శిథిల శాతవాహన
ABN , Publish Date - Jun 07 , 2025 | 01:14 AM
దశాబ్దాల చరిత్ర కలిగిన విద్యాశిఖరం నేలకొరిగింది. వేలమందికి విద్యాబుద్ధులు నేర్పిన సరస్వతీ నిలయం శిథిలమైపోయింది. విశాలాంధ్ర రోడ్డులోని శాతవాహన జూనియర్, డిగ్రీ కళాశాల గురువారం అర్ధరాత్రి నేలమట్టమైంది. ఈ భూమికి సంబంధించి కొద్దిరోజులుగా రకరకాలుగా మలుపులు తిరుగుతున్న పరిణామాలు చివరికి విద్యాలయాన్ని కూల్చే దుస్థితికి చేర్చాయి. ఇన్నాళ్లూ తమకు చదువుచెప్పిన కళాశాల కళ్లెదుటే ధ్వంసం కావడంతో విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ ధ్రువీకరణ పత్రాలు ఏ శిథిలాల కింద పడిపోయాయోనని వెతుకుతున్నారు.
దశాబ్దాల నాటి సరస్వతీ నిలయం నేలమట్టం.. భూవివాదాలే కారణం
ఇప్పటికే ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ వివాదం
కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని గురువారం అర్ధరాత్రి కూల్చివేతలు
ల్యాబ్‌లో రసాయనాల ధ్వంసం
కేసు నమోదుచేసిన పోలీసులు
కన్నీరుపెట్టుకుంటున్న విద్యార్థులు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : 1969లో విజయవాడలో క్రిస్టియన్ మిషనరీ విద్యాసంస్థలు మాత్రమే ఉండేవి. హిందూ విద్యార్థులు చదువుకోవడానికి ఒక విద్యాసంస్థను ఏర్పాటు చేయాలని పలువురు ప్రముఖులు నిర్ణయించుకున్నారు. ఓ సొసైటీ ఆధ్వర్యంలో కళాశాల నడిపితే బాగుంటుందని భావించారు. ఇందులో భాగంగా దుర్గామల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీని ఏర్పాటుచేసి 105/1969తో రిజిసే్ట్రషన్ చేయించారు. 1971వ సంవత్సరంలో శాతవాహన పేరుతో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. కాలక్రమంలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో డిగ్రీ స్థాయి కళాశాల హోదా కల్పించారు. కళాశాలను ప్రారంభించిన తొలిరోజుల్లో సత్యనారాయణపురంలోని రామకోటి (ప్రస్తుత శివరామకృష్ణ క్షేత్రం) వద్ద ఓ ప్రైవేట్ భవనంలో నిర్వహించేవారు. ఏటా విద్యార్థుల సంఖ్య పెరగడంతో ప్రత్యేకంగా భూమి కొనాలని భావించారు. బోయపాటి అప్పారావు అనే వ్యక్తి నుంచి సొసైటీ 2.95 ఎకరాలు కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి సొసైటీ ప్రతినిధులు, అప్పారావు అగ్రిమెంట్ రాసుకున్నారు. దీనిపై రిజిసే్ట్రషన్ మాత్రం జరగలేదని సొసైటీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో పట్టణ భూపరిమితి చట్టాన్ని అమలు చేయడంతో అప్పారావు సోదరి విజయలక్ష్మి 1.50 ఎకరాల భూమిని సొసైటీకి ఇచ్చారు. కోనేరు లక్ష్మయ్య, ముమ్మనేని సుబ్బారావు, తెన్నేటి భాస్కరరావు, టీవీఎస్ శర్మ వంటివారు ఈ సొసైటీకి కార్యదర్శులుగా, కళాశాలకు కరస్పాండెంట్లుగా పనిచేశారు. గుండవరపు ప్రజాపతిరావు సొసైటీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. కొన్నాళ్లు కరస్పాండెంట్, కార్యదర్శిగా వ్యవహరించారు. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చాక భూపరిమితి చట్టాన్ని రద్దు చేశారు. దీంతో బోయపాటి కుటుంబానికి.. గతంలో విక్రయించి, రిజిసే్ట్రషన్ కాని భూమిపై ఆశ పెరిగింది. కొంతకాలం గడిచాక అప్పారావు కుమారుడు శ్రీనివాస అప్పారావు.. తన ప్రమేయం లేకుండా తాత ఆస్తిని తండ్రి విక్రయించాడని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అగ్రిమెంట్ చేసుకున్న భూమికి రిజిసే్ట్రషన్ చేయడం లేదని దుర్గామల్లేశ్వర సొసైటీ జిల్లాకోర్టును ఆశ్రయించింది. ఈ భూమిని సొసైటీ రిజిస్టర్ చేయాలని జిల్లాకోర్టు తీర్పును ఇవ్వడంతో బోయపాటి శ్రీకృష్ణ అప్పారావు హైకోర్టును ఆశ్రయించారు.
2009లో మరో మలుపు
ప్రజాపతిరావు కరస్పాండెంట్‌గా ఉన్న సమయంలో 2009లో అమెరికాలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లారు. తర్వాత ఆయన కుమార్తె చనిపోయింది. తాను తిరిగి వచ్చే వరకు కార్యదర్శి, కరస్పాండెంట్ బాధ్యతలను వంకాయలపాటి కామేశ్వరరావుకు అప్పగించారు. అప్పటికే ఆయన కుమారుడు వంకాయలపాటి శ్రీనివాస్ ఈ కళాశాలలో హిందీ అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. కార్యదర్శి, కరస్పాండెంట్ సీటులో కామేశ్వరరావు కూర్చున్నా మొత్తం వ్యవహారాలను శ్రీనివాస్ చక్కబెట్టేవారు. ఈయనే కళాశాలకు ప్రస్తుతం ప్రిన్సిపాల్ హోదాలో ఉన్నారు. ప్రజాపతిరావు అమెరికా నుంచి రావడానికి ముందు అప్పటికి మంత్రిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు సొసైటీలో స్థానం కల్పించారు. ఆయన్ను కార్యదర్శిగా ప్రకటించారు. ప్రజాపతిరావు ఇక్కడికి వచ్చాక ఆయనకు పదవులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి దాడి చేశారు. దీనిపై ఆయన స్టాంప్స్ అండ్ రిజిసే్ట్రషన్‌కు ఫిర్యాదు చేశారు. మొత్తం రికార్డులను పరిశీలించిన ఆ శాఖ ఈ విషయాన్ని జిల్లాకోర్టులో తేల్చుకోవాలని సూచించింది.
‘అదాలత’లో అవునని...
రిజిసే్ట్రషన్ చేయడం లేదని సొసైటీ దాఖలు చేసిన పిటిషన్‌లో వంకాయలపాటి కామేశ్వరరావు, బోయపాటి శ్రీనివాస అప్పారావు జిల్లాకోర్టులో నిర్వహించిన లోక్ అదాలతలో రాజీ పడ్డారు. కానీ, ఆ ఒప్పందం రాజీ తర్వాత అమలు చేయలేదు. దీంతో కామేశ్వరరావు 2011 ఆగస్టులో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను సొసైటీలోకి, శాతవాహనలోకి ఆహ్వానించారు. శ్రీనివాస అప్పారావుకు వ్యతిరేకంగా కామేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో ఆలపాటి ఇంప్లీడ్ అయ్యారు. హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో బోయపాటి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కామేశ్వరరావు, ప్రజాపతిరావు, సొసైటీ రెస్పాండెంట్లుగా ఉన్నారు. కామేశ్వరరావు, ప్రజాపతిరావు పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు కోర్టుకు తెలిపారని బోయపాటి న్యాయవాది చెబుతున్నారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కోర్టుకు ఇచ్చారని ప్రజాపతిరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో అక్రమంగా శాతవాహన ప్రాంగణంలోకి ప్రవేశించి కూల్చివేతలు చేశారని ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కూల్చివేతలు చేయడానికి బోయపాటి, ధూళిపూడి శ్రీకాంత గురువారం రాత్రి వెళ్లారు. పోలీసులు వారిని హెచ్చరించి పంపేశారు. అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు నటించి అర్ధరాత్రి కూల్చివేశారు. దీనిపై శ్రీనివాస అప్పారావు, శ్రీకాంతతో పాటు వంకాయలపాటి శ్రీనివాస్, నిడుమోలు రమాసత్యనారాయణపై కేసులు నమోదు చేశారు. భవనాలను కూల్చివేయాలని సంతకాలు చేసినందుకు శ్రీనివాస్, రమాసత్యనారాయణపై కేసులు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. తాము ఆవిధంగా సంతకాలు చేయలేదని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ అందిందని సంతకాలు చేశామని వారు చెబుతున్నారు.