Share News

మత బోధకుడి మాయ

ABN , Publish Date - May 15 , 2025 | 01:09 AM

ఆయనో మత బోధకుడు. ఎంతోమందికి పరిశుద్ధ వాక్యాలు బోధిస్తాడు. కానీ తప్పు మీద తప్పుచేసి దొంగలా దొరికాడు. చివరికి బ్యాంకు జప్తు చేసిన తన భవనంలోకి అర్ధరాత్రి అక్రమంగా ప్రవేశించాడు. కేసులు నమోదయ్యే సరికి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

మత బోధకుడి మాయ
అర్ధరాత్రి జిమ్‌ నుంచి బయటకు వస్తున్న ప్రదీప్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు

బ్యాంకు రుణంతో జిమ్‌ ఏర్పాటు

రుణం చెల్లించకపోవడంతో జప్తు ప్రకటన

అయినా ఆఫర్లు ప్రకటించి డబ్బు వసూలు

జప్తు భవనంలోకి అర్ధరాత్రి అక్రమ ప్రవేశం

జిమ్‌ బాధితులపై దాడులు

కేసుల నమోదు.. పరారీలో పాస్టర్‌ దంపతులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరానికి చెందిన పాలిశెట్టి ప్రదీప్‌కుమార్‌ మొగల్రాజపురంలో చర్చి నడుపుతున్నాడు. డీవీ మనార్‌ రోడ్డులో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని అందులో అధునాతన సదుపాయాలతో స్నాప్‌ జిమ్‌ను ఏర్పాటు చేయాలని భావించాడు. దీని నిమిత్తం భార్య జెన్నీ అభిలాషితతో కలిసి ఎస్‌బీఐ నుంచి కొన్ని నెలల క్రితం రూ.6 కోట్ల రుణం తీసుకున్నాడు. దీనికి హామీగా రెండు ఆస్తులను బ్యాంక్‌ వద్ద తనఖా పెట్టాడు. వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంకు జప్తు ప్రకటన జారీ చేసింది. దీంతో పాస్టర్‌లో ఉన్న నేరకోణం బయటకొచ్చింది. జిమ్‌ ఏర్పాటుచేసిన భవనంలో ఎక్కువ భాగాన్ని ది స్నాప్‌ జిమ్‌ పేరుతో వేరు చేశాడు. స్నేహితుడు నిమ్మల కృష్ణకుమార్‌ అలియాస్‌ క్రిష్‌, గ్లోరీ పేట్ల, పచ్చిగళ్ల హెప్సిబాను బినామీలుగా పెట్టాడు. ప్రకటన జారీచేసినా ప్రదీప్‌కుమార్‌ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో బ్యాంకు రికవరీ విభాగం సిబ్బంది జిమ్‌ను జప్తు చేయడానికి వెళ్లారు. అప్పటికే జిమ్‌లో ఎక్కువ భాగాన్ని బినామీ పేర్లపై, తక్కువ భాగాన్ని అసలు స్నాప్‌ జిమ్‌గా విభజించాడు. అదిచూసి బ్యాంకు రికవరీ విభాగం సిబ్బంది షాక్‌ అయ్యారు. అప్పటికే తక్కువ భాగంలో ఉన్న జిమ్‌ను జప్తు చేశారు. తర్వాత వారు కోర్టును ఆశ్రయించి బినామీ పేర్లతో సృష్టించిన ది స్నాప్‌ను స్వాధీనం చేసుకోవడానికి ఉత్తర్వులు పొందారు. కొద్దిరోజుల క్రితం రికవరీ సిబ్బంది ఈ జిమ్‌ను స్వాధీనం చేసుకోవడానికి రావడంతో ప్రదీప్‌, క్రిష్‌ కలిసి ఇంటి నెంబరును మార్చేశారు. దీన్ని ఒక కారణంగా చూపించి వేర్వేరు ఇంటి నెంబర్లున్న జిమ్‌ను ఎలా స్వాధీనం చేసుకుంటారని రికవరీ సిబ్బందిపై వివాదానికి దిగి, దాడి చేశారు. దీనిపై వారు ఫిర్యాదు చేయడంతో మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు.

జప్తు తప్పదని తెలిసి..

ఓపక్క తీసుకున్న రుణం చెల్లించలేదు. మరోపక్క బ్యాంకు జప్తు ప్రకటన చేసింది. అయినా రకరకాల ఆఫర్ల పేర్లతో కస్టమర్లను మోసం చేశాడు. ఈస్టర్‌ బ్లాస్ట్‌, హోలీ బ్లాస్ట్‌, ఉగాది ఫీస్ట్‌ వంటి ఆఫర్లను ప్రకటించి ఫీజులో 40-50 శాతం మినహాయింపు ఇచ్చాడు. ఈవిధంగా సుమారు 250 మందికి పైగా ఒక్కొక్కరి నుంచి రూ.17 వేల నుంచి రూ.20 వేల వరకు ఏడాది ఫీజుగా వసూలు చేశాడు. జప్తు చేసిన విషయం బయట పడకుండా గేటుకు ‘ఈరోజు జిమ్‌కు సెలవు’ అని బోర్డు తగిలించేవాడు. ఫీజులు చెల్లించిన కస్టమర్లంతా వ్యాయామం కోసం వచ్చి ఈ బోర్డు చూసి వెనుదిరిగేవారు. కారణాలు అడిగిన వారికి లోపల నీళ్ల సమస్య ఉందని, ఏసీ పనిచేయడం లేదని, టాయిలెట్‌ పూడుకుపోయిందని చెప్పేవాడు. ఎన్నిరోజులైనా ఇవే కారణాలు చెబుతుండటంతో ఫీజులు చెల్లించిన వారంతా మోసపోయామని భావించారు. వారంతా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు. బాధితులంతా ఒక వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేసుకుని న్యాయం కోసం పోరాడారు. ప్రదీప్‌ భార్య అభిలాషిత గురించి గ్రూపులో అసభ్యకరంగా మాట్లాడిన ఓ బాధితుడికి డబ్బులిస్తామని చెప్పి నిర్మలా కాన్వెంట్‌ సెంటర్‌కు పిలిపించుకుని దాడి చేశాడు.

అర్ధరాత్రి చోరీకి యత్నం

బ్యాంకు రికవరీ విభాగం సిబ్బంది జిమ్‌లను జప్తు చేశాక ఆ భవనానికి తాళాలు వేశారు. సెక్యూరిటీ గార్డులను నియమించారు. జప్తు చేసే సమయానికి లోపల ఉన్న సామాగ్రి లెక్కలు రాసుకున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రదీప్‌కుమార్‌, కృష్ణకుమార్‌ అర్ధరాత్రి ఆ భవనం వద్దకు వెళ్లారు. ఆయుధాలతో కొట్టి చంపేస్తామని సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించారు. తర్వాత జనరేటర్‌ రూమ్‌ పగలగొట్టి అక్రమంగా లోపలకు ప్రవేశించారు. అద్దాలు పగలగొట్టి జిమ్‌లోకి వెళ్లి టీవీలు, ఇతర వస్తువులు మాయం చేశారు. ఈ విషయాన్ని సెక్యూరిటీ గార్డులు రికవరీ విభాగానికి తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బీట్‌ పోలీసులు అక్కడికి చేరుకునేసరికి జనరేటర్‌ గదిలో నుంచి ప్రదీప్‌కుమార్‌, కృష్ణకుమార్‌ బయటకు వస్తూ కనిపించారు. వరుసగా ఒక దాని తర్వాత మరో కేసు నమోదు కావడంతో భార్య అభిలాషితతో కలిసి ప్రదీప్‌ పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - May 15 , 2025 | 01:09 AM