కలివిడిగా.. కాజేశారు
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:59 AM
రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు. స్వలాభాన్ని సాధ్యం చేసుకోడానికి జలవనరుల శాఖలో రెండు చేతులు కలిశాయి. కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు ఒక్కటయ్యారు. వేర్వేరుగా చేయాల్సిన పనులను కమీషన్ల కోసం ప్యాకేజీలుగా చేసుకున్నారు. వేర్వేరుగా పనులు చేస్తే మిగిలేదేం ఉండదని గ్రహించిన కాంట్రాక్టర్లు తమ ప్రాబల్యంతో అధికారులను కమీషన్ల ముగ్గులోకి దించారు. ప్రభుత్వ నిబంధనలకు నీళ్లు వదిలేశారు.
జలవనరుల శాఖ స్పెషల్ డివిజన్‌లో అడ్డగోలు టెండర్లు
ఒక్కటైన కాంట్రాక్టర్లు, అధికారులు
విడివిడి పనులైతే రూ.లక్షల్లోనే.. ఒక్కటైతే రూ.కోట్లు
42 పనులకు వేర్వేరుగా ప్రభుత్వ నిధులు విడుదల
నిబంధనలకు విరుద్ధంగా ప్యాకేజీగా మార్చిన అధికారులు
సింగిల్ టెండర్లతో కాంట్రాక్టర్లకు పనుల అప్పగింత
అధికారులకు భారీగా ముట్టిన ముడుపులు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : జలవనరుల శాఖ స్పెషల్ డివిజన్‌లో చేపట్టాల్సిన పలు పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2024లో ఉగ్రరూపాన్ని చూపించిన బుడమేరు ఈ స్పెషల్ డివిజన్ పరిధిలోకి వచ్చింది. కృష్ణాజిల్లాలో డెల్టా ప్రాంతం ఉన్నప్పటికీ ఎన్టీఆర్ జిల్లాలో ఆ పరిస్థితి లేదు. మెట్ట ప్రాంతంలోని చెరువులు స్పెషల్ డివిజన్ పరిధిలోకే వస్తాయి. ఇక్కడి నిజయోజకవర్గాల్లో చెరువుల్లో పూడికతీత, మట్టిని తీసి గట్లను పటిష్టం చేయడం వంటి పనులను స్పెషల్ డివిజన్ పరిధిలోనే చేస్తారు. బుడమేరు వరదలతో దెబ్బతిన్న చెరువుల గట్లను పటిష్టం చేయడానికి పలు పనులను జిల్లా జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదించారు. ఇందులో 42 పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏ పనికి ఎంతెంత నిధులు కేటాయిస్తుందో స్పష్టం చేసింది.
సింగిల్ టెండర్లకు అగ్రిమెంట్లు
మైలవరంలో చెరువుల చుట్టూ బండలను పటిష్టం చేయడానికి, ఇతర పనులకు సంబంధించి 42 ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పనులన్నీ విడిగానే చేయాలి. దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదని భావించిన అధికారులు, కాంట్రాక్టర్లు ఒక్కటయ్యారు. విడివిడిగా ఉన్న పనులను మొత్తం ప్యాకేజీగా అధికారులు మార్చేశారు. విడివిడిగా రూ.లక్షల్లో ఉన్న పనులు ప్యాకేజీలతో రూ.కోట్లకు ఎదిగాయి. వాటికి గుట్టుచప్పుడు కాకుండా టెండర్లు పిలిచారు. నిబంధనల ప్రకారం ఒక పనికి ఒకటే టెండర్ దాఖలైతే దాన్ని రద్దు చేసి, మళ్లీ టెండర్లు పిలవాలి. స్పెషల్ డివిజన్ పరిధిలోని 42 పనులను ప్యాకేజీగా మార్చిన అధికారులు సింగిల్ టెండర్లు దాఖలైనా.. కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. అధికార పార్టీ నేతలతో ఒత్తిడి చేయించిన కాంట్రాక్టర్లు ప్యాకేజీలుగా చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. జలవనరుల శాఖలోని ముగ్గురు ఇంజనీరింగ్ అధికారులకు కాంట్రాక్టర్లు భారీగా ముడుపులు ముట్టజెప్పినట్టు తెలుస్తోంది.
రూ.కోట్లకు చెక్
సాధారణంగా జలవనరుల శాఖలో పనుల అంచనాలు రూ.కోట్లలో ఉంటాయి. స్పెషల్ డివిజన్‌లో చేపట్టే పనులకు అంచనాలను రూ.లక్షల్లో వేశారు. ప్రభుత్వం ఈ పనులకు వేర్వేరుగా ఆమోదం తెలిపి, ఉత్తర్వులు ఇచ్చింది. దాని ప్రకారమే టెండర్ల ప్రక్రియను నిర్వహించాలి. ఈ 42 పనుల్లో ఒక్కో దానికి నిర్ణయించిన అంచనాలు రూ.లక్షల్లోనే ఉన్నాయి. ఇలా చేయడం వల్ల ఎలాంటి గిట్టుబాటు ఉండదని కాంట్రాక్టర్లు భావించారు. పార్టీలతో సంబంధం లేకుండా కాంట్రాక్టర్లంతా ఒకతాటిపైకి వచ్చారు. జలవనరుల శాఖలో ముగ్గురు అధికారులను ఆ గొడుగు కిందకు తెచ్చుకున్నారు. వాస్తవానికి ఏ పనులను ప్యాకేజీగా ఉంచాలి, విడివిడిగా చేయించాలన్న దానిపై ప్రభుత్వమే ఉత్తర్వులు విడుదల చేస్తుంది. దాని ప్రకారమే పనులకు టెండర్లు పిలవాల్సి ఉంటుంది.