‘పాపి’స్థాన్!
ABN , Publish Date - May 11 , 2025 | 01:21 AM
‘పాకిస్థాన్.. మతోన్మాదాన్ని తలకెక్కించుకుని, ఉగ్రవాద శక్తులను పెంచి పోషిస్తున్న దేశం. మనకంటే ఒక్కరోజు ముందే స్వాతంత్య్రం సాధించింది. నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక రూపంలో భారత్‌పై తన కుటిల బుద్ధిని వెళ్లగక్కుతూనే ఉంది. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ, వారి సహకారం తో వేలాది అమాయక భారతీయులను పొట్టన పెట్టుకుంది. మతం, స్వాతంత్య్రం అని భ్రమ కల్పించి కశ్మీర్‌లో స్థానిక యువతను ఉగ్రవాదులుగా తయారుచేస్తోంది. ప్రశాంత వాతావరణంలో నిరంతరం అల్లర్లు సృష్టించి దేవతల భూమి కశ్మీర్‌ను రణభూమిగా మార్చింది. కశ్మీర్‌లో ఉగ్రకార్యకలాపాలకు మద్దతు తెలుపుతూ దేశంలో ఏదో ఓ చోట బాంబు దాడులు, యాత్రికులపై కాల్పులకు తెగబడుతోంది. పహల్గాంలో అమాయకులను చంపించింది.’ అని పాకిస్థాన్‌తో జరిగిన నాటి యుద్ధాల్లో పాల్గొన్న నగరానికి చెందిన మాజీ సైనికులు తెలిపారు. ఆనాటి యుద్ధ విశేషాలను పంచుకోవడంతో పాటు పాక్ దుర్భుద్ధిని ఎండగట్టారు. ఉగ్రవాదులకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం పై వారు మండిపడ్డారు. - (ఆంధ్రజ్యోతి-విజయవాడ)
మతోన్మాదం, ఉగ్రవాదాన్ని తలకెత్తించుకున్న దుర్మార్గపు దేశం
పాక్‌తో యుద్ధాల్లో మేము తెలుసుకున్నది ఇదే
నాటి యుద్ధాలు ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతున్నాయ్
ఆ రోజుల్లో ఇంత సాంకేతికత లేకపోయినా పాకిస్థాన్ పీచమణిచాం: నగరానికి చెందిన మాజీ సైనికులు
అప్పట్లో సాధారణ తుపాకులు, ల్యాండ్‌మైన్లతోనే యుద్ధం
అప్పట్లో తుపాకులు, ల్యాండ్ మైన్, సాధారణ బాంబులతోనే యుద్ధం చేసేవాళ్లం. 1971 బంగ్లాదేశ్ వేర్పాటు సమయంలో కశ్మీర్ నుంచి వాహనాల్లో ఆయుధాలను తీసుకెళ్లేవాళ్లం. అధిక మొత్తంలో పేలుడు పదార్థాలను తీసుకెళ్లాలంటే పగటిపూటే రవా ణా చేసేవాళ్లం. తుపాకులు, తక్కువ మోతాదులో పేలుడు పదార్థాలను కొండ పై ప్రాంతాలకు తీసుకెళ్లాలంటే రాత్రి సమయంలో, తక్కువ వెలుతురులో, ఇద్దరు సిపాయిలు ముందు నడుస్తుంటే వారిననుసరిస్తూ వాహనాల లైట్లను ఆర్పేసి తీసుకెళ్లేవాళ్లం. ఉగ్రవాదులు పేరుతో భారత్‌పైకి పాక్ సైన్యం కవ్వింపులకు దిగడం ఇది మొదటిసారి కాదు. సంయమనం చూపి న ప్రతిసారి దేశాన్ని చిన్నచూపు చూసేది. అప్పట్లో సైన్యం వాగు, చిన్న నదిని దాటాలంటే యుద్ధ ప్రాతిపదికన సైనికులే బ్రిడ్జిని నిర్మించి, తొలగించేవాళ్లం. ఇప్పుడంతా మిషనరీలతో క్షణాల్లో పూర్తయిపోతోంది. ఈసారి పాకిస్థాన్‌తో యుద్ధం అనివార్యమైంది. అయితే భారత సైనికులు ప్రజల జోలికి పోకుండా ఉగ్రవాదులను అంతంచేయాలి. ఇప్పుడున్న సాంకేతికత, అత్యాధునిక ఆయుధాలతో పాకిస్థాన్‌ను ఐదు రోజుల్లో ఓడించే సత్తా భారత సైన్యానికి ఉంది. కచ్చితంగా తొందర్లోనే భారతసైన్యం యుద్ధాన్ని ముగిస్తుంది.
- మాతంగి పరమానందం, ఇంజినీరింగ్ విభాగం డ్రైవర్, మద్రాసు రెజిమెంట్
ఇప్పుడు యుద్ధానికి రమ్మని పిలిచినా సిద్ధమే
ఈ క్షణంలో యుద్ధానికి రమ్మని రక్షణశాఖ ఆహ్వానించినా సిద్ధంగా ఉన్నా. దేశానికి సేవ చేయడానికి ప్రతిక్షణం అందుబాటులో ఉంటా. ఉద్యోగం చేస్తున్నప్పుడు కుటుంబం గురించి ఆలోచించడం, వారికి ఉత్తరాలు రాయడం జరుగుతుంది. కానీ యుద్ధం జరుగుతున్నప్పుడు మాత్రం కుటుంబ సభ్యులు, సొంత ఊరు ఏవీ గుర్తుకురావు. యుద్ధం చేస్తున్నంతసేపు రెండో ఆలోచన ఉండదు. యుద్ధం జరుగుతున్న సమయంలో భయపడి వెనక్కి తిరిగి వచ్చే ఆలోచన ఎవరికైనా ఉంటే వారి వెనుక సిద్ధంగా ఉన్న సైన్యాన్ని చూసి ఆ ఆలోచనను ఉపసంహరించుకోవాల్సిందే. ఎందుకంటే ముందు కదులుతున్న సైన్యానికి వెనుక ఇంకో బ్యాచ్ సిద్ధంగా ఉంటుంది. 1971 బంగ్లా విమోచన యుద్ధంలో మిషైల్ ఆపరేటర్‌గా పనిచేశాను. అధికారులు ఎలాంటి పరిస్థితుల్లో చెప్పినా కేవలం ఐదు నిమిషాల్లోనే లోడింగ్ చేయాలి. చేయకపోతే అధికారులు కఠినంగా వ్యవహరించేవారు. చండీఘర్ నుంచి ఆదంపూర్, అక్కడి నుంచి షంషెడ్‌లో కూడా పనిచేశాను. ఆ యుద్ధ సమయంలో కశ్మీర్‌లోని ఓ ప్రాంతంలో విధుల్లో ఉన్నప్పుడు మా స్థావరానికి, పక్కనే ఉన్న గ్రామానికి మధ్యలో పాక్ ఎయిర్‌ఫోర్స్ బాంబు వేసింది. అదృష్టవశాత్తు గ్రామప్రజలకు, మాలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం భారత ఎయిర్స్‌ఫోర్స్ వ్యవస్థలో అత్యాధునిక యుద్ధ విమానాలు, మిషైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్రా న్స్ నుంచి కొనుగోలు చేసిన రఫెల్ యుద్ధ విమానాలు ఆధునికమైనవి. మన మిత్రదేశమైన రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 క్షిపణి నిర్వీర్య వ్యవస్థ పాకిస్థాన్ దగ్గర లేదు. పాక్‌ను ఓడించడం పెద్ద విషయమేమీ కాదు. కానీ పాక్ ప్రజల గురించి ఆలోచించి భారత సైన్యం ఆచితూచి పోరాడుతోంది. దీనిని ఆ దేశ సైన్యం అలుసుగా తీసుకుని భారత జనావాసాల్లో కూడా బాంబు దాడులు చేస్తోంది. పహల్గాం దాడి నేపథ్యం లో ఇప్పుడు మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే. భారత సైన్యం యుద్ధం చేస్తున్నది అక్కడి ప్రజలపై కాదు. ఉగ్రవాదులపై మాత్రమే.
- శీలం వెంకటేశ్వరరావు, ఎయిర్‌మెన్, పోరంకి
ఇప్పుడున్న టెక్నాలజీతో పాక్‌ను చిత్తు చేయడం సులభమే..
1965, 71లో పాకిస్థాన్‌తో జరిగిన రెండు యుద్ధాల్లో పాల్గొన్నా. 1965లో మా రెజిమెంట్(కోర్ ఆఫ్ సిగ్నల్ రెజిమెంట్) ఢిల్లీలో ఉండేది. డివిజన్ 19లో బ్రిగేడ్- 104లో సిగ్నల్స్ విభాగంలో విధులు నిర్వర్తించా. ఎక్కువగా వాహనాల్లో ఆయుధ సామగ్రిని సైనికులకు చేరవేసేవాడిని. పాక్‌తో భారత్ నేరుగా చేసిన యుద్ధంలో కంటే 1971 బంగ్లా విమోచన సమయంలో జరిగిన యుద్ధంలో ఆయుధాలు సరఫరా చేయడానికి కష్టపడాల్సి వచ్చేది. ఎందుకంటే తూర్పు, పశ్చిమ పాకిస్థాన్ రెండు వైపులా సైనికులు పోరాడాల్సి వచ్చింది. సాధారణంగా యుద్ధం అంటే దేశానికి ఒక వైపే పోరాడాల్సిన సందర్భాలు ఉంటాయి. కానీ పాకిస్థాన్ నుంచి బంగ్లా విడిపోక ముందు భారత్‌కు రెండువైపులా పాక్ హద్దులు పంచుకుంది. దీంతో సైనికులకు రెండు వైపులా తుపాకులు, ల్యాండ్‌మైన్ లాంటి ఆయుధాలు చేరవేయడానికి వాహనాలు, డ్రైవర్లు సరిపోయేంతగా లేక ఇబ్బంది పడేవాళ్లం. అయితే యుద్ధం అనుకున్నంత ఎక్కువ కాలం సాగలేదు. పదమూడు రోజుల్లోనే ముగిసిపోవడంతో పెద్దకష్టమనించలేదు. ప్రస్తుతం భారత రక్షణ రంగం ప్రపంచదేశాలతో పోటీపడుతోంది. అమ్ముల పొదిలో అత్యాధునిక ఆయుధాలు చేరాయి. నాటి కంటే ఎయిర్‌ఫోర్స్, నేవీ మరింత బలంగా మారాయి. ఆర్మీకి అత్యాధునిక తుపాకీలు, సోల్డర్ మిసైల్స్ మరింత బలాన్నిచ్చాయి. భారత్ సంయమనం పాటించకుండా పాక్‌పై విరుచుకుపడితే రెండు రోజుల్లోనే ఆ దేశాన్ని మన దేశంలో విలీనం చేయొచ్చు. ఉగ్రవాదులను తయారుచేయడం పాక్‌కు కొత్తేమీ కాదు. ఉగ్రవాదులపై చేసిన ఖర్చు దేశాభివృద్ధికి పెడితే ఇప్పటికే అభివృద్ధి అయ్యేది. కానీ మనదేశం మీద అక్కసుతో ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటోంది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడులకు భారత్ సరైన సమాధానం చెబుతోంది. పాక్‌ను చిత్తు చేసి పీవోకేను దేశంలో విలీనం చేసి పాక్‌వైపు ఉన్న దేశ సరిహద్దులను మరింత పటిష్టం చేస్తే మన దేశంలోకి ఉగ్రవాదులు వచ్చే అవకాశమే ఉండదు.
- ఐ.వెంకటేశ్వర్లు, సిపాయి, డ్రైవర్