Share News

లెక్క తేల్చారు

ABN , Publish Date - Oct 30 , 2025 | 12:38 AM

ఏజెంట్లు 32 మంది. పెట్టుబడి రూ.54 కోట్లు. తీసుకున్న మొత్తం రూ.105 కోట్లు. పొందిన లాభం రూ.49 కోట్లు. అధిక వడ్డీలు చెల్లిస్తానని ప్రజల నుంచి డబ్బు సేకరించిన అద్విక ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో ఏజెంట్లు తీసుకున్న లాభాలివి. అద్విక కేసు దర్యాప్తును ముగించిన సిట్‌ మొత్తం లెక్కలను సవివరంగా తెలియజేసింది. బాధితులు, ఆస్తుల వివరాలతో పాటు నష్టాన్ని కూడా లెక్కించింది.

లెక్క తేల్చారు

అద్విక కేసులో తేలిన లాభనష్టాలు

25 మంది నిందితులు.. రూ.144 కోట్ల నష్టం

లెక్కలు తేలని మొత్తం రూ.39.50 కోట్లు

బాధితులు 92 మందిగా నిర్ధారణ

వారికి న్యాయం చేసే ప్రణాళికలు

స్థిరచరాస్తులు జప్తు చేసే యోచన

ప్రభుత్వ అనుమతి తీసుకున్నాకే..

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : అద్విక ప్రైవేట్‌ లిమిటెడ్‌ ముసుగులో తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్య, ఆయన సతీమణి సుజాత చేసిన మోసంపై మాచవరం పోలీసులు క్రైం నంబరు 248/2025తో బీఎన్‌ఎస్‌ 318 (4), 316 (2), 316 (5) (2) 61తో పాటు ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టంలోని సెక్షన్‌ 5 కింద కేసు నమోదు చేశారు. ఈ మోసంలో మొత్తం 25 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వారిలో ఆదిత్య, భార్య సుజాత, వారికి సహకరించిన ఏజెంట్లు గాదంశెట్టి బాలకృష్ణమూర్తి, ఆయన సతీమణి నాగలక్ష్మీదేవిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదిత్య ఏజెంట్లు, ఖతాదారుల నుంచి పెట్టుబడులను స్వీకరించినా ఎక్కడా రికార్డులు నిర్వహించలేదు. బ్యాంకింగ్‌లో సుజాతకు ఉన్న అనుభవం, మోసాల్లో తనకున్న తెలివితో పెట్టుబడులు ఎలా రాబట్టాలో ఆలోచించారు. 92 మంది రూ.9.47 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. వారంతా కంపెనీ, ఏజెంట్ల నుంచి ఒక్క రూపాయి రిటర్న్‌ తీసుకోలేదు. వారందరినీ బాధితులుగా పోలీసులు నిర్ధారించారు.

మొత్తం రూ.144 కోట్ల నష్టం

2022లో అద్విక సంస్థను ఏర్పాటుచేసిన ఆదిత్య ఇప్పటి వరకు 1,417 మంది నుంచి రూ.413.03 కోట్లు సేకరించాడు. వాటిలో రూ.355.03 కోట్లు తిరిగి చెల్లించి, రూ.144 కోట్లకు ఎగనామం పెట్టాడు అని పోలీసులు నిర్ధారించారు. ఇందులో పెట్టుబడులు పెట్టిన వారందరినీ విజయవాడలోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి పిలిపించి విడివిడిగా వాంగ్మూలాలు తీసుకున్నారు. చెల్లింపులకు సంబంధించిన లావాదేవీలను టాలీ షీట్‌ ద్వారా సరిచూశారు. ఇలా రేయింబవళ్లు లెక్కలు తీస్తే అద్విక చూపించిన నష్టం రూ.144 కోట్లుగా తేలింది. డిపాజిటర్లలో 1,139 మంది రూ.255 కోట్లు అద్వికలో పెడితే రూ.120 కోట్లను మాత్రమే తిరిగి తీసుకున్నారు. వారికి ఆదిత్య రూ.135 కోట్ల నష్టాన్ని మిగిల్చాడు. ఏజెంట్లలో 30 మంది రూ.54 కోట్లు పెడితే రూ.45 కోట్లు మాత్రమే చెల్లించాడు. వారికి రూ.9 కోట్ల నష్టాన్ని చూపించాడు.

‘దర్యాప్తు’నకు రివార్డులు

సుమారు ఐదు నెలలుగా కేసును అధ్యయనం చేసిన పోలీసు అధికారుల అసలు గుట్టును బయటకు లాగారు. పెట్టుబడులు, చెల్లింపులు పోగా పైసా ముట్టని బాధితులకు న్యాయం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. అద్వికలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందినవారంతా వాటిని వెనక్కి ఇవ్వాలని ప్రతిపాదించారు. లేనిపక్షంలో సంస్థ ఎండీ శ్రీవెంకట ఆదిత్య దంపతుల మాదిరిగా కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కాగా, దర్యాప్తు అధికారులు, సిబ్బందిని పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు అభినందించారు. వారికి నగదు బహుమతులు అందజేశారు. ఈ కేసు దర్యాప్తునకు ఏర్పాటు చేసిన సిట్‌కు క్రైమ్స్‌ డీసీపీ తిరుమలేశ్వరరెడ్డి చీఫ్‌గా వ్యవహరించారు. టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ లతాకుమారి, సెంట్రల్‌ జోన్‌ ఏసీపీ కె.దామోదరరావు, మాచవరం ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్రహ్మణ్యం, మాచవరం ఎస్‌ఐ శంకర్‌, పటమట ఎస్‌ఐ రేవతితో పాటు ఈ బృందంలో పనిచేసిన హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు నగదు బహుమతి అందజేశారు.

Updated Date - Oct 30 , 2025 | 12:38 AM