అయ్యో ఆంజనేయా..!
ABN , Publish Date - Jun 08 , 2025 | 01:23 AM
నందిగామ నియోజకవర్గంలోని వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో కొలువై ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానానికి చెందిన భూములను అర్చకులు గుట్టుచప్పుడు కాకుండా మింగేశారు.
వత్సవాయి మండలం భీమవరంలో స్వామి భూమి హాంఫట్
గుటకాయస్వాహా చేసిన ఆలయ అర్చకులు
చర్యలు తీసుకోవాలని భక్తుల వేడుకోలు
వన్‌టౌన్/వత్సవాయి, జూన్ 7 (ఆంధ్రజ్యోతి) : నందిగామ నియోజకవర్గంలోని వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో కొలువై ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానానికి చెందిన భూములను అర్చకులు గుట్టుచప్పుడు కాకుండా మింగేశారు. వివరాల్లోకి వెళితే.. భీమవరం గ్రామానికి చెందిన భక్తుడు మార లక్ష్మీనరుసు కుమారుడు రామనరుసు 1934, ఆగస్టులో స్థిరాస్తి దానపత్రిక ద్వారా భీమవరంలో దేవదాయ శాఖ పరిధిలోని ఆంజనేయస్వామి ఆలయానికి ఎకరం, తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా కోదాడ మండలం తమ్మర గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయానికి మరో ఎకరం.. నైవేద్య దీపారాధనల నిమిత్తం అందజేశారు. అలాగే, తన, తన వారసుల గోత్రనామాలతో సహస్రనామ పూజ జరిపేందుకు భీమవరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆర్‌ఎస్ నెంబర్ 362/1లో రెండెకరాల శేరి మెరక భూమిని నాటి అర్చకుడైన వేదాంతం రామానుజాచారి కుమారుడు శేషాచార్యులకు స్వాధీనపరిచారు. కొంతకాలం శేషాచార్యులు దాత ఆశయాలను నిర్వహించారు. కానీ, శేషాచార్యుల సంతానంలో ఒకరు ఆ భూమిపై కన్నేశాడు. దేవదాయ శాఖ ఉన్నతాధికారుల అనుమతి లేకుండా భూమిని విక్రయించటానికి ప్రణాళిక వేశాడు. ప్రస్తుతం వేదాద్రి దేవస్థానంలో అర్చకులుగా పనిచేస్తున్న ఆయన బంధువుతో పాటు భూమి ఇచ్చిన దాత బంధువులైన ఒకరు కలిసి రెండు ఎకరాల భూమిని విక్రయించేందుకు లోపాయికారీగా ఒప్పందానికి వచ్చారు. 2011, మే 12వ తేదీన అదే గ్రామానికి చెందిన యలకరాజుల గోపి ఈ భూమిని కొన్నాడు. స్వామివార్ల భూములు అమ్ముకున్నారన్న సమాచారం తెలుసుకున్న స్థానికులు దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నాటి ఉమ్మడి కృష్ణాజిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్ దుర్గాప్రసాద్ స్పందించి రిజిస్ర్టేషన్ రద్దు చేయాలని సబ్‌రిజిస్ర్టార్‌కు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల ద్వారా దాత బంధువు ఒకరు 2012లో కోర్టులో కేసు వేశారు. కోర్టులో కేసు నడుస్తుండగా 2024లో ఆయన చనిపోయాడు. దేవదాయ శాఖ అధికారులు కౌంటర్ వేయకపోవటంతో కోర్టు కేసును క్లోజ్ చేసింది. దేవదాయ శాఖ అధికారులు మాత్రం భూములు విక్రయించిన అర్చకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోపక్క ఈ విషయంపై జగ్గయ్యపేటకు చెందిన ఓ భక్తుడు లోకాయుక్తలో పిటిషన్ దాఖలు చేశాడు. స్పందించిన లోకాయుక్త దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం దేవదాయ శాఖ మంత్రి స్పందించి భూములను విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని, తిరిగి ఆ భూములను దేవస్థానాలకు అప్పగించాలని భక్తులు కోరుతున్నారు. కాగా ఈ ఆలయానికి మొదటి నుంచి ఈవో కానీ, మేనేజర్ కానీ లేడు. భూములు విక్రయించిన తరువాత అధికారులే ఈవోను నియమించటం గమనార్హం.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా..
భీమవరంలోని ఆంజనేయస్వామి దేవస్థానానికి చెందిన భూమిని అర్చకులు దాత బంధువుతో కలిసి విక్రయించిన వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. - నటరాజన్ షణ్ముగం, ఎన్టీఆర్ జిల్లా దేవదాయ శాఖ అధికారి