కోరలు చాస్తున్నాయ్
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:35 AM
జిల్లాలో పాముకాట్ల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల కొత్త ప్రభుత్వాసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 214 మంది పాముకాటుకు గురయ్యారు. ఏడు నెలల్లో నలుగురు మరణించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంఖ్య అధికమే.
జీజీహెచ్‌కు క్యూ కడుతున్న పాముకాటు బాధితులు
ఏడు నెలల వ్యవధిలో 214 కేసులు
210 మంది చికిత్స.. నలుగురు మరణం
గత ఏడాదితో పోలిస్తే పెరిగిన రోగులు
వర్షాల చల్లదనానికి బయటకు వస్తున్న సర్పాలు
వరదల్లో కొట్టుకొచ్చి పొలాలు, ఇళ్లల్లోకి ప్రవేశం
రైతులు జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన
ఇంటి ఆవరణలో పరిశుభ్రత ముఖ్యమని హితవు
విజయవాడ/ప్రభుత్వాసుపత్రి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పాముకాట్ల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల కొత్త ప్రభుత్వాసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 214 మంది పాముకాటుకు గురయ్యారు. ఏడు నెలల్లో నలుగురు మరణించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంఖ్య అధికమే. 2023లో పాముకాటుకు 582 మంది గురికాగా, 477 మంది ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందారు. వీరిలో నలుగురు చనిపోయారు. 2024లో 444 మంది పాముకాటుకు గురికాగా, 399 మంది ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆరుగురు మరణించారు. ఈ ఏడాది ఏడు నెలలకు 214 మంది పాముకాటుకు గురికాగా, 210 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. నలుగురు మరణించారు.
చల్లదనానికి బయటకొస్తున్న సర్పాలు
వర్షాలు పడుతుండటం, చల్లటి వాతావరణం, ముమ్మర వ్యవసాయ పనుల నేపథ్యంలో పాములు బయటకు వస్తున్నాయి. నివాస ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించడం వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో పాములు సంచరిస్తున్నాయి. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో రైతులు, కూలీలు పాముకాటుతో మృతి చెందుతున్నారు. అలాగే, ఇళ్ల పరిసరాల్లో కలుపుమొక్కలు, గడ్డి ఏపుగా పెరగడం కూడా పాములకు నిలయంగా మారుతోంది.
పాముకాటు వల్ల కలిగే లక్షణాలివీ..
విషం ఉన్న పాము కాటువేస్తే ఒకటి లేదా రెండు గాట్లు కనిపిస్తాయి. విషం లేని పాము కాటువేస్తే రెండు కంటే ఎక్కువ గాట్లు ఉంటాయి. తాచుపాము, కట్లపాము వంటి విషపాములు కాటువేస్తే కొంత సమయం తర్వాత చేతులు, కాళ్ల కదలికలు ఆగిపోతాయి. కండరాల నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. సమయానికి వైద్యం అందకపోతే నరాలపై ప్రభావం చూపి వ్యక్తి మరణిస్తాడు. రక్తపింజర కాటువేస్తే శరీరం లోపల అవయవాల్లో రక్తస్రావం కావడంతో పాటు చెవులు, ముక్కు నుంచి రక్తం కారుతుంది. రక్తపింజర కాటు వేసిన ప్రదేశంలో వాపు, బొబ్బలు కనిపిస్తాయి. రక్తపింజర కాటు వేసిన 30 నిమిషాల్లో ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించాలి. లేకపోతే పరిస్థితి విషమించి చనిపోయే ప్రమాదముంది. సముద్ర పాము కాటువేస్తే కండరాల సమస్య ఎక్కువవుతుంది. వైద్యం అందడం ఆలస్యమైతే కిడ్నీపై ప్రభావం చూపి మరణించే ప్రమాదం ఉంది. అయితే, సముద్ర పాముకాటుకు గురైన వారిలో 85 శాతం మంది మరణం నుంచి తప్పించుకున్నవారే.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పాము కాటువేస్తే ముందుగా ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా గాట్లను గమనించాలి. ఒకటి లేదా రెండు గాట్లు ఉంటే పాము కాటు వేసిన ప్రదేశం నుంచి ఒక అడుగు పైభాగంలో గుడ్డముక్క/తాడుతో రక్త సరఫరాకు అంతరాయం కలగకుండా కట్టాలి. వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించాలి. ఎట్టి పరిస్థితుల్లో నోటి ద్వారా విషాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించకూడదు. విషం లేని పాము కాటు వేసిందని తెలిసినప్పటికీ అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ఆందోళన చెందకూడదు పాముకాటుకు గురైన వ్యక్తి ఆందోళన చెందకూడదు. దీనివల్ల రక్తప్రసరణ నియంత్రణలో ఉంటుంది. ఆసుపత్రికి వచ్చిన వెంటనే టెట్‌వాక్ ఇంజక్షన్ ఇస్తాం. కొన్నిసార్లు ఏ పాము కాటువేసిందో నిర్ధారించలేం. అటువంటి సమయంలో ఈ వ్యాక్సిన పనిచేస్తుంది. వ్యాక్సిన ఇచ్చాక బాధితుడికి గంటకోసారి రక్తపరీక్ష చేయాలి. రక్తం ఏ స్థాయిలో గడ్డ కడుతుందో తెలుసుకోవడంతో పాటు 24 గంటల్లో 10 యాంటీ వీనం ఇంజక్షన్లు ఇవ్వాలి. బాధితుడి పరిస్థితిని బట్టి ఈసీజీ తీయాలి. మొదటి డోస్ వేసినప్పటి నుంచి 24 గంటల పాటు అబ్జర్వేషనలో ఉంచాలి.
- డి.ఇందిరాదేవి, జనరల్ మెడిసిన హెచవోడీ, ప్రభుత్వాసుపత్రి