Share News

ధాన్యం కొనరు.. దారి చూపరు..!

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:54 AM

ఓవైపు లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉంది, మరోవైపు ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెలాఖరుకు ముగుస్తుంది.. ఈ నేపథ్యంలో కొనుగోలు ప్రక్రియలో అధికారుల జాప్యానికి రైతులు బలైపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను మిల్లుల్లో విక్రయించుకునే అవకాశం లేకపోగా, మద్దతు ధర తగ్గించి మిల్లు యజమానులు, వ్యాపారులు పెడుతున్న ఆంక్షలకు తలొగ్గి రైతులు విక్రయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

ధాన్యం కొనరు.. దారి చూపరు..!
కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యం

జిల్లాలో ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం

నామమాత్రపు అనుమతులతో సరిపెడుతున్న అధికారులు

ఇంకా కొనాల్సిన ధాన్యం 3.70 లక్షల టన్నులు

రెండు రోజుల క్రితం అనుమతిచ్చింది 30 వేల టన్నులకే..

ఈ నెలాఖరుతో ముగియనున్న ఖరీఫ్‌ కొనుగోలు ప్రక్రియ

మిగిలిన ధాన్యం కొనేదెప్పుడోనని రైతుల్లో ఆందోళన

రైతుల కష్టాన్ని దోచుకుతింటున్న ప్రైవేట్‌ వ్యాపారులు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. రైతుల వద్ద ధాన్యం ఉన్నప్పటికీ కొనేందుకు అనుమతులు ఇవ్వకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు జాప్యం చేస్తున్నారు. నామమాత్రంగానే అనుమతులు ఇస్తూ రైతుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా జిల్లా అధికారులు కాలక్షేపం చేస్తుండటంతో తమ వద్ద ఉన్న ధాన్యాన్ని ఎలా విక్రయించుకోవాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నెలాఖరు నాటికి ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిలిచిపోతుంది. రబీలో వరిసాగుకు అనుమతులు లేకపోవడంతో ప్రభుత్వం కొనుగోలుకు అనుమతులు ఇవ్వదు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ఎంతమేర కొంటారో, అసలు కొనరో తెలియని సందిగ్ధం ఏర్పడింది. జిల్లాలోని రైస్‌ మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై ధాన్యం కొనుగోలును నిలిపివేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇంకా కొనాల్సిన ధాన్యం 3.70 లక్షల టన్నులు

జిల్లాలో 302 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొంటున్నట్లు అధికారులు నేటికీ కాగితాలపై లెక్కలు చూపుతున్నారు. అయితే, మిల్లులకు ఇచ్చిన టార్గెట్లు పూర్తయ్యాయనే కారణం చూపి రెండు నెలలుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిలిపివేశారు. ఫిబ్రవరిలో 30 వేల టన్నుల ధాన్యం కొనుగోలుకు అనుమతులు ఇచ్చారు. ఇందులో అధికశాతం ధాన్యాన్ని డ్రయ్యర్‌ సౌకర్యం ఉన్న మిల్లులకు సర్దుబాటు చేసి అధికారులు చేతులు దులుపుకొన్నారు. ఈనెల 10వ తేదీన మరో 30 వేల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ ధాన్యాన్ని ఆయా మిల్లులకు సర్దుబాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం మినుముతీత పనులు జరుగుతుండగా, కుప్పనూర్పిళ్లూ చేస్తున్నారు. కాగా, రైతులు ధాన్యం శాంపిళ్ల్లను రైతుసేవా కేంద్రాలకు తీసుకెళ్తే.. ఆన్‌లైన్‌ ప్రక్రియ నిలిచిపోయిందని, అనుమతులు రాలేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా రైస్‌మిల్లులకు ధాన్యం విక్రయించుకోవాలని సూచిస్తున్నారు. కుప్పనూర్పిళ్ల అనంతరం విక్రయించాల్సిన ధాన్యం రైతుల వద్ద 3.70 లక్షల టన్నులు ఉంది. ఈ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా, లేదా అనే అనుమాలు కూడా ఉన్నాయి. ఇటీవల అనుమతులు ఇచ్చిన 30 వేల టన్నుల ధాన్యాన్ని అవసరం ఉన్న ప్రాంతాల్లోని మిల్లులకు కాకుండా ఎమ్మెల్యేలు, రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ నాయకులు, పౌరసరఫరాల శాఖ అధికారులను ప్రసన్నం చేసుకున్న మిల్లర్లకే టార్గెట్‌లుగా ఇచ్చి సరిపెడతారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

ప్రైవేట్‌ వ్యాపారులతో అవస్థలు

జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొని, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం 75 కిలోల బస్తాకు రూ.1,725 మద్దతు ధర వస్తుంది. రెండు నెలలుగా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిలిచిపోవడంతో కొనుగోలు కేంద్రాలతో సంబంధం లేకుండా మధ్యవర్తుల ద్వారా మిల్లు యజమానులకు, మండపేటకు చెందిన వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మధ్యవర్తులు, మిల్లర్లు బస్తా ధాన్యానికి అన్ని ఖర్చులు పోను రూ.1,500-రూ.1,600 మించి ఇవ్వలేమని చెబుతున్నారు. నగదు కూడా అప్పటికప్పుడు ఇవ్వలేమని, 15 నుంచి 20 రోజుల సమయం కావాలని వ్యాపారులు ఆంక్షలు విధిస్తుండటంతో రైతుల్లో ఆందోళనల నెలకొంటోంది. ప్రైవేటుగా ధాన్యం విక్రయిస్తే మద్దతు ధర రాకపోగా, నగదు చేతికి సకాలంలో అందని దుస్థితి ఏర్పడుతోందని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వ్యాపారులెవరైనా మోసం చేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ధాన్యానికి పూర్తిస్థాయిలో మద్దత ధర లభించకపోవడంతో ఎకరాకు 30 బస్తాల దిగుబడి వస్తే, మద్దతు ధర రూపంలో రూ.6వేలకు పైగా నష్టపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రైతుల వద్ద ఉన్న 3.70 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం సకాలంలో అనుమతులు ఇస్తుందా లేదా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ధాన్యం కొనుగోలుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Mar 13 , 2025 | 12:54 AM