగబోనని చెప్పడంతో అన్నదమ్ముల మధ్య మాటల చిచ్చు మరింత రాజుకుంది. - విజయవాడ, ఆంధ్రజ్యోతి
కేశినేని బ్రదర్స్ మధ్య ముదిరిన మాటల యుద్ధం
ఐదు రోజుల్లో క్షమాపణ చెప్పాలని ఎంపీ చిన్ని డిమాండ్
లేదంటే రూ.100 కోట్లకు దావా వేస్తానంటూ నోటీసు
రూ.లక్ష కోట్లకు వేసుకున్నా లొంగనన్న మాజీ ఎంపీ నాని
సమాధానాలు కావాలి కానీ, బెదిరింపులు కాదని వ్యాఖ్య
బహిరంగ క్షమాపణ.. లేదంటే రూ.100 కోట్లకు దావా : కేశినేని చిన్ని
తన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నాని రెండు రోజులుగా ఎక్స్, ఇతర సోషల్ మీడియా వేదికగా చేస్తున్న అవినీతి ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానంటూ లీగల్ నోటీసు పంపారు. ఉర్సా కంపెనీ తన బినామీగా ఉందని ఆరోపణలు సంధించటంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వటం, ఫేస్‌బుక్, ఎక్స్‌లో తనపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేయటాన్ని చిన్ని సీరియస్‌గా తీసుకున్నారు. సమాజంలో తనకు ఉన్న పరపతిని, పరువు, ప్రతిష్ఠలను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశావని నానీకి పంపిన లీగల్ నోటీసులో ఆయన పేర్కొన్నారు. మానసికంగా ఇబ్బందులు కలగజేయటంతో పాటు తన ప్రతిష్టను మరింత దిగజార్చేలా వ్యవహరించటాన్ని ప్రస్తావిస్తూ ఐదు రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఫేస్‌బుక్, ఎక్స్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో క్షమాపణలు తెలుపుతూ పోస్టు చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పకపోయినా, తనపై సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణలను తొలగించకపోయినా రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
లక్షల కోట్లకు వేసుకో.. లొంగేది లేదు: కేశినేని నాని
త న సోదరుడు కేశినేని చిన్ని పంపిన లీగల్ నోటీసును ఉటంకిస్తూ మాజీ ఎంపీ కేశినేని నాని కూడా ఫేస్‌బుక్ వేదికగా స్పందించారు. ‘నేను విజయవాడ అభివృద్ధి కోసం నిజాయితీగా, పారదర్శకంగా, గర్వంగా సేవ చేశాను. నువ్వు రూ.100 కోట్లకు కాదు. రూ.లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారిపై నా పోరాటం ఆగదు. భయంతో బెదిరింపులకు లొంగేది లేదు’ అంటూ సుదీర్ఘంగా పోస్టు పెట్టారు. తనకు పంపిన లీగల్ నోటీసు కేవలం బెదిరింపు మాత్రమే కాదని, విమర్శలను అణచివేయటానికి, మౌనంగా ఉంచడానికి, నోరు మూయించడానికి చేస్తున్న స్పష్టమైన ప్రయత్నమని, తాను మాత్రం మౌనంగా ఉండన ని పేర్కొన్నారు. సత్యం బెదిరింపులకు లొంగదని, తానూ లొంగనని చెప్పారు. ప్రశ్నలు లేవనెత్తినపుడు సమాధానాలు కావాలి కానీ, బెదిరింపులు కాదన్నారు. పదేళ్లపాటు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహించే గౌరవం తనకు దక్కిందని, జవాబుదారీతనం, పారదర్శకత, నిజాయితీతో బాధ్యతలను నిర్వహించానన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి గర్వంగా సేవ చేశానని, తాను దేనికోసం నిలబడ్డానో, దేనికి వ్యతిరేకంగా పోరాడుతున్నానో తెలుసు’ అని పేర్కొన్నారు.