Share News

మన ‘చరిష్మ’

ABN , Publish Date - Dec 28 , 2025 | 01:05 AM

యోనెక్స్‌ సన్‌రైజ్‌ 87వ బ్యాడ్మింటన్‌ జాతీయ సీనియర్‌ స్ర్తీ, పురుషుల పోటీలు తుదిదశకు చేరాయి. నగరంలోని పటమట చెన్నుపాటి రామకోటయ్య (సీహెచ్‌ఆర్‌కే) స్టేడియంలో వారం రోజులుగా జరుగుతున్న ఈ పోటీల్లో శనివారం సెమీఫైనల్స్‌ జరిగాయి. మహిళల సింగిల్స్‌లో నగరానికి చెందిన క్రీడాకారిణి తమిరి సూర్యచరిష్మ అత్యున్నత క్రీడా నైపుణ్యాన్ని చాటింది.

మన ‘చరిష్మ’
మహిళల సింగిల్స్‌లో సూర్య చరిష్మ (ఆంధ్రప్రదేశ్‌)

ఫైనల్స్‌కు నగరానికి చెందిన సూర్య చరిష్మ

తుది అంకానికి బ్యాడ్మింటన్‌ సమరం

నేడు ఫైనల్స్‌కు అన్ని ఏర్పాట్లు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ సిటీ) : యోనెక్స్‌ సన్‌రైజ్‌ 87వ బ్యాడ్మింటన్‌ జాతీయ సీనియర్‌ స్ర్తీ, పురుషుల పోటీలు తుదిదశకు చేరాయి. నగరంలోని పటమట చెన్నుపాటి రామకోటయ్య (సీహెచ్‌ఆర్‌కే) స్టేడియంలో వారం రోజులుగా జరుగుతున్న ఈ పోటీల్లో శనివారం సెమీఫైనల్స్‌ జరిగాయి. మహిళల సింగిల్స్‌లో నగరానికి చెందిన క్రీడాకారిణి తమిరి సూర్యచరిష్మ అత్యున్నత క్రీడా నైపుణ్యాన్ని చాటింది. తెలంగాణాకు చెందిన రక్షితశ్రీని 2-1 తేడాతో ఓడించి ఫైనల్స్‌కు చేరింది. తొలిసెట్‌లో 21-18 స్కోర్‌ ఆధిక్యాన్ని నమోదు చేసిన చరిష్మ, రెండో సెట్‌లో 18-21తో కాస్త వెనకడుగు వేసింది. మళ్లీ మూడో సెట్‌లో పుంజుకుని 21-9 ఆధిక్యాన్ని నమోదు చేసింది.

స్కోర్‌బోర్డు : మహిళల సింగిల్స్‌లో తన్వి పత్రి (ఒడిశా), మహిళల డబుల్స్‌లో ప్రియాదేవి (మణిపూర్‌) - శృతిమిశ్రా (ఉత్తర్‌ప్రదేశ్‌) జోడి, మరో మహిళల డబుల్స్‌లో టాప్‌ సీడెడ్‌ కర్ణాటక జోడి శిఖాగౌతమ్‌ - అశ్వినిభట్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో టాప్‌ సీడర్‌ సూర్య - అమృత (కర్ణాటక), మరో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో టాప్‌ సీడర్‌ సాత్విక్‌రెడ్డి (తెలంగాణ) - రాధిక (పంజాబ్‌), పురుషుల సింగిల్స్‌లో రిత్విక్‌ సంజీవి (తమిళనాడు), మరో సింగిల్స్‌లో టాప్‌సీడర్‌ భరతరాఘవ్‌ (హరియాణా), పురుషుల డబుల్స్‌లో టాప్‌సీడర్‌ హరిహరణ్‌ - రూబన్‌కుమార్‌ (తమిళనాడు) జోడి, మరో డబుల్స్‌లో మితిలేష్‌-ప్రేజాన్‌ (పుదుచ్చేరి) ఫైనల్స్‌కు చేరారు.

నేడే ఫైనల్స్‌

పటమట చెన్నుపాటి రామకోటయ్య (సీహెచ్‌ఆర్‌కే) స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఫైనల్స్‌ ప్రారంభమవుతాయని నిర్వాహకులు ప్రకటించారు. మహిళల సింగిల్స్‌లో సూర్యచరిష్మ (ఏపీ), తన్విపత్రి (ఒడిశా) మధ్య పోటీ జరుగుతుంది. మహిళల డబుల్స్‌లో శిఖాగౌతమ్‌-అశ్వినిభట్‌ జోడి, ప్రియాదేవి-శృతిమిశ్రా జోడి పోటీ పడతారు. పురుషుల సింగిల్స్‌లో రిత్విక్‌ సంజీవి (తమిళనాడు), భరతరాఘవ్‌ (హరియాణా), డబుల్స్‌లో హరిహరణ్‌-రూబన్‌కుమార్‌ జోడి, మితిలేష్‌-ప్రేజాన్‌ (పుదుచ్చేరి) జోడి, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సూర్య-అమృత జోడి, సాత్విక్‌రెడ్డి-రాధిక తలపడతారు. సెమీ ఫైనల్స్‌ పోటీ నుంచి నిష్క్రమించిన క్రీడాకారులకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు బ్రాంజ్‌ మెడల్స్‌ అందజేశారు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఏఐ) ప్రధాన కార్యదర్శి సంజయ్‌మిశ్రా పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 01:05 AM