Share News

ఒక్కొక్కరుగా నకిలీలు

ABN , Publish Date - Nov 08 , 2025 | 12:33 AM

నకిలీ మద్యం తయారీ కేసులో నలుదిక్కుల్లో మూలాలు బయటకొస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఒక్కొక్కరు చేసిన పనులపై ఎక్సైజ్‌, సిట్‌ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. కోర్టు ద్వారా కస్టడీలోకి తీసుకుంటుండంతో నిందితుల సంఖ్య భారీగానే పెరుగుతోంది. తాజాగా శుక్రవారం ఎక్సైజ్‌ పోలీసులు మరో ఏడుగురిని కస్టడీలోకి తీసుకున్నారు.

ఒక్కొక్కరుగా నకిలీలు
శుక్రవారం ఎక్సైజ్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకున్న ఏడుగురిలో ఐదుగురు నిందితులు

నకిలీ మద్యం కేసులో బయటపడుతున్న నిందితులు

తాజాగా ఏడుగురిని కస్టడీకి తీసుకున్న ఎక్సైజ్‌

కీలక ఆధారాలు సేకరించే పనిలో అధికారులు

విచారణలో తవ్వేకొద్దీ బయటకొస్తున్న నిజాలు

పేరు తప్పుతో మనోజ్‌కుమార్‌ అతి తెలివి

హైకోర్టును ఆశ్రయించిన ‘మూతల’ నిందితుడు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : నకిలీ మద్యం తయారీ కేసులో ఒక్కొక్కరి వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దనరావు, జగన్మోహనరావును వారం పాటు కస్టడీకి తీసుకుని విచారణ చేశారు. వారిద్దరూ ఇచ్చిన సమాచారంతో వైసీపీ నేత, మాజీమంత్రి జోగి బ్రదర్స్‌కు సంకెళ్లు చేశారు. నకిలీ మద్యం తయారీలో ఎవరెవరి పాత్ర ఎంత అన్న దానిపై ఒక్కో నిందితుడిని విచారణ చేయడం ద్వారా కూపీ లాగుతున్నారు. తాజాగా రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న బాదల్‌దాస్‌, ప్రదీప్‌దాస్‌, డి.శ్రీనివాస్‌రెడ్డి, వెంకట కల్యాణ్‌, అల్లాభక్షు, నకరికంటి రవి, తాండ్ర రమేశ్‌బాబును శుక్రవారం కోర్టు ఐదు రోజుల కస్టడీకి ఇచ్చింది.

ఒక్కొక్కరుగా విచారణ

బాదల్‌దాస్‌, ప్రదీప్‌దాస్‌ ఇబ్రహీంపట్నంలో ఉన్న ఏఎన్‌ఆర్‌ బార్‌లో పనిచేస్తూనే నకిలీ మద్యం సీసాలను బాక్స్‌లో పెట్టేవారు. ఫార్ములాను ఉపయోగించిన బాలాజీ చెప్పినట్టుగా వారు చేసేవారు. ఈ మద్యాన్ని బార్‌ బిజీగా ఉన్న రోజుల్లో మందుబాబులకు సరఫరా చేసేవారు. గన్నవరం మండలం సూరంపల్లిలో ప్లాస్టిక్‌ వస్తువుల తయారీ పరిశ్రమ నిర్వహించే డి.శ్రీనివాసరెడ్డి అద్దేపల్లి సోదరులకు అడిగిన మొత్తంలో ప్లాస్టిక్‌ సీసాలను సరఫరా చేశాడు. వాటికి అవసరమైన మూతలను వన్‌టౌన్‌లోని మనోజ్‌కుమార్‌ జైన్‌ బ్రాండ్లను ముద్రించి సరఫరా చేసేవాడు. హైదరాబాద్‌కు అల్లాభక్షు, జగ్గయ్యపేటకు చెందిన నకరికంటి రవి, ఒంగోలుకు చెందిన తాండ్ర రమేశ్‌బాబు.. అద్దేపల్లి సోదరులు చెప్పినట్టుగా సరుకును తలో ప్రదేశానికి మార్చేవారు. వారిద్దరి ఆదేశాల ప్రకారం అడుగులు వేసేవారు. ఇప్పుడు ఈ నిందితులను ఎక్సైజ్‌, సిట్‌ అధికారులు ఒక్కొక్కరుగా విచారణ చేస్తున్నారు. వారి వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు.

మనోజ్‌ అతితెలివి

నకిలీ మద్యం తయారీ కేసులో ఏ20గా ఉన్న మనోజ్‌కుమార్‌ జైన్‌ అతి తెలివి ప్రదర్శిస్తున్నాడు. ఎక్సైజ్‌ అధికారులు చేసిన తప్పిదాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. దీనిపై న్యాయపోరాటం చేయడానికి హైకోర్టు మెట్లెక్కాడు. మాజీమంత్రి జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రామును సిట్‌ అధికారులు ఈనెల రెండో తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆరోజున కోర్టుకు సమర్పించిన కేసు డైరీలో ఏ20గా మనోజ్‌ కొఠారి పేరును రాశారు. మూడో తేదీన వన్‌టౌన్‌లోని పులిపాటి వారి వీధిలో ప్లాస్టిక్‌ మూతల వ్యాపారం చేస్తున్న మనోజ్‌కుమార్‌ జైన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనికి చాతీనొప్పి రావడంతో ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించి 41ఏ నోటీసు ఇచ్చి విడుదల చేశారు. నేరాలు చేయడంలో అనుభవం ఉన్న మనోజ్‌కుమార్‌ ఇక్కడే తన మెదడుకు పదును పెట్టాడు. ఎఫ్‌ఐఆర్‌, కేసు డైరీలో తన పేరు లేకపోయినా ఎక్సైజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కోర్టును ఆశ్రయించాడు. వ్యాపారరీత్యా తనకు వచ్చిన ఆర్డర్ల ప్రకారమే మూతలు సరఫరా చేశానని చెబుతున్నాడు. ఆ మూతలపై నకిలీ మద్యం బ్రాండ్ల పేర్లను ముద్రించి మరీ సరఫరా చేయడాన్ని ఎక్సైజ్‌ పోలీసులకు ఒక ఆధారంగా మారింది. తాను మూతలను మనోజ్‌కుమార్‌ నుంచి కొన్నానని అద్దేపల్లి జనార్దనరావు స్పష్టంగా చెప్పాడు. అసలు జనార్దనరావు అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని, కలిసి వ్యాపారం చేయలేదని మనోజ్‌ చెబుతున్నాడు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండా అరెస్టు చేయడానికి ఎక్సైజ్‌ పోలీసులు ప్రయత్నిస్తున్నారని హైకోర్టును ఆశ్రయించాడు. ఎక్సైజ్‌ పోలీసులు సీడీ ఫైలులో మనోజ్‌ కొఠారి అని మాత్రమే రాశారు. విజయవాడ వన్‌టౌన్‌లో అనేక మంది ఈ పేరుతో ఉన్నారని, వారెవరో స్పష్టంగా రాయాలని వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న మనోజ్‌ కొఠారి చెబుతున్నాడు. ఎక్సైజ్‌ పోలీసులు ఈ పేరును ప్రస్తావించగానే అంతా వైసీపీ నేత మనోజ్‌ కొఠారిని నిందితుడిగా చేర్చారని భావించారు. తర్వాత అదే పోలీసులు మనోజ్‌కుమార్‌ జైన్‌ను అరెస్టు చేయడంతో గందరగోళం ఏర్పడింది. సీడీ ఫైలులో పేరు తేడాగా ఉండటంతో జనార్దనరావుకు ముద్రించిన ప్లాస్టిక్‌ మూతలను సరఫరా చేసిన మనోజ్‌కుమార్‌ జైన్‌ తెలివితేటలను ప్రదర్శిస్తున్నాడు.

Updated Date - Nov 08 , 2025 | 12:33 AM