సెపరేట్ చేస్తున్నారా?
ABN , Publish Date - Dec 09 , 2025 | 12:31 AM
విజయవాడ ఏ1 రైల్వేస్టేషన్‌ను ప్రధాన రూట్లకు దూరం చేయాలని రైలే ్వబోర్డు ఆలోచన చేస్తుందా? ఈ ఆలోచన బెజవాడ ప్రజలకు ముఖ్యమైన రైల్వేరూట్లను దూరం చేస్తుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. రైల్వే అధికారులు తాజాగా వేస్తున్న అడుగులు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
విజయవాడ రైల్వేస్టేషన్ ‘ఐసోలేట్’ దిశగా అడుగులు
కమర్షియల్‌గా ఉపయోగించుకునే పన్నాగమేనా?
తాజా రైల్వే ఆలోచనలతో అనుమానాలకు బలం
రైల్వేస్టేషన్ అభివృద్ధి అమృత భారతకు కాకుండా ప్రైవేట్‌కు..
విజయవాడ మీదుగా ప్రధాన రూట్ల క్రమబద్దీకరణ
సమాంతరంగా రాయనపాడు, గుణదల స్టేషన్ల అభివృద్ధి
అమరావతి, మచిలీపట్నం-రేపల్లె లైన్లు అందులో భాగమేనా?
ఇప్పటికే చాలా రైళ్లు రాయనపాడు వరకు మార్పు
ప్రధాన రూట్లను కూడా మళ్లించే ప్రణాళికలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ రైల్వేస్టేషన్‌ను క్రమేణా కమర్షియల్ హబ్‌గా మార్చేసి ఆదాయాన్ని ఆర్జించాలన్నది రైల్వేబోర్డు ఆలోచనగా ఉంది. రద్దీ స్టేషన్లలో ఒకటైన ఈ రైల్వేస్టేషన్‌ను ముఖ్యరూట్ల నుంచి ఐసోలేట్ చేస్తేనే తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే విజయవాడ ప్రధాన రైల్వేస్టేషన్ అతిముఖ్యమైన రూట్లను కోల్పోయే ప్రమాదం ఉంది. ఫలితంగా బెజవాడ రైల్వేస్టేషన్, పరిసర స్థలాలను కమర్షియల్‌గా సద్వినియోగం చేసుకునే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది.
ప్లాట్‌ఫాంల కుదింపు ఎందుకో..
దేశవ్యాప్తంగా చాలా రైల్వేస్టేషన్లను అమృత భారత కింద రైల్వేశాఖ అభివృద్ధి చేస్తోంది. మన రాష్ట్రంలో కూడా ఒక్క విజయవాడ తప్ప అన్ని రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. విజయవాడను మాత్రం ప్రైవేట్ డెవలపర్లతో అభివృద్ధి చేయించాలని నిర్ణయి ంచారు. అయితే, ఈ అభివృద్ధి ప్రాజెక్టులో పలు మార్పులు చేశారు. ప్రస్తుతం రైల్వేస్టేషన్‌లో 10 ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. వీటిని 12 చేయాలని గతంలో ప్రతిపాదించారు. కానీ, 10నే కొనసాగిస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక విజయవాడ రైల్వేస్టేషన్‌ను ఐసోలేట్ (ఒంటరిని) చేయాలన్న ఉద్దేశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే కమర్షియల్‌గా అభివృద్ధి చేయాల్సిన ప్రదేశాన్ని మూడొంతులు పెంచారు. దీనినిబట్టి విజయవాడలో రూ.వేలకోట్ల విలువైన రైల్వే ఆస్తుల ద్వారా ఆదాయాన్ని సాధించాలన్నది రైల్వేబోర్డు ఆలోచన.
అమరావతి రైల్వేలైన్ అలైన్‌మెంట్ ఇందులో భాగమేనా?
రాజధాని అమరావతికి రైల్వేలైన్ ఏర్పాటుకు సంబంధించి రైల్వేబోర్డు ఎంచుకున్న అలైన్‌మెంట్ మొదట్లో ఎవరికీ అర్థం కాలేదు. విజయవాడ నుంచి కృష్ణా కెనాల్ జంక్షన్ మీదుగా మంగళగిరి, ఉండవల్లి, అమరావతికి వెళ్లే అవకాశం ఉన్నా.. ఖమ్మంజిల్లా ఎర్రుపాలెం నుంచి పరిటాల మీదుగా అమరావతికి , తిరిగి అమరావతి నుంచి నంబూరుకు నూతన రైల్వేలైన్ ప్రతిపాదించారు. ఈ అలైన్‌మెంట్ వెనుక విజయవాడను ఐసోలేట్ చేయాలన్న ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ-విజయవాడ-చెన్నై మధ్య రాకపోకలు సాగించే రైళ్లు కొండపల్లి మీదుగా విజయవాడ వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు, అటు నుంచి చెన్నైకు రాకపోకలు సాగిస్తాయి. దీంతో ఢిల్లీ రైళ్లు విజయవాడను టచ్‌చేసే పరిస్థితి తగ్గుతుంది. అమరావతి నూతన రైల్వేలైన్ ఏర్పడితే కచ్చితంగా ఢిల్లీ-చెన్నై రైళ్లను అమరావతి మీదుగానే నడపాల్సి ఉంటుంది. ఇవేకాకుండా విజయవాడ మీదుగా వెళ్లే ఇతర జోన్లకు సంబంధించి పాసింగ్ త్రూ రైళ్లు కూడా విజయవాడకు రాకుండానే వెళ్లే అవకాశముంది.
కోల్‌కతా రైళ్లు సైతం రాయనపాడు మీదుగానే..
సికింద్రాబాద్ నుంచి కోల్‌కతా వెళ్లే రైళ్లు ప్రస్తుతం విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. భవిష్యత్తులో ఇవన్నీ రాయనపాడు శాటిలైట్ రైల్వేస్టేషన్ మీదుగా (అమరావతి రైల్వేలైన్ మీదుగా) వెళ్తాయని సమాచారం. దీంతో ఈ మార్గంలో నడిచే చాలా రైళ్లు విజయవాడను టచ్‌చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇదే జరిగితే అతి ముఖ్యమైన రెండో రూట్‌ను కూడా విజయవాడ రైల్వేస్టేషన్ కోల్పోయే ప్రమాదం ఉంది. విజయవాడకు వచ్చే రైళ్లలో సగభాగం కోల్‌కతా-చెన్నై మధ్య రాకపోకలు సాగించేవే. ఢిల్లీ, చెన్నై వయా విజయవాడ రూట్, సికింద్రాబాద్-చెన్నై వయా విజయవాడ రూట్‌ల తర్వాత మూడో స్థానంలో ఉన్న కోల్‌కతా-చెన్నై వయా విజయవాడ రైళ్లకు ఇప్పటికిప్పుడు విజయవాడ మీదుగా వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. ఈ రూట్‌ను కూడా త్వరలో మళ్లించే అవకాశం ఉంది. నరసాపురం మీదుగా మచిలీపట్నం-రేపల్లె, రేపల్లె-బాపట్ల రైల్వేలైన్లకు సంబంధించి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సర్వే జరుగుతోంది. డీపీఆర్ రూపకల్పన చేస్తే భవిష్యత్తులో నూతన రైల్వేలైన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అప్పుడు కోల్‌కతా-చెన్నై రైళ్లను మళ్లించే అవకాశం ఉంది. అలాగే, సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-భువనేశ్వర్ రైళ్లు కూడా రాయనపాడులోనే ఆగే అవకాశాలు ఉన్నాయి.
శాటిలైట్ రైల్వేస్టేషన్లలో కొన్నింటికి హాల్టింగ్
విజయవాడ రైల్వేస్టేషన్‌పై రద్దీ తగ్గించడానికి వీలుగా ఇప్పటికే 30 రైళ్లు శాటిలైట్ రైల్వేస్టేషన్ రాయనపాడులో ఆపేస్తున్నారు. భవిష్యత్తులో మరో 30 రైళ్లు ఆపేందుకు గుణదలను కూడా శాటిలైట్ రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు.