పోటాపోటీ
ABN , Publish Date - Dec 25 , 2025 | 01:00 AM
యోనెక్స్ సన్‌రైజ్ జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈనెల 22న నగరంలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు ప్రారంభం కాగా, రెండు రోజుల పాటు టీం చాంపియన్‌షిప్ విభాగంలో నిర్వహించారు. బుధవారం నుంచి 87వ సీనియర్ సీ్త్ర, పురుషుల వ్యక్తిగత జాతీయ పోటీలు మొదలయ్యాయి.
ఉత్కంఠగా 87వ జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు
మొదటి రౌండ్ వ్యక్తిగత పోటీల్లో హోరాహోరీ
పోటీలను ప్రారంభించిన హోంమంత్రి అనిత
నేటి నుంచి రెండోరౌండ్ పోటీలకు ఏర్పాట్లు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ సిటీ) : యోనెక్స్ సన్‌రైజ్ జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈనెల 22న నగరంలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు ప్రారంభం కాగా, రెండు రోజుల పాటు టీం చాంపియన్‌షిప్ విభాగంలో నిర్వహించారు. బుధవారం నుంచి 87వ సీనియర్ సీ్త్ర, పురుషుల వ్యక్తిగత జాతీయ పోటీలు మొదలయ్యాయి. సీహెచ్‌ఆర్‌కే ఇండోర్ స్టేడియం, గురునానక్‌నగర్‌లోని సాయిసందీప్ ఇండోర్ స్టేడియంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 33 రాషా్ట్రలతో పాటు ఆరు సంస్థల క్రీడాకారులు పాల్గొన్నారు.
ఉత్కంఠగా మొదటి రౌండ్
పురుషుల సింగిల్స్‌కు 128 మంది, మహిళల సింగిల్స్‌కు 128 మంది, మహిళల డబుల్స్‌కు 64 జోడీలు, పురుషుల డబుల్స్‌కు 64 జోడీలు, మిక్స్‌డ్ డబుల్స్‌కు 64 జోడీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. బుధవారం పురుషుల, మహిళల సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్ మొదటి రౌండ్ పోటీలు ముగిశాయి. క్రీడాకారులు అత్యధికంగా ఉండటంతో పోటీలు రెండు స్టేడియాల్లో నిర్వహించారు. సీహెచ్‌ఆర్‌కే స్టేడియంలోని నాలుగు కోర్టుల్లో మహిళలకు, సాయి సందీప్ స్టేడియంలోని ఆరు కోర్టుల్లో పురుషులకు పోటీలు జరిగాయి.
వివరాలివీ.. : మొదటి రౌండ్ పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు అనీష్ దోనె 2-0 తేడాతో వెస్ట్ బెంగాల్ క్రీడాకారుడు అయాన్‌పాల్‌పై గెలిచి రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు. లోకేశ్‌రెడ్డి (తెలంగాణ) 2-0 తేడాతో ధృవ్‌నేగి (ఉత్తరాఖండ్)పై, ఆనంద్‌కుమార్ (తెలంగాణ) 2-1 తేడాతో నిషాంత (గోవా)పై నెగ్గగా, మరో తెలంగాణ క్రీడాకారుడు తిరుపతి, ఏపీ క్రీడాకారుడు చరణ్‌నాయక్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. మహిళల సింగిల్స్‌లో ఏపీ క్రీడాకారిణులు.. ఆకాంక్ష 2-0 తేడాతో మిజోరాం క్రీడాకారిణి లాల్ రింక్మిపై, పూజిత 2-0 తేడాతో ఎల్‌ఐసీ క్రీడాకారిణి లీనాపై, తనిష్క 2-0 తేడాతో మణిపూర్ క్రీడాకారిణి ప్రియదేవిపై, శ్రీనిత్య 2-0 తేడాతో అరుణాచల్‌ప్రదేశ్ క్రీడాకారిణి మోంటిల్లిపై గెలిచారు. తెలంగాణ క్రీడాకారిణులు మేఘనరెడ్డి 2-1 తేడాతో ఉత్తరాఖండ్ క్రీడాకారిణి అతిథిభట్‌పై, రక్షితశ్రీ 2-1 తేడాతో ఢిల్లీ క్రీడాకారిణి రిషికపై, వెన్నెల 2-0 తేడాతో మహారాష్ట్ర క్రీడాకారిణి తనిష్కపై గెలిచారు.
క్రీడాభివృద్ధికి చర్యలు : హోంమంత్రి అనిత
రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వ్యక్తిగత పోటీలను ప్రారంభించిన అనంతరం వేదికపై ఆమె మాట్లాడారు. క్రీడాకారులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో మూడుశాతం రిజర్వేషన్‌ను ప్రభుత్వం ఇటీవల ప్రకటించినట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు ప్రత్యేకంగా పోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. అనంతరం క్రీడాకారులను ఆమె పరిచయం చేసుకున్నారు. కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘురాజు, శాప్ చైర్మన్ రవినాయుడు, ఎండీ భరణి, ఏపీ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు ద్వారకానాథ్ పాల్గొన్నారు.