Share News

శాటిలైట్‌.. రైట్‌ రైట్‌

ABN , Publish Date - Nov 14 , 2025 | 12:55 AM

ఆర్టీసీ గేర్‌ మార్చింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ పోటీని తట్టుకోవటానికి ప్రజల వద్దకే హయ్యండ్‌ బస్సులు తీసుకెళ్లాలని భావిస్తోంది. పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌ (పీఎన్‌బీఎస్‌)పై రద్దీని తగ్గించటానికి, ప్రజలు కోరుకున్న చోట బస్సులు ఆపటానికి వీలుగా శాటిలైట్‌ బస్టేషన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రయోగాత ్మకంగా ఆటోనగర్‌, ఉయ్యూరు బస్టేషన్లను ఇలా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

శాటిలైట్‌.. రైట్‌ రైట్‌
ఆటోనగర్‌ బస్టాండ్‌

ప్రైవేట్‌ బస్సులకు ధీటుగా ఆర్టీసీ శాటిలైట్‌ ప్రతిపాదన

ఆటోనగర్‌, ఉయ్యూరు బస్‌స్టేషన్ల ఎంపిక

హయ్యండ్‌ బస్సులను నడిపే యోచన

పీఎన్‌బీఎస్‌పై రద్దీ తగ్గించేందుకు ప్లాన్‌

ప్రజల చెంతకే బస్సులు వెళ్లేలా స్టాప్‌ పాయింట్లు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఆర్టీసీ హయ్యండ్‌ బస్సులన్నీ దాదాపు పీఎన్‌బీఎస్‌ నుంచి దూరప్రాంతాలైన హైదరాబాద్‌, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నైకు నడుస్తున్నాయి. నగర శివారున ఉన్న ప్రయాణికులు దూరాభారాన ఉన్న పీఎన్‌బీఎస్‌కు రావాల్సి వస్తోంది. ప్రైవేట్‌ బస్‌ ఆపరేటర్లు మాత్రం ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా బెంజిసర్కిల్‌, ఎన్టీఆర్‌ సెంటర్‌, రామవరప్పాడు సెంటర్‌ ఇలా సబ్‌ పాయింట్ల నుంచే బస్సులను నడుపుతున్నారు. దీంతో ప్రైవేట్‌ బస్సులు ప్రజలకు దగ్గర ప్రాంతాల్లో అందుబాటులో ఉంటున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు కూడా ప్రజలకు అందుబాటులో హయ్యండ్‌ బస్సులు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఆటోనగర్‌, ఉయ్యూరు బస్‌ డిపోల నుంచి ఇప్పటికే హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైకు కొన్ని హయ్యండ్‌ బస్సులను నడుపుతున్నారు. ఇవి సత్ఫలితాలను ఇస్తున్నాయి. పీఎన్‌బీఎస్‌ నుంచి నడిచే అధిక శాతం హయ్యండ్‌ బస్సులను శాటిలైట్‌ బస్టేషన్ల నుంచి నడపాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. 90 శాతానికి పైగా ఆటోనగర్‌ బస్‌ డిపో నుంచి నడపాలని భావిస్తున్నారు. డాల్ఫిన్‌ క్రూయిజర్లు, అమరావతి, వెన్నెల స్లీపర్‌, నైట్‌ రైడర్‌, ఇంద్ర తదితర ఏసీ బస్సులను ఆటోనగర్‌ నుంచే హైదరాబాద్‌, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నైకు నడపనున్నారు. అలాగే, మరికొన్ని సర్వీసులను ఉయ్యూరు బస్‌ డిపో నుంచి కూడా నడుపుతారు. శాటిలైట్‌ బస్‌స్టేషన్ల నుంచి ప్రారంభమయ్యే బస్సులు పీఎన్‌బీఎస్‌కు రావు. ఆటోనగర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లే బస్సులకు ఎన్టీఆర్‌ సర్కిల్‌, బెంజిసర్కిల్‌, కుమ్మరిపాలెం, భవానీపురం, గొల్లపూడి.. ఇలా పాయింట్లు ఇచ్చి అక్కడ ఆగేలా చర్యలు తీసుకుంటారు. ఆటోనగర్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సులు ఎన్టీఆర్‌ సర్కిల్‌, బెంజిసర్కిల్‌, రామవరప్పాడులో కొద్దిసేపు ఆగి ప్రయాణికులను ఎక్కించుకునేలా బోర్డింగ్‌ పాయింట్లు నిర్దేశిస్తారు.

ఆటోనగర్‌ ఇంటిగ్రేటెడ్‌ బస్‌ టెర్మినల్‌కు లైన్‌క్లియర్‌

ఆటోనగర్‌ బస్‌స్టేషన్‌ను ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌గా అభివృద్ధి చేసే ప్రతిపాదనలను ఆర్టీసీ అధికారులు పూర్తిచేసి హెడ్డాఫీసుకు పంపారు. ప్రైవేట్‌ అండ్‌ పబ్లిక్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో ఔత్సాహిక సంస్థలకు అప్పగించాలని చూస్తున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ అంతా బస్‌ టెర్మినల్‌, స్టేషన్‌ అధికారులు, డిపో అధికారుల చాంబర్లు వంటివి ఉండేలా డిజైన్లు సిద్ధం చేశారు. ఫస్ట్‌, సెకండ, థర్డ్‌, ఫోర్త్‌ ఫ్లోర్లు కమర్షియల్‌గా వినియోగించుకునేందుకు వీలుగా డిజైన్లను రూపొందిస్తున్నారు. ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వడమే తరువాయి.

భారీగా పెరిగిన ఓఆర్‌

ప్రైవేట్‌ బస్సులపై రవాణా శాఖ దాడుల నేపథ్యంలో వారం పాటు ఆర్టీసీకి గణనీయంగా ఆక్యుపెన్సీ పెరిగింది. తనిఖీల భయంతో ప్రైవేట్‌ ఆపరేటర్లు తమ బస్సులను రద్దు చేశారు. ప్రయాణికులకు చార్జీల మొత్తాన్ని వెనక్కి ఇచ్చారు. దీంతో చాలామంది ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. ఫలితంగా సగటు ఆక్యుపెన్సీ కంటే 25 శాతం అదనంగా పెరిగింది. ప్రైవేట్‌ బస్సులను పునరుద్ధరించటంతో మళ్లీ 25 శాతం ఓఆర్‌ పడిపోయింది. ఈ క్రమంలో ప్రైవేట్‌ బస్సులను ధీటుగా ఎదుర్కొంటే తప్ప మనుగడ సాధించలేమని ఆర్టీసీ భావిస్తోంది. అందుకే శాటిలైట్‌ బస్‌స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

Updated Date - Nov 14 , 2025 | 12:55 AM