Share News

గుండెపోటుతో విద్యార్థి మృతి

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:47 AM

చిన్న వయస్సులోనే మరో గుండె ఆగింది. స్థానిక కాగితాల బజార్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతిచెందడంతో విషాదఛాయలు అలముకున్నాయి.

గుండెపోటుతో విద్యార్థి మృతి

టెన్త్‌క్లాస్‌ ట్యూషన్‌కు వెళ్తూ దారిలోనే..

సైకిల్‌ తొక్కుతుండగా గుండెనొప్పి

ఆసుపత్రికి తరలించేలోపు దుర్మరణం

జగ్గయ్యపేటలో విషాదం

జగ్గయ్యపేట, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : చిన్న వయస్సులోనే మరో గుండె ఆగింది. స్థానిక కాగితాల బజార్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతిచెందడంతో విషాదఛాయలు అలముకున్నాయి. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గోలి వెంకట గణేశ్‌ (15) శుక్రవారం ఉదయం 7 గంటలకు మార్కండేయ బజార్‌లో ఉన్న ట్యూషన్‌కు వెళ్లేందుకు సైకిల్‌పై బయల్దేరాడు. గుడి సమీపంలోకి రాగానే, సైకిల్‌ తొక్కలేక కింద పడిపోయాడు. స్థానికులు గమనించి ఆర్‌ఎంపీ దగ్గరకు తీసుకెళ్లారు. పల్స్‌ పడిపోవటంతో పాటు తలపై కంటి పక్కన దెబ్బ తగలడంతో వారు గణేశ్‌ తల్లి శిరీషకు సమాచారం అందించారు. అనంతరం గణేశ్‌ను ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. గణేశ్‌ తండ్రి రామారావు ఐదేళ్ల కిందట హృద్రోగంతో చనిపోయాడు. తల్లి శిరీష ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ కుమారుడిని చదివిస్తోంది. అటు భర్తను, ఇటు చేతికి అందివచ్చిన కొడుకును కోల్పోయి శిరీష గుండెలవిసేలా రోదించింది.

Updated Date - Oct 25 , 2025 | 12:47 AM