రైవస్ కాలువే ప్రత్యామ్నాయం
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:09 AM
నగరంలోని రెండు నియోజకవర్గాలకు రైవస్ కాల్వ అనుసంధానమవుతుంది. ప్రకాశం బ్యారేజీ నుంచి మొదలయ్యే కృష్ణా తూర్పు ప్రధాన కాల్వ పోలీసు కంట్రోల్ రూమ్ దగ్గర మూడు పాయలుగా చీలుతుంది. బందరు కాల్వగా, రైవస్ కాల్వగా, ఏలూరు కాల్వగా రూపాంతరం చెందుతుంది. రైవస్ కాల్వ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతుంది.
నగరానికి మెగా స్ర్టామ్ వాటర్ డ్రెయిన్ అవసరం
భారీ శాశ్వత వరదనీటి కాల్వతో సమస్యకు చెక్
రైవస్ కాల్వను ఇందుకు అనుకూలంగా మార్చుకోవచ్చు
పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలను కలిపే కాల్వ ఇది
తూర్పు నియోజకవర్గానికీ తేలిగ్గా అనుసంధానించవచ్చు
మేజర్, అవుట్ ఫాల్ డ్రెయిన్లను కలిపితే సమస్య తొలగినట్టే..
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరంలోని రెండు నియోజకవర్గాలకు రైవస్ కాల్వ అనుసంధానమవుతుంది. ప్రకాశం బ్యారేజీ నుంచి మొదలయ్యే కృష్ణా తూర్పు ప్రధాన కాల్వ పోలీసు కంట్రోల్ రూమ్ దగ్గర మూడు పాయలుగా చీలుతుంది. బందరు కాల్వగా, రైవస్ కాల్వగా, ఏలూరు కాల్వగా రూపాంతరం చెందుతుంది. రైవస్ కాల్వ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతుంది. ఇది సెంట్రల్ నియోజకవర్గంలోని శివారు ప్రాంతాల మీదుగా దిగువకు వెళ్లి బుడమేరులో కలుస్తుంది. తూర్పు నియోజకవర్గం కాల్వకు ఎగువన ఉండటం వల్ల మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్లను రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, ఆటోనగర్ గుంటుతిప్ప డ్రెయిన్ల మీదుగా రైవస్ కాల్వకు అనుసంధానం చేయొచ్చు. ఈ కాల్వ నగరం నుంచి దిగువకు ప్రవహిస్తుండటం వల్ల వర్షపు నీటిని సునాయాసంగా దిగువకు తీసుకెళ్లవచ్చు.
వర్షపు నీటిని తేలిగ్గా మళ్లించవచ్చు
బందరు, ఏలూరు కాల్వలను దిగువ ప్రాంతాల్లో సాగు, మంచినీటి కోసం ఉపయోగిస్తారు. వెలగలేరు నుంచి వచ్చే బుడమేరు దిగువకు డ్రెయినేజీ నీటి పంపింగ్‌కు ఉపయోగపడుతుంది. ఏలూరు కాల్వను కూడా డ్రెయినేజీ పంపింగ్‌కు ఉపయోగిస్తున్నారు. రైవస్ కాల్వను డ్రెయినేజీ కాల్వగా కాకుండా స్ర్టామ్ వాటర్ డ్రెయిన్‌గా ఉపయోగించుకోవడం ద్వారా నగరంలో వర్షపు నీటిని తేలిగ్గా దిగువకు పంపే అవకాశం ఉంటుంది.
మెగా స్ర్టామ్ వాటర్ డ్రెయిన్ కోసం ఏం చేయాలి?
మెగా స్ర్టామ్ వాటర్ డ్రెయిన్ కోసం.. నగరంలోని ఇతర స్ర్టామ్ వాటర్ డ్రె యిన్లు, మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్లను విస్తరించి వర్షపునీటి పారుదలకు వాలుగా రైవస్ కాల్వలో కలిసేలా ఏర్పాటు చేయాలి. కృష్ణా తూర్పు ప్రధాన కాల్వ నుంచి రైవస్ కాల్వలోకి వచ్చే నీటిని నియంత్రించడానికి వీలుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం దిగువన రెగ్యులేట్ చేయటానికి లాకులను ఏర్పాటు చేయాలి. వర్షాకాలంలో నీటిని మళ్లించటానికి వీలుగా చర్యలు చేపట్టవచ్చు.
అధ్యయనం అవసరం
నగరంలో వందేళ్ల కాలంలో వర్షాల వల్ల నీటమునిగిన ప్రాంతాలను అధ్యయనం చేసి ఆయా ప్రాంతాల నుంచి వర్షపు నీటిని ఎలా బయటకు తరలించాలన్న దానిపై సమగ్ర నివేదికను రూపొందించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇప్పుడున్న స్ర్టామ్ వాటర్, అవుట్ ఫాల్ డ్రెయిన్ల వ్యవస్థలు ఏంటి? వీటిలో యుద్ధప్రాతిపదికన విస్తరించాల్సినవి ఏంటి? వంటి వాటిపై సమగ్రమైన డీపీఆర్ తయారుచేయాలి. ఈ డీపీఆర్ ప్రకారం ఎంత ఖర్చు అవుతుంది? నిధుల లభ్యత ఎంత? కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా సాకారం చేసుకోవచ్చా? అమృత 2.0 వంటి పథకంలోకి తీసుకురావచ్చా వంటి అంశాలను కూడా పరిశీలించి ముందు అడుగు వేయొచ్చు.