రాయబారులు
ABN , Publish Date - Aug 31 , 2025 | 01:19 AM
కొద్దినెలల క్రితం మద్యం దుకాణాలు పంచుకున్న సిండికేట్లు ఇప్పుడు బార్లను పంచుకున్నాయి. ఓపెన్ కేటగిరీ బార్లు, గీత కార్మికులకు కేటాయించిన బార్లకు వచ్చిన దరఖాస్తుల్లో సిండికేట్ ఛాయలు స్పష్టంగా కనిపించాయి. తమకు అనుకూలంగా ఉన్న బార్లకు మాత్రమే దరఖాస్తులు చేసుకుని మిగిలిన వాటికి దరఖాస్తులు పడకుండా సిండికేట్ చక్రం తిప్పింది.
బార్ల దరఖాస్తుల్లో సిండికేట్ హవా
అనుకూలమైన వాటికే దరఖాస్తులు
మిగిలిన వాటికి దరఖాస్తులు పడకుండా జాగ్రత్తలు
గీత కార్మికుల బార్లను పంచుకున్న సిండికేట్లు
జిల్లాలో 62 బార్లకు లాటరీ పూర్తి
మరో 68 బార్లకు త్వరలో రీ-నోటిఫికేషన్
ఒక బార్‌కు రెండు, 12 బార్లకు ఒకే దరఖాస్తు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : జిల్లాలో 130 ఓపెన్ కేటగిరీ, 10 గీత కార్మికులకు బార్లను కేటాయిస్తూ ఎక్సైజ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. 130 ఓపెన్ కేటగిరీ బార్లలో 62 బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. గీత కార్మికులకు కేటాయించిన అన్ని బార్లకు ఒక్కో దానికి పది దరఖాస్తులు అందాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తులు వచ్చిన బార్లకు అధికారులు లాటరీ తీశారు. విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్.శ్రీనివాసరావు లాటరీ ద్వారా బార్లను కేటాయించారు. దరఖాస్తులు వచ్చిన 62 బార్లకు లాటరీ తీసి అభ్యర్థులను ఎంపిక చేశారు. బార్‌ను దక్కించుకున్న వ్యక్తి ఇచ్చిన గడువులోపు ఫీజును చెల్లించకపోతే తర్వాత వారికి కేటాయించేలా రిజర్వ్ 1 (ఆర్-1), రిజర్వ్ 2 (ఆర్-2)కు లాటరీ తీశారు. దరఖాస్తులు వచ్చిన 62 బార్‌ల్లో 57 బార్లకు ఒక్కో దానికి ఒక్కొక్కరు చొప్పున నాలుగు దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీయాలి. అందుకోసం సిండికేట్లు తమకు అనుకూలంగా ఉన్న బార్‌లను ఎంపిక చేసుకుని ఒకరే నాలుగేసి దరఖాస్తులు చేసేలా ప్రణాళిక అమలు చేశారు. కేవలం ఐదు బార్‌లకే వేర్వేరు వ్యక్తులు దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతం బార్‌లు నిర్వహిస్తున్న వారు ఉన్న దాన్ని కాపాడుకోవడానికి నాలుగేసి దరఖాస్తులు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా ఇతరులెవరూ తమ బార్‌లకు దరఖాస్తులు చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బార్‌లు దక్కించుకున్నవారు సోమవారం నాటికి రూ.12.50 లక్షలు ఫీజుగా చెల్లించారు. మూడేళ్లకు లైసెన్స్ ఫీజు రూ.75 లక్షలు. దీన్ని ఆరు వాయిదాలుగా చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
‘రిజర్వేషన్’ను పంచుకున్న సిండికేట్
జిల్లాలో పది బార్లను గీత కార్మిక కులాలకు కేటాయించారు. ఈ బార్‌ల్లో ఒక్కో దానికి 10-12 దరఖాస్తులు వచ్చాయి. కేటాయించిన పది బార్లకు అభ్యర్థులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. గీత కులాలకు సంబంధించిన వ్యక్తులతో సిండికేట్లకు చెందిన నేతలు దరఖాస్తులు దాఖలు చేయించారు. ఈ రిజర్వేషన్ కేటగిరీ బార్లకు ఈవిధంగా దరఖాస్తులు రావడానికి ప్రధాన కారణం లైసెన్స్ ఫీజు. రిజర్వేషన్ బార్లకు లైసెన్స్ ఫీజును ప్రభుత్వం రూ.35 లక్షలుగా నిర్ణయించింది. ఓపెన్ కేటగిరీ బార్ల ఫీజులో సగం ఫీజునే చెల్లించాలి. అందుకోసమే సిండికేట్‌లో కీలక వ్యక్తులు గీత కులాలకు చెందిన వారి పేరుతో దరఖాస్తులు దాఖలు చేయించారు. రిజర్వేషన్ కేటగిరీలో అన్ని బార్లకు లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశారు.
68 బార్లకు రీ నోటిఫికేషన్
జిల్లాలో 68 బార్‌లకు అధికారులు రీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ 68 బార్‌ల్లో 55 బార్‌లకు ఎలాంటి దరఖాస్తులు రాలేదు. ఒక బార్‌కు రెండు దరఖాస్తులే వచ్చాయి. 12 బార్‌లకు ఒక్కొక్కరు చొప్పున దరఖాస్తు చేశారు. నిబంధనల ప్రకారం దరఖాస్తులు రాకపోవడంతో త్వరలో ఈ 68 బార్‌లకు రీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.