Share News

డయేరియాపై సీరియస్‌

ABN , Publish Date - Sep 16 , 2025 | 01:20 AM

నగరంలో డయేరియాపై సీఎం చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. ఇంతవరకు మూల కారణాలు ఎందుకు కనుగొనలేదని మండి పడ్డారు. అమరావతిలోని సచివాలయంలో సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో డయేరియా అంశంపై సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పటికైనా వ్యాధిని నియంత్రణలోకి తీసుకురావాలని సూచించారు. కాగా, గోకులాల ఏర్పాటుపై కలెక్టర్‌ లక్ష్మీశ వివరణపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం ప్రతి జిల్లాలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

డయేరియాపై సీరియస్‌
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబుకు సమస్యలు వివరిస్తున్న కలెక్టర్‌ లక్ష్మీశ

మూలకారణాన్ని కనుగొనటంలో విఫలమయ్యారని సీఎం ఫైర్‌

యుద్ధప్రాతిపదికన నియంత్రించాలని ఆదేశాలు

కలెక్టర్ల సమావేశంలో న్యూఆర్‌ఆర్‌పేట డయేరియాపై చర్చ

జిల్లాలో గోకులాల ఏర్పాటుకు సహకరించాలని కోరిన కలెక్టర్‌

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటుకు హామీ ఇచ్చిన సీఎం

జీడీ డీపీలో ఎన్టీఆర్‌ జిల్లాకు 9, కృష్ణాజిల్లాకు 15వ స్థానం

స్వర్ణాంధ్ర కేపీఐ స్కోర్‌లో ఎన్టీఆర్‌ జిల్లాకు మూడోస్థానం

జిల్లాలు, మండలాలవారీగా స్కోర్ల ప్రకటన

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు ప్రబలటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డయేరియా వ్యాప్తికి ఇప్పటికీ మూలకారణాన్ని కనుగొనలేకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డయేరియా వచ్చి చాలారోజులు అవుతున్నా ఇంకా కేసులు పెరుగుతుండటంపైనా ఆయన మండిపడ్డారు. యుద్ధప్రాతిపదికన మూలకారణాన్ని తెలుసుకుని చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (వీఎంసీ) పరిధిలో జరిగిన ఈ వ్యవహారంపై మున్సిపల్‌ యంత్రాంగ నిర్లిప్తతపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. అమరావతిలోని సచివాలయంలో సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప్రజారోగ్యానికి సంబంధించి చర్చకు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి న్యూరాజరాజేశ్వరిపేట డయేరియా అంశంపై మాట్లాడారు. మున్సిపల్‌ యంత్రాంగాన్ని తట్టిలేపి.. పరిస్థితులు చక్కబడేలా చూడాల్సిందిగా కలెక్టర్‌ లక్ష్మీశను ఆదేశించారు. కాగా, ఎన్టీఆర్‌ జిల్లా వృద్ధికి తీసుకుంటున్న చర్యలను కలెక్టర్‌ లక్ష్మీశ చంద్రబాబుకు వివరించారు. జీడీడీపీ పెంచటానికి, పాడిపరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఎన్టీఆర్‌ జిల్లాలో గోకులాలు (యానిమల్‌ హాస్టల్స్‌) ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. పాడి ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించటంతో పాటు వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. గోకులాలకు ప్రభుత్వం నుంచి తగిన సహకారం కావాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరురు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ప్రతి జిల్లాలో గోకులాల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఉద్యాన పంటలను సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని కలెక్టర్‌ లక్ష్మీశ వివరించారు. కౌలురైతులకు కూడా ఈ అవ కాశాన్ని కల్పించాల్సిందిగా కోరారు. కాగా, సమావేశం అనంతరం కలెక్టర్‌ లక్ష్మీశ.. మున్సిపల్‌ కమిషనర్‌ ధ్యానచంద్రకు ఫోన్‌చేసి డయేరియా వివరాలు కనుక్కున్నారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, డయేరియా మూలాన్ని కనిపెట్టాలని, నివారణా చర్యలు మెరుగుపడాలని ఆదేశించారు.

స్వర్ణాంధ్ర కేపీఐ స్కోర్‌ ఇలా..

స్వర్ణాంధ్ర కీ పర్ఫామెన్స్‌ ఇండికేటర్‌ (కేపీఐ) స్కోర్లను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర-2047లో భాగంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించటంలో ఆయా జిల్లాల పనితీరును అంచనా వేసేందుకు ప్రభుత్వం కేపీఐ స్కోర్‌ను తొలిసారిగా ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోనే ఎన్టీఆర్‌ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. 64 స్కోర్‌తో బీ గ్రేడ్‌ను సాధించింది. కృష్ణాజిల్లా కూడా 61 పాయింట్లతో బీ గ్రేడ్‌ను సాధించింది. మండలాలవారీగా కూడా ముఖ్యమంత్రి కేపీఐ స్కోర్‌ను ప్రకటించారు. ఎన్టీఆర్‌ జిల్లాలో నందిగామ మండలం 82, విజయవాడ పశ్చిమ మండలం 82, విజయవాడ తూర్పు మండలం 80 స్కోర్‌ను సాధించి ఏ గ్రేడ్‌లో నిలిచాయి. కృష్ణాజిల్లాలో గూడూరు మండలం 56 స్కోర్‌తో బీ గ్రేడ్‌లో నిలిచింది. వ్యవసాయానుబంధ రంగాలకు సంబంధించి చూస్తే కృష్ణాజిల్లా 31 కేపీఐ స్కోర్‌తో ఏడో స్థానంలో నిలిచి సీ గ్రేడ్‌ను సాధించగా, ఎన్టీఆర్‌ జిల్లా 30 స్కోర్‌తో 9వ స్థానంలో నిలిచి సీ గ్రేడ్‌ పొందింది.

స్థూల విలువ జోడింపు ఇలా..

వ్యవసాయానుబంధ రంగాల్లో కృష్ణాజిల్లా దుమ్ము దులిపింది. రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన రూ.45,679 కోట్ల (15.21ు) లక్ష్యానికి రూ.8,368 కోట్ల (18.32ు) జీవీఏ సాధించింది. ఎన్టీఆర్‌ జిల్లా 17వ స్థానంలో నిలిచింది. నిర్దేశించిన రూ.12,632 కోట్ల (15.94ు)కు గాను రూ.1,427 కోట్ల (11.29ు) జీవీఏ సాధించింది. మత్స్య రంగంలో కృష్ణాజిల్లాలోని కృత్తివెన్ను మండలం రూ.4,663 కోట్లు, నందివాడ మండలం రూ.3,801 కోట్లు, బంటుమిల్లి రూ.3,106 కోట్లు, నాగాయలంక రూ.2,802 కోట్ల జీవీఏ సాధించాయి. పాడి పరిశ్రమకు సంబంధించి కృష్ణాజిల్లా రూ.6.026 కోట్ల జీవీఏ సాధించింది. పారిశ్రామిక రంగంలో ఎన్టీఆర్‌ జిల్లా 77 స్కోర్‌తో 8వ స్థానంలో నిలిచి ఏ గ్రేడ్‌, కృష్ణాజిల్లా 49 స్కోర్‌తో 23వ స్థానంలో నిలిచి సీ గ్రేడ్‌ను పొందాయి. కృష్ణాజిల్లాకు ఇచ్చిన లక్ష్యంలో భాగంగా మొదటి క్వార్టర్‌లో రూ.3,064 కోట్ల జీవీఏ సాధించి ఆరో స్థానంలోనూ, ఎన్టీఆర్‌ జిల్లా రూ.4,943 కోట్లతో 13వ స్థానంలోనూ నిలిచాయి. సేవారంగంలో కృష్ణాజిల్లా 91 స్కోర్‌తో రెండో స్థానంలో నిలిచి ఏ ప్లస్‌ గ్రేడ్‌ను సాధించగా, ఎన్టీఆర్‌ జిల్లా 90 స్కోర్‌తో ఐదో స్థానంలో నిలిచి ఏ ప్లస్‌ గ్రేడ్‌ను సాధించింది. ఎన్టీఆర్‌ జిల్లా రూ.14,007 కోట్లు, కృష్ణాజిల్లా రూ.6,357 కోట్ల జీవీఏను సాధించాయి.

Updated Date - Sep 16 , 2025 | 01:20 AM