గన్నవరంలో గరంగరం
ABN , Publish Date - May 01 , 2025 | 12:26 AM
ఏపీసీసీ చీఫ్ షర్మిల హౌస్ అరెస్టుతో గన్నవరం మండలం కేసరపల్లి ఎస్‌ఎల్వీలోని ఆమె నివాసం వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 2న అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా షర్మిలను హౌస్ అరెస్టు చేసేందుకు ఆమె నివాసానికి వచ్చారు. అప్పటికే షర్మిల విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌కు వెళ్లేందుకు బయల్దేరగా, పోలీసులు అడ్డుకున్నారు.
షర్మిల హౌస్ అరెస్టుతో ఉద్రిక్తత
సమస్యలపై మాట్లాడే హక్కు లేదా: షర్మిల
విజయవాడ/గన్నవరం, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి) : ఏపీసీసీ చీఫ్ షర్మిల హౌస్ అరెస్టుతో గన్నవరం మండలం కేసరపల్లి ఎస్‌ఎల్వీలోని ఆమె నివాసం వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 2న అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా షర్మిలను హౌస్ అరెస్టు చేసేందుకు ఆమె నివాసానికి వచ్చారు. అప్పటికే షర్మిల విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌కు వెళ్లేందుకు బయల్దేరగా, పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే గేటు వరకు వచ్చిన షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు మాకు లేదా? రాజధానిపై కమిటీ వేస్తే పోలీసులతో హౌస్ అరెస్టు చేయిస్తారా? లా అండ్ ఆర్డర్ సృష్టించేది, ప్రజలకు అన్యాయం చేసేది మేము కాదు. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని విషయంలో ఎవరు అన్యాయం చేస్తున్నారో ప్రజలకు వివరించే బాధ్యత మాపై ఉంది.’ అని షర్మిల మండిపడ్డారు. హౌస్ అరెస్టు చేసే క్రమంలో పోలీసులు తనపై చేయి కూడా వేశారని, ఇది సరికాదని, ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకునేది లేదని ఆమె మండిపడ్డారు. తనను ఎందుకు హౌస్ అరెస్టు చేశారో సమాధానం చెప్పాలని, ఓ పార్టీ అధ్యక్షురాలిపై జులుం ఏమిటని సీఎం చంద్రబాబు, హోంమంత్రి సమాధానం చెప్పాలన్నారు. అమరావతిపై రీసెర్చ్ చేయాలని అనుకోవడంలో తప్పేంటని, రాజధాని నిర్మాణంపై కమిటీ వేశామన్నారు. కమిటీ చూడటానికి వెళ్తుంటే, ఎందుకంత భయమని, తమ పార్టీ కార్యాలయానికి వెళ్లి చర్చించాలనుకున్నామని ఆమె పేర్కొన్నారు. ఇంతలోనే హౌస్ అరెస్ట్ చేయటం సరైన వైఖరి కాదని మండిపడ్డారు. ఇదేనా కూటమి వైఖరి అని ప్రశ్నించారు. పోలీసులు మహిళలను రక్షించడంపై దృష్టి పెట్టాలని, హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. అనంతరం ఆమె విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధనేకుల మురళీమోహన్, కొలనుకొండ శివాజీ తదితరులు పాల్గొన్నారు.