దొంగబిల్లులు రద్దు
ABN , Publish Date - Apr 12 , 2025 | 01:00 AM
ఎట్టకేలకు దొంగబిల్లుల ఆమోద ప్రతిపాదనలను కార్పొరేషన్ పాలకపక్షం రద్దు చేసింది. ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ప్రచురితమైన ‘దొంగ బిల్లుల దోపిడీ’ కథనంపై పాలక పక్షం అప్రమత్తమైంది. తేలు కుట్టిన దొంగలా వ్యవహరిం చింది.

ఆంధ్రజ్యోతి కథనంతో నిలిచిన దొంగబిల్లుల ఆమోదం
పూర్తి వివరాలు లేవని తిరస్కరించిన మేయర్
మారుమాట్లాడని స్టాండింగ్ కమిటీ సభ్యులు
అధికారులే ఈ ప్రతిపాదనలు పెట్టారని ఎదురుదాడి
38 అంశాలకు గానూ 34 అంశాలు ఆమోదం
కార్పొరేషన్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి) : ఎట్టకేలకు దొంగబిల్లుల ఆమోద ప్రతిపాదనలను కార్పొరేషన్ పాలకపక్షం రద్దు చేసింది. ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ప్రచురితమైన ‘దొంగ బిల్లుల దోపిడీ’ కథనంపై పాలక పక్షం అప్రమత్తమైంది. తేలు కుట్టిన దొంగలా వ్యవహరిం చింది. శుక్రవారం సాయంత్రం మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్థాయీసంఘ సమా వేశంలో ఈ దొంగబిల్లులను తిరస్కరించారు. శాని టేషన్ పనులకు సంబంధించి పూర్తి వివరాలు లేనందున బిల్లులను రద్దు చేయటం జరిగిందని తీర్మానించారు. తమ తప్పేమీ లేదన్నట్టుగా పాలకపక్షం వ్యవహరించటం గమనార్హం.
ఇది రెండోసారి
ఈ బిల్లులను ఇప్పటికి రెండుసార్లు స్థాయీసంఘం ముందుకు తీసుకొచ్చినా తిరస్కరించారు. మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర కూడా పలుమార్లు పక్కన పెట్టారు. ఈ బిల్లులను స్టాండింగ్ కమిటీ సమావేశంలో అధికారులే ప్రవేశపెట్టారని వైసీపీ పాలకపక్ష సభ్యులు ఎదురుదాడి చేశారు. దొంగతనం బయటపడుతుందన్న ఉద్దేశంతో అధికారులను నిలదీయడం విమర్శలకు తావిచ్చింది. ఈ విషయం కమిషనర్ ధ్యానచంద్ర దృష్టికి కూడా వెళ్లడంతో ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది.
ఆడిటింగ్ చేయరా?
బిల్లులపై ఆడిటింగ్ చేయించాల్సిన పాలకపక్షం వాటిని పట్టించుకోవట్లేదు. నాడు పారిశుధ్య కార్మికులు ఎంతమంది పనిచేశారు, వాటి ఆధారాలేంటి? ఎంతమంది మస్తర్లు వేశారు? వాటిలో శాసీ్త్రయత ఎంత? ఎక్కడెక్కడ పనులు చేశారు? జియోట్యాగింగ్ చేశారా? వారికేమైనా తాత్కాలిక ఐడీలు ఇచ్చారా? ఆ ఐడీల ప్రకారం సంస్థ అంతర్గత సర్వర్ల ద్వారా ఏమైనా డేటా లభించే అవకాశముందా? నిర్దేశిత ప్రాంతాల్లో విధులు కేటాయించిన వారు ఎక్కడెక్కడ పనిచేశారన్నదానికి సీసీ ఫుటేజీ పరిశీలన వంటివి చేయించాల్సిన పాలకపక్షం ప్రతిసారీ అడ్డదారిలో బిల్లులు పెట్టించేలా వ్యవహరించటంపై విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. కాగా, ఈ స్టాండింగ్ కమిటీ సమావే శంలో మొత్తం 38 అంశాలపై చర్చ జరగ్గా, 34 అంశాలకు ఆమోదముద్ర వేశారు. ఒక అంశం రికార్డు చేయడంతో పాటు పరిపాలనాపరమైన అంశాలకు సంబంధించి ఒక అంశాన్ని ధ్రువీకరించారు. పార్కింగ్, కర్మల భవనాలకు సంబంధించిన అంశాలను ఆమోదించారు.