సంక్రాంతికి సీ ప్లేన్
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:52 AM
సంక్రాంతికి విజయవాడ నుంచి సీ ప్లేన్ సేవలు ప్రారంభంకానున్నాయి. విజయవాడ నుంచి శ్రీశైలంతో పాటు విజయవాడ-హైదరాబాద్, విజయవాడ-విశాఖపట్నం మధ్య కూడా ఈ సర్వీసులు నడపటానికి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
రూ.20 కోట్లతో వాటర్ డ్రోమ్ నిర్మాణం.. డిసెంబరుకు పూర్తి
విజయవాడ నుంచి శ్రీశైలం మాత్రమే కాకుండా..
విజయవాడ-హైదరాబాద్, విజయవాడ-విశాఖపట్నానికి కూడా..
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : సంక్రాంతికి విజయవాడ నుంచి సీ ప్లేన్ సేవలు ప్రారంభంకానున్నాయి. విజయవాడ నుంచి శ్రీశైలంతో పాటు విజయవాడ-హైదరాబాద్, విజయవాడ-విశాఖపట్నం మధ్య కూడా ఈ సర్వీసులు నడపటానికి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. నూతన సంవత్సరం మొదటి రెండు వారాల్లోనే వాటర్ ఏరోడ్రమ్ పనులు కూడా పూర్తిచేసుకుని ఆపరేషన్‌కు శ్రీకారం చుడతారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ సేవలకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో.. కొద్దికాలం కిందట విజయవాడ నుంచి శ్రీశైలానికి ట్రయల్ రన్‌ను కూడా విజయవం తంగా నిర్వహించారు. ఆ తర్వాత ఫీజిబిలిటీ సర్వే, డీపీఆర్ రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విజయవాడ నుంచి సీ ప్లేన్లు నడపటానికి సానుకూలంగా రిపోర్టు వచ్చింది. ఇదే క్రమంలో డీపీఆర్ రూపకల్పన పూర్తయింది.
కృష్ణానదిలో వాటర్ ఏరోడ్రమ్ ఏర్పాటు
కృష్ణానదిలో వాటర్ ఏరోడ్రమ్ ఏర్పాటుకు రూ.20 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇందుకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. సీ ప్లేన్స్‌ను మాత్రం ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తారు. కొద్దికాలం కిందట స్పైస్‌జెట్ సంస్థ ట్రయల్ రన్ నిర్వహించింది. విజయవాడ నుంచి శ్రీశైలానికి రోడ్డు మార్గం అయితే 263 కిలోమీటర్లు ఉండగా, ప్రయాణ సమయం 5.30 గంటలు. సీ ప్లేన్‌లో అయితే కేవలం 45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. అలాగే, హైదరాబాద్, విశాఖపట్నానికి కూడా ఈ సర్వీసులు నడపాలని నిర్ణయించారు. హైదరాబాద్‌కు వెళ్లే సీ ప్లేన్ హుస్సేన్‌సాగర్‌లో ల్యాండ్ అవుతుంది. విశాఖపట్నం అయితే సముద్రంలో ల్యాండ్ అవుతుంది. ఇందుకోసం విశాఖపట్నంలో కూడా వాటర్ డ్రోమ్‌ను ప్రభుత్వమే నిర్మిస్తుంది. హైదరాబాద్‌లో అక్కడి ప్రభుత్వం నిర్మించే అవకాశం ఉంది. తొలిదశలో అమరావతి, తిరుపతి, గండికోట నుంచి సీ ప్లేన్ ఆపరేషన్లు ప్రారంభించాలని, మలిదశలో అరకువ్యాలీ, లంబసింగి, రుషికొండ వంటి ప్రాంతాలను ప్రభుత్వం ఎంపిక చేసింది.