శాండ్ షీట్
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:49 AM
స్థానికంగా ఉన్న ఒక ప్రాంతానికి ఇసుకను బుక్ చేసుకుని.. ఆ తర్వాత రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్న అక్రమార్కులపై పోలీసులు చెక్ పెట్టారు. ఇక నుంచి ఇసుకను పదేపదే అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కుతున్న వారిపై షీటు తెరవడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇకపై ఇసుక అక్రమంగా తరలిస్తే అంతే..
మూడుసార్లు చిక్కితే క్రైం సస్పెక్ట్ షీట్
రంగం సిద్ధం చేస్తున్న పోలీసులు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : స్థానికంగా ఉన్న ఒక ప్రాంతానికి ఇసుకను బుక్ చేసుకుని.. ఆ తర్వాత రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్న అక్రమార్కులపై పోలీసులు చెక్ పెట్టారు. ఇక నుంచి ఇసుకను పదేపదే అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కుతున్న వారిపై షీటు తెరవడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తీరు మారకపోవడంతో..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక అక్రమ తరలింపునకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఇప్పటి వరకు మొత్తం 150 కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చాక పోలీసులు జిల్లా సరిహద్దుల్లో 15 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వాటి వద్ద సీసీ కెమెరాలు అమర్చారు. 24/7 గస్తీ ఏర్పాటు చేశారు. ఇసుక అవసరమైన వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని, నిర్ణయించిన కనీస ధరను చెల్లించాలి. ఆ తర్వాత జీపీఎస్ ఉన్న వాహనంలో స్టాక్ పాయింట్ నుంచి ఇసుకను లోడ్ చేయించుకుని తీసుకెళ్లాలి. ఏ ప్రాంతానికి ఇసుకను బుక్ చేసుకున్నారో అదే ప్రాంతానికి ఆ వాహనం వెళ్లాలి. ఆ మార్గం తప్పి, మరో మార్గంలోకి వెళ్లిందంటే అలెర్ట్ వచ్చేలా పోలీసులు జియో ఫెన్సింగ్ చేశారు. ఇలాకాకుండా ఒక ప్రాంతానికి ఇసుకను బుక్ చేసుకుని మరో ప్రాంతానికి తీసుకెళ్తున్న వాహనాలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
ఇకపై షీటే..
ఇసుక అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన కేసులన్నీ స్టేషన్ బెయిల్ ఇచ్చేవే కావడంతో పోలీసులకు ఎన్నిసార్లు చిక్కినా అక్రమార్కులు భయపడట్లేదు. దీంతో నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నుంచి ఇసుకను తెలంగాణ సరిహద్దుల్లోకి తరలిస్తున్నారు. స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంతో అక్రమార్కులు పదేపదే ఇలాగే వ్యవహరిస్తున్నారని అధికారులు గుర్తించారు. దీనికి చెక్ పెట్టడానికి ఇసుకను అక్రమంగా తరలిస్తూ మూడు, అంతకంటే ఎక్కువసార్లు చిక్కిన వారిపై షీటు తెరవాలని నిర్ణయించారు. క్రైం సస్పెక్ట్ షీటు తెరిచి, దానికి బ్రాకెట్‌లో శాండ్ అని రాస్తారు. పోలీసు కమిషనరేట్‌లో రౌడీ, క్రైం సస్పెక్ట్, డెకాయిట్, గంజాయి షీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇసుక కోసం కొత్తగా షీట్‌ను తయారు చేయాలని నిర్ణయించారు.