ఆర్టీసీ బస్సులో పొగలు
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:55 AM
నగరం నుంచి కోదాడకు వెళ్తున్న ఆర్టీసీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులో పొగలు రావటంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. కొందరు ప్రయాణికులు ఒక్కసారిగా బస్సు నుంచి బయటకు దూకారు.
భయాందోళనలో ప్రయాణికులు
భయంతో దూకేసిన కొందరు
బాయినెట్ నుంచి వచ్చిన పొగలు
విజయవాడ-కోదాడ మెట్రో బస్సులో ఘటన
వేరొక బస్సులో ప్రయాణికుల తరలింపు
నందిగామ/బస్‌స్టేషన్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : నగరం నుంచి కోదాడకు వెళ్తున్న ఆర్టీసీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులో పొగలు రావటంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. కొందరు ప్రయాణికులు ఒక్కసారిగా బస్సు నుంచి బయటకు దూకారు. దీంతో డ్రైవర్ బస్సును నిలుపుదల చేశాడు. ఈ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు శనివారం సాయంత్రం విజయవాడ నుంచి కోదాడ బయల్దేరింది. కంచికచర్లకు వచ్చేసరికి ఇంజన్ నుంచి వాసన వచ్చింది. ప్రయాణికులంతా కాలిన వాసన వస్తోందని అరిచారు. అక్కడి నుంచి బస్సు ఐదు కిలోమీటర్లు ప్రయాణించాక బాయ్‌నెట్ నుంచి పొగలు రావటం ప్రారంభమయ్యాయి. పొగలు చూసిన ప్రయాణికులు కొందరు బస్సులో నుంచి దూకేశారు. అయితే వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆ సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. రేడియేటర్‌లోని నీరు బాగా కాలిపోయి ఇంజన్ ఆయిల్ నిల్వ ఉండే బాక్స్ పై క్యాప్ కరిగిపోయింది. బస్సు రన్నింగ్‌లో ఉండటంతో కుదుపులకు ఇంజన్ ఆయిల్ కాస్తా ఇంజన్ మీదకు చిమ్మింది. దీనివల్ల పొగలు వచ్చాయని తేల్చారు. ఈ పొగలు బాయినెట్ లోపల నుంచి బస్సులోకి వచ్చాయి. కర్నూలు బస్సు దుర్ఘటన నేపఽథ్యంలో ఒక్కసారిగా అందరూ ఆందోళన చెందారు. అనంతరం తాత్కాలికంగా క్యాప్ ఏర్పాటుచేసి కోదాడ వెళ్లేందుకు ప్రయత్నించినా ప్రయాణికులు ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని డ్రైవర్ రమేశ్ డిపో కంట్రోలర్ రామకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు. మరో బస్సులో ప్రయాణికులను పంపించి, బస్సును గవర్నర్‌పేట-2 డిపోకు తీసుకొచ్చారు.