ప్రగతి పథంలో ఉచిత ప్రయాణం
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:07 AM
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఉమ్మడి కృష్ణాజిల్లాలో అధికారులు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్న ఈ పథకానికి నగరంలోని పీఎన్‌బీఎస్ వెంబడి సిటీ బస్‌పోర్టు వేదిక కానుంది. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్ర్తీ శక్తి పథకాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు.
నేటి నుంచే సీ్త్ర శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం
ఉమ్మడి కృష్ణాజిల్లాలో 763 బస్సుల్లో అమలు
ఏడాదికి రూ.360 కోట్ల వరకు ప్రభుత్వంపై భారం
మహిళల ఆక్యుపెన్సీ 30-50 శాతం పెరిగే అవకాశం
మొత్తం ఆక్యుపెన్సీ 60-80కి చేరుతుందని అంచనా
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఉమ్మడి కృష్ణాజిల్లాలో అధికారులు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్న ఈ పథకానికి నగరంలోని పీఎన్‌బీఎస్ వెంబడి సిటీ బస్‌పోర్టు వేదిక కానుంది. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్ర్తీ శక్తి పథకాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు.
763 బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తం 1,191 ఆర్టీసీ బస్సులకు గానూ 763 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తారు. ప్రభుత్వం నిర్దేశించిన పల్లెవెలుగు, ఆల్ర్టా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఈ ఉచిత ప్రయాణం అమలుకానుంది. దూరప్రాంత ప్రయాణాలకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించటంతో మహిళలు విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్, రాయలసీమ ప్రాంతాలకు కూడా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటి వరకు 15 నుంచి 20 శాతం మహిళలే ప్రయాణిస్తారు. ఇకపై ఆ ఆక్యుపెన్సీ 50 శాతం పెరుగుతుందని ఆర్టీసీ అధికారుల అంచనా. కాగా, ఎన్టీఆర్, కృష్ణా రీజియన్లలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ 60 శాతం ఉంది. స్ర్తీ శక్తి పథకంతో 80 శాతానికి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రభుత్వంపై భారం ఇలా..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆర్టీసీ బస్సులు సగటున రోజుకు 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. సగటున రూ.2.10 కోట్ల ఆదాయం వస్తుంది. 50 శాతం మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించటం వల్ల రోజుకు రూ.కోటి మేర ప్రభుత్వం భరించనుంది. నెలకు రూ.30 కోట్లు, ఏడాదికి రూ.360 కోట్ల చొప్పున ప్రభుత్వం మహిళల కోసం ఖర్చు చేయనుంది.
ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 780 బస్సులు ఉన్నాయి. ఇందులో 454 బస్సుల్లో స్ర్తీ శక్తి పథకాన్ని అమలు చేస్తున్నారు. వీటిలో పల్లెవెలుగు 100, ఆల్ర్టా పల్లెవెలుగు 27, సిటీ ఆర్డినరీ 179, మెట్రో ఎక్స్‌ప్రెస్ 100, ఎక్స్‌ప్రెస్ బస్సులు 48లో ఉచిత ప్రయాణం అమల్లో ఉంటుంది.
కృష్ణా జిల్లాలో మొత్తం 411 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. 309 బస్సుల్లో స్ర్తీ శక్తి పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో పల్లెవెలుగు బస్సులు 160, ఆల్ర్టా పల్లెవెలుగు 26, సిటీ ఆర్డినరీ బస్సులు 75, ఎక్స్‌ప్రెస్ 37, మెట్రో ఎక్స్‌ప్రెస్ 11లో ఉచిత పథకాన్ని అమలు చేస్తున్నారు. మహిళల ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయటానికి వీలుగా ఇప్పటికే కండక్టర్లకు శిక్షణ కల్పించారు. టికెట్ ఇష్యూయింగ్ మెషీన్స్ (టిమ్)లో మహిళలకు జీరో ఫేర్ టికెట్ రావటానికి వీలుగా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేశారు. ప్రతి మహిళకు తప్పనిసరిగా టికెట్ ఇస్తారు. ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. బస్సు ఎక్కేముందు ఆధార్ కార్డు లేదా ఓటరు కార్డు, మరేదైనా గుర్తింపు కార్డును చూపించాలి.
ఏర్పాట్ల పరిశీలన
బస్టేషన్ : మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ స్ర్తీశక్తి పథకాన్ని ప్రారంభించేందుకు శుక్రవారం సీఎం చంద్రబాబు పండిట్ నెహ్రూ బస్టాండ్‌లోని సిటీ టెర్మినల్‌కు వస్తున్న దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను గురువారం ఎంపీ కేశినేని శివనాథ్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, నూరుబాషా దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్‌మీరా, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు, విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖర్‌బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహిళల సాధికారిత కోసమే సీఎం చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారన్నారు. ఈ పథకంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. బస్టాండ్ పరిసరాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు గురువారం పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, బస్టాండ్‌లోని ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు.