Share News

స్క్రబ్‌ టైఫస్‌ కలవరం

ABN , Publish Date - Dec 07 , 2025 | 01:13 AM

స్క్రబ్‌ టైఫస్‌ ఉమ్మడి కృష్ణాజిల్లాను కలవరపెడుతోంది. కృష్ణాజిల్లాలో 15 కేసులు, ఎన్టీఆర్‌ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇవికాకుండా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఈ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

స్క్రబ్‌ టైఫస్‌ కలవరం
ముదునూరులో స్థానికులతో మాట్లాడుతున్న డీఎంహెచవో యుగంధర్‌

ఉయ్యూరు మండలం ముదునూరులో ఒకరి మృతి

ఐహెచ్‌ఐపీ పోర్టల్‌లో పాజిటివ్‌గా నమోదు

కిడ్నీ మరణమంటున్న కృష్ణాజిల్లా వైద్యాధికారి

అధికారికంగా కృష్ణాలో 15, ఎన్టీఆర్‌లో రెండు కేసులు

గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య చర్యలు

విజయవాడ/ఉయ్యూరు/గుడ్లవల్లేరు/కంచికర్ల రూరల్‌/జి.కొండూరు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : స్క్రబ్‌ టైఫస్‌ ఉమ్మడి కృష్ణాజిల్లాను కలవరపెడుతోంది. కృష్ణాజిల్లాలో 15 కేసులు, ఎన్టీఆర్‌ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇవికాకుండా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఈ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్క్రబ్‌ టైఫస్‌ బారిన పడి ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామానికి చెందిన బుట్టి శివశంకర్‌రాజు (42) ఈనెల 4న మృతిచెందడం కలకలం రేపుతోంది. జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న ఆయన మచిలీపట్నం ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. లక్షణాలను బట్టి పరీక్ష చేయగా, స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌ అని వచ్చింది. దీంతో ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ఫాం (ఐహెచ్‌ఐపీ) పోర్టల్‌లో రాజుకు పాజిటివ్‌ వచ్చినట్టుగా అప్‌లోడ్‌ చేశారు. విషయం తెలుసుకున్న కృష్ణాజిల్లా వైద్యాధికారి డాక్టర్‌ పి.యుగంధర్‌ శనివారం సాయంత్రం ముదునూరులోని మృతుడు శివశంకర్‌రాజు ఇంటికి వెళ్లారు. అతని కుటుంబసభ్యులు, స్థానికులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కిడ్నీ సంబంధిత వ్యాధితో శివశంకరరాజు బాధపడుతున్నట్లు తమ విచారణలో తేలిందని, దీనివల్లే ఆయన మృతిచెందినట్లు నిర్ధారణకు వచ్చామని వెల్లడించారు. పేడపురుగు కుట్టడం వల్ల స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి వస్తుందని, కానీ చనిపోయే అవకాశాలు చాలా తక్కువని తెలిపారు. మందులు వాడితే తగ్గిపోతుందన్నారు.

కంచికచర్లలో ఒక కేసు

నందిగామ నియోజకవర్గ పరిధిలోని కంచికచర్లలో స్క్రబ్‌ టైఫస్‌ లక్షణాలతో మహిళ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కంచికచర్లలో ఆ మహిళకు స్క్రబ్‌ టైఫస్‌ సోకినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు రావడంతో జిల్లా వైద్యాధికారులు స్పందించారు. కంచికచర్ల ఇందిరా కాలనీకి చెందిన మహిళ ఈనెల 3న జ్వరంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు 5న పరీక్షలు నిర్వహించగా, స్క్రబ్‌ టైఫస్‌ అని వైద్యులు గుర్తించారు. సమాచారాన్ని కంచికచర్ల పంచాయతీ అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు ఆప్రమత్తమై రక్షణ చర్యలు చేపట్టారు. మహిళా నివాసిత ప్రాంతంలో బ్లీచింగ్‌ సున్నం పిచికారీ చేశారు.

జి.కొండూరులో ఒక కేసు

జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సంకటి రాకేశ్‌ అనే రెండున్నరేళ్ల బాలుడికి స్క్రబ్‌ టైఫస్‌ సోకింది. ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. రాకేశ్‌ ఆరు నెలల నుంచి మైలవరం మండలం పొందుగల గ్రామంలో నానమ్మ ఇంటి దగ్గర ఉంటున్నాడు. వారం క్రితం బాలుడికి తీవ్ర జ్వరం రావడంతో మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించి అనంతరం విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక పరీక్షలో స్క్రబ్‌ టైఫస్‌ అని తేలింది. బాబు శరీరంపై మచ్చలు కానీ, గాయాలు కానీ లేకపోవడంతో కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్ష కోసం బాలుడి రక్త, మూత్ర శాంపిల్స్‌ పంపారు. నాలుగు రోజుల తర్వాత చెబుతామని వైద్యులు చెప్పారని బాలుడి తల్లి తెలిపింది.

గుడ్లవల్లేరులో రెండు కేసులు

గుడ్లవల్లేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రెండు స్క్రబ్‌ టైఫస్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారి యశస్వినీ శనివారం తెలిపారు. స్థానిక ఇందిరా కాలనీకి చెందిన మానస, పామర్రుకు చెందిన అమలేశ్వరి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అనారోగ్యంతో వచ్చారని, రక్త నమూనాలను సేకరించి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి పంపగా, స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌గా నమోదైందన్నారు. ఇద్దరికీ చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.

Updated Date - Dec 07 , 2025 | 01:13 AM