Share News

దాచాలన్నా దాగదులే..

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:55 AM

నున్న పోలీస్‌స్టేషన్‌ పరిధిలో.. రెండు రోజుల కిందట మద్యం మత్తులో ఇద్దరి మధ్య వివాదం రేగింది. ఒక వ్యక్తి బీరు సీసాతో ఎదుటి వ్యక్తి తలపై బలంగా కొట్టాడు. ఇష్టానుసారంగా పొడిచాడు. దీనిపై పోలీసులు సాధారణ కొట్లాట కేసు నమోదు చేశారు. ఆ మర్నాడు అధికారులు నిర్వహించిన సెల్‌ కాన్ఫరెన్స్‌లో ఇది చిన్న గొడవ అని సమాచారం ఇచ్చారు. పత్రికల్లో వచ్చిన వార్తను చూసి అధికారులు అడిగితే క్షతగాత్రుడికి పది కుట్లు పడ్డాయని చెప్పారు. దీనిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి కదా.. అని అధికారులు అడిగితే ఆ విధంగానే కేసు నమోదు చేశామని చెప్పారు. కోర్టులో మోమో దాఖలు చేశామన్నారు. తీరా చూస్తే మంగళవారం ఈ కేసు హత్యాయత్నంగా మార్చారు. తిరువూరులో టీడీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తల మధ్య జరిగిన వివాదం దాడికి దారితీసింది. ఈ ఘటన జరిగిన సమాచారం అధికారులకు ఇవ్వలేదు. ఎమ్మెల్యే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కూర్చున్న తర్వాత అసలేం జరిగిందో అధికారులకు తెలిసింది. .ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనరేట్‌లోని స్టేషన్లలో జరుగుతున్న వ్యవహారాలకు, అక్కడి ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐల పనితీరుకు ఈ ఘటనలు నిదర్శనం.

దాచాలన్నా దాగదులే..

వివాదాస్పదంగా కొందరు ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐల తీరు

కీలక కేసుల్లో సమాచారం తొక్కిపెడుతున్న ఎస్‌హెచ్‌వోలు

నున్న పరిధిలోని మద్యం కేసులో జరిగింది అదే..

తిరువూరులో జరిగిన గొడవ కూడా టేక్‌ ఇట్‌ ఈజీ

అధికారులకు చెప్పకుండా కావాలనే గోప్యత

విషయం పెద్దదయ్యాక అప్పటికప్పుడు హడావిడి

కొంతమంది ఎస్‌హెచ్‌వోలపై అధికారుల అసంతృప్తి

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : జిల్లాలో కొంతమంది ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐల పనితీరు అధికారులకు తలనొప్పిగా మారింది. జరిగిన విషయాన్ని అధికారులకు చెప్పడానికి ఒప్పుకోవట్లేదు. దీనికి కారణాలు ఏమైనా.. జరిగిన ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తొక్కి పెడుతున్నారు. దీనిపై స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లుగా ఉన్న ఇన్‌స్పెక్టర్లు ఇంటాబయటా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

సెల్‌ కాన్ఫరెన్స్‌లో గోప్యత

పోలీసు కమిషనర్‌ నిత్యం జిల్లాలో ఉన్న డీసీపీలు, ఏడీసీపీలు, ఇన్‌స్పెక్టర్లతో సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. ముందురోజు జరిగిన వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. పోలీసింగ్‌ ఎలా చేయాలన్న దానిపైన, పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన కేసులపైన ఈ చర్చ ఉంటోంది. ఈ కాన్ఫరెన్స్‌ సుమారుగా 40-50 నిమిషాల పాటు ఉంటుంది. ముందురోజు, అర్ధరాత్రి సమయంలో జరిగిన ఘటనల గురించి సీపీకి తెలియజేయాల్సి ఉంటుంది. జిల్లాలో కొంతమంది ఇన్‌స్పెక్టర్లు రాత్రి సమయాల్లో జరిగిన తీవ్రమైన ఘటనల సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడం లేదని తెలుస్తోంది. తీవ్రమైన ఘటనలపై సాదాసీదా సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నారు. తర్వాత వాటి గురించి తెలుసుకుని అధికారులు ఆరా తీస్తే.. అప్పటికప్పుడే ఏదోఒక కథను అల్లేస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది ఎస్‌ఐలు ఘటనల్లో క్షతగాత్రులుగా మారిన వారిని ఆసుపత్రులకు పంపి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి వదిలేస్తున్నారు.

తేరుకునేలోపు పారిపోతున్నారు

కొన్ని ఘటనల్లో ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు తీసుకున్న నిర్ణయాలు నిందితులకు అవకాశంగా మారుతోంది. నున్న పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మద్యం దుకాణం వద్ద జరిగిన గొడవలో విఘ్నేశ్వరరావు అనే వ్యక్తిపై నాగరాజు అనే వ్యక్తి బీరు సీసాతో పొడిచాడు. దీనిపై కొట్లాట కేసు నమోదు చేసిన నున్న పోలీసులు నాగరాజుకు 41ఏ నోటీసు ఇచ్చారు. ఈ నోటీసు తీసుకున్న నిందితుడు నాగరాజు ఇప్పుడు విజయవాడ నుంచి పారిపోయాడు. ఇప్పుడు ఈ కేసును హత్యాయత్నంగా మార్చారు. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు వైజాగ్‌కు పారిపోయాడు. ఘటన జరిగినప్పుడే చేతికి చిక్కిన నిందితుడ్ని వదిలేయడంతో తర్వాత పోలీసులు తేరుకుని సెక్షన్లను మార్పు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇప్పుడు అతడ్ని పట్టుకోవడానికి ప్రత్యేకంగా కొంతమందిని వైజాగ్‌కు పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేసుల విషయంలో సరిగ్గా స్పందించకుండా పిట్టకథలు చెబుతున్న ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐల జాబితాలను తయారు చేసే పనిలో అధికారులు ఉన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 12:55 AM