తహసీల్దార్ల కోసం తహతహ
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:22 AM
రెవెన్యూ శాఖను తహసీల్దార్ల కొరత పీడిస్తోంది. సీనియారిటీ కలిగిన వారికి కనీసం అడ్‌హక్ ప్రమోషన్లు కల్పించటంలో కృష్ణాజిల్లా యంత్రాంగం అంతులేని తాత్సారం చే స్తోంది. దీంతో తహసీల్దార్ల కొరత ఏర్పడి జూనియర్ డిప్యూటీ తహసీల్దార్లు ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నారు. డీటీలుగా తమ పనిని సక్రమంగా చేయలేక, తహసీల్దార్లుగా, అడ్మినిస్ర్టేటివ్ అధికారులుగా బండెడు పనిచేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు నిర్ణీత సమయంలో పనులు జరగని దుస్థితి కూడా ఏర్పడుతోంది.
తహసీల్దార్ ఆఫీసులు, ఆర్‌డీవో కార్యాలయాలు, కలెక్టరేట్ సెక్షన్లలో..
జూనియర్ డీటీలకు ఇన్‌చార్జులుగా అదనపు బాధ్యతలు
రెగ్యులర్ డీటీలు, 2018 పీడీటీ మధ్య సీనియారిటీ వివాదం
న్యాయస్థానంలో కేసులు.. ఇప్పటికీ పరిష్కారం కాక అవస్థలు
మిగిలిన జిల్లాల్లో అడ్‌హక్ పదోన్నతులతో కొంచెం బెటర్
రెగ్యులర్ తహసీల్దార్లు లేక ప్రజలకు ఇబ్బందులు
(ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం/ విజయవాడ) : ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తం 20 మంది తహసీల్దార్ల కొరత ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట, వత్సవాయి, ఏ.కొండూరు, మైలవరం కార్యాలయాల్లో రెగ్యులర్ తహసీల్దార్లు లేరు. వీరి స్థానంలో జూనియర్ డీటీలు ఇన్‌చార్జులుగా ఉన్నారు. తిరువూరు, నందిగామ ఆర్డీవో కార్యాలయాల్లో ఇద్దరు అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్ల (ఏవో) పోస్టుల్లో రెగ్యులర్ తహసీల్దార్లు లేరు. ఎన్టీఆర్ కలెక్టరేట్‌లో రెండు సెక్షన్ల పరిధిలో రెగ్యులర్ తహసీల్దార్లు లేరు. ఇన్‌చార్జులే ఉన్నారు. విజయవాడ సబ్ కలెక్టరేట్‌లో మరో అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్ (ఏవో) పోస్టులో రెగ్యులర్ తహసీల్దార్ లేకపోవడంతో ఇన్‌చార్జే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న నూజివీడు ఆర్‌డీవో కార్యాలయంలో అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్ స్థానంలో రెగ్యులర్ తహసీల్దార్ లేరు. మండవల్లి, కైకలూరు మండలాలకు కూడా రెగ్యులర్ తహసీల్దార్లు లేరు. కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు, బంటుమిల్లి, పెడన, కృత్తివెన్ను మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో మూడు సెక్షన్లలో రెగ్యులర్ తహసీల్దార్లు లేరు.
పదోన్నతులకు అడ్డంకి
తహసీల్దార్ల పదోన్నతులకు రెగ్యులర్ డీటీలు, 2018 ప్రొబెషనరీ డీటీల మధ్య తలెత్తిన సీనియారిటీ వివాదమే ప్రధాన అవరోధంగా ఉంది. సీనియారిటీపై ఉభయ పక్షాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. న్యాయస్థానం ఆ కేసుపై స్టే ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి తహసీల్దార్ పదోన్నతులకు ఇబ్బందిగా మారింది. ఈ కేసు తేలితే తప్ప సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు.
జాప్యంతో ఇబ్బందులు
అడ్‌హక్ పదోన్నతులు కల్పించటంలో జరుగుతున్న అంతులేని జాప్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ తహసీల్దార్ల స్థానంలో డీటీలు ఇన్‌చార్జులుగా ఉండటం వల్ల రెండు పనులూ వారే చేయాల్సి వస్తోంది. డీటీలు పనిమీద బయటకు వెళ్లాల్సి వస్తే తహసీల్దార్లుగా ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ప్రజలు పనులు కాక ఇబ్బందులు పడుతున్నారు. పదేపదే రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
అడ్‌హక్ బదిలీలకు అంతులేని తాత్సారం
అన్ని జిల్లాల్లోని రెవెన్యూ కార్యాలయాల్లో తహసీల్దార్ల కొరతను దృష్టిలో ఉంచుకుని అడ్‌హక్ పదోన్నతులు కల్పిస్తున్నారు. పొరుగున ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలోని ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం తదితర జిల్లాల పరిధిలో అడ్‌హక్ పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతుల కారణంగా సీనియారిటీ కలిగిన డిప్యూటీ తహసీల్దార్లను తహసీల్దార్లుగా తాత్కాలికంగా పదోన్నతి కల్పించారు. దీంతో రెగ్యులర్ తహసీల్దార్ల ఇబ్బందులు తొలగిపోయాయి. తహసీల్దార్లుగా తాత్కాలికంగా వారికి పదోన్నతులు కల్పించినా డిప్యూటీ తహసీల్దార్ల వేతనాలనే వారు తీసుకుంటారు. రెగ్యులర్ తహసీల్దార్లుగా వ్యవహరిస్తుంటారు.