Share News

విషాదం

ABN , Publish Date - May 25 , 2025 | 01:07 AM

జిల్లాలో శనివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక ఘటనలో అన్నాచెల్లెలు, వారిని కాపాడే ప్రయత్నంలో అన్న భార్య చనిపోయారు. మరో ఘటనలో ఇద్దరు పదిహేనేళ్లలోపు బాలురు మృతిచెందగా, ఇంకో ఘటనలో పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదాలతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. - విజయవాడ, ఆంధ్రజ్యోతి

విషాదం
ఘటనాస్థలిలో మృతదేహాలు

జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు దుర్మరణం

విద్యుదాఘాతానికి పటమటలో ముగ్గురు

గొల్లపూడి వద్ద కృష్ణానదిలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు

రెడ్డిగూడెం మండలంలో చేపల చెరువులో పడి ఓ బాలుడు

  • ఒకరినొకరు రక్షించుకోబోయి..

ఒకరు తోబుట్టువు. మరొకరు జీవిత భాగస్వామి. ఇద్దరూ ఆయనకు రెండు కళ్లతో సమానం. విద్యుత షాక్‌ ఈ ముగ్గురిని ఒకేసారి తిరిగిరాని లోకాలకు చేర్చింది. పటమటలోని నారా చంద్రబాబునాయుడు కాలనీలో ఉన్న సాయి టవర్స్‌లో శనివారం జరిగిన విద్యుదాఘాతంలో రాజమహేంద్రవరానికి చెందిన సలాది ప్రసాద్‌, ఆయన భార్య ఊటుకూరి రాధాతో పాటు చెల్లెలు పరిమళ ముత్యావలి అక్కడికక్కడే చనిపోయారు. ఇనుప తీగపై ఆరేసిన దుస్తులను తీస్తుండగా, గోడల నుంచి ఇనుపరాడ్డుకు చేరిన విద్యుత ముత్యావలిని చుట్టేసింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో తడిచేతులతో ప్రసాద్‌ పట్టుకోవడంతో ఆయనా ప్రాణాలు కోల్పోయాడు. గుమ్మం బయట విద్యుత షాక్‌కు బలైపోతున్న భర్త, ఆడపడుచును రక్షించే ప్రయత్నంలో ప్రసాద్‌ భార్య రాధా వారితో పాటే ప్రాణాలు కోల్పోయింది.

  • ప్రాణం తీసిన ఈత సరదా

సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు జలసమాధి అయ్యారు. ఈ ఘటన భవానీఘాట్‌లో శనివారం జరిగింది. గొల్లపూడి రామరాజ్యనగర్‌ మిల్క్‌కాలనీకి చెందిన రిత్విక్‌ (15) కొద్దిరోజుల క్రితం వచ్చిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. త్వరలో ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ చేర్చడానికి అతడి తల్లిదండ్రులు సన్నాహాలు చేస్తున్నారు. స్కూల్‌ నుంచి టీసీ తీసుకోవడానికి రిత్విక్‌ వెళ్లాడు. మధ్యాహ్నం నుంచి ఇంటికి సమీపాన ఉండే కనుమూరి చైతన్య, అతడి సోదరుడు గిరీశ్వర్‌ (12), బొడ్డు భార్గవ్‌, కాకర్లపూడి లోహిత, రాయప్ప వర్మ భవానీ ఘాట్‌ వద్దకు వెళ్లి కృష్ణానదిలో స్నానం చేయాలనుకున్నారు. వారితో కలిసి రిత్విక్‌ వెళ్లాడు. చైతన్య, భార్గవ్‌, లోహిత ఒడ్డున ఉన్నారు. గిరీశ్వర్‌, రిత్విక్‌ నదిలోకి దిగారు. కొద్దిసేపు నీటిలో సరదాగా ఈత కొట్టారు. తిరిగి ఒడ్డుకు వస్తుండగా నదిలో లోతుగా ఉన్న ప్రదేశంలో గిరీశ్వర్‌ మునిగిపోయాడు. అతడు మునిగిపోతూ పక్కనే ఉన్న రిత్విక్‌ను పట్టుకున్నాడు. దీంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఊపిరాడక చనిపోయారు.

  • పదేళ్లకే నిండిన నూరేళ్లు

చేపల చెరువు వద్ద సరదాగా గడపడానికి వెళ్లిన పదేళ్ల బాలుడికి నూరేళ్లు నిండిపోయాయి. రెడ్డిగూడెం మండలంలో జరిగిన ఘటన ఇది. నాగులూరు గ్రామానికి చెందిన ముదగన కృష్ణ కూలీ. ఆయన భార్య నాగలక్ష్మి గృహిణి. ఈ దంపతులకు ఈశ్వర్‌(10) ఏకైక కుమారుడు. ఇంటి వద్ద శుక్రవారం ఆడుకుంటూ బయటకు వెళ్లిన ఈశ్వర్‌ శనివారం ఉదయం చేపల చెరువులో మృతదేహమై తేలాడు. ఒక్కగానొక్క కుమారుడ్ని కోల్పోయి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.

Updated Date - May 25 , 2025 | 01:07 AM