Share News

‘జీనీ’యస్‌

ABN , Publish Date - Apr 17 , 2025 | 01:11 AM

వస్తువులను అమ్మలేదు.. వాటిని ఎవరు కొన్నారో కూడా తెలియదు.. కానీ ఆ వస్తువులు అమ్మారని కార్పొరేషన్‌ యూసీడీ విభాగంలో పనిచేసే టౌన్‌లెవల్‌ ఫెడరేషన్‌ (టీఎల్‌ఎఫ్‌) బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బు జమైంది. ఇప్పుడు ఈ డబ్బు వ్యవహారం కార్పొరేషన్‌లో చర్చనీయాంశంగా మారింది. టీఎల్‌ఎఫ్‌ ఖాతాలో పడిన ఈ డబ్బును తమకు బదలాయించాలని యూసీడీ విభాగం అధికారులు ఒత్తిడి తెస్తుండటం, అలా చేస్తే తాము జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని టీఎల్‌ఎఫ్‌ సభ్యులు చెబుతుండటం గందరగోళానికి దారితీసింది. ఈ వ్యవహారం మెప్మా ఎండీకి ఫిర్యాదు చేసే వరకు వెళ్లడంతో డ్వాక్వా సంఘాల పేరుతో ఆ వస్తువుల అమ్మకాల వెనుక పెద్ద కథే నడిచిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘జీనీ’యస్‌

డ్వాక్వా పేరుతో వావ్‌ జీనీ యాప్‌ ద్వారా వస్తువుల విక్రయాలు

అసలు ఆ వస్తువులు డ్వాక్వా సంఘాలవే కాదు

ప్రభుత్వ మెప్పు, రికార్డుల కోసం బయటి వస్తువుల అమ్మకాలు

ముంబయి నుంచి ఓ టీఎల్‌ఎఫ్‌ ఖాతాలో భారీగా నగదు జమ

వేరే ఖాతాలకు బదలాయించాలని యూసీడీ అధికారుల ఆదేశం

జీఎస్టీ భారం పడుతుందని డ్రా చేయని టీఎల్‌ఎఫ్‌

మెప్మా ఎండీని కలిసి ఫిర్యాదు.. కార్పొరేషన్‌లో చర్చ

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఇటీవల మెప్మా ఆధ్వర్యంలో ‘వావ్‌ జీనీ’ యాప్‌ను తీసుకొచ్చారు. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా భారీగా విక్రయాలు జరిపి ఒకేరోజు గిన్నిస్‌బుక్‌ రికార్డు సాధించాలని ఆ సంస్థ ఉన్నతాధికారులు ప్లాన్‌ వేశారు. ప్రభుత్వం దగ్గర మెప్పు పొందే క్రమంలో వీరు కొన్ని పొరపాట్లు చేశారు. పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాలు (డ్వాక్వా గ్రూపులు) తయారుచేసిన ఉత్పత్తుల కంటే కూడా బయట నుంచి ఎక్కువగా కొనుగోలు చేసిన వాటిని ఈ యాప్‌ ద్వారా విక్రయించారన్న ఆరోపణలు ఉన్నాయి. లెదర్‌ బ్యాగులు, కర్చీఫ్‌లు, రాగి ప్లేట్ల వంటి వాటిని నగరంలోని డ్వాక్వా సంఘాల పేరుతో విక్రయించారు. వాస్తవానికి వీటిని డ్వాక్వా సంఘాలు తయారు చేయలేదని సమాచారం. ఈ సంఘాలే ఉత్పత్తి చేసినట్టుగా బయట నుంచి వీటిని కొని, ‘వావ్‌ జీనీ’ యాప్‌ ద్వారా విక్రయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

డబ్బు బదలాయింపులో వివాదం

ముంబయి కంపెనీ నుంచి టీఎల్‌ఎఫ్‌ బ్యాంకు ఖాతాలో పడిన డబ్బును కార్పొరేషన్‌లోని యూసీడీ విభాగం అధికారులు.. ఆర్టీజీఎస్‌ ద్వారా వేర్వేరు ఖాతాలకు బదలాయించాలని ఆదేశించారు. ఆ డబ్బుకు అదనంగా 18 శాతం జీఎస్‌టీ కలిపి చెల్లించాల్సిందిగా యూసీడీ విభాగం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సొంత డబ్బు జీఎస్‌టీ కట్టాల్సి ఉండటంతో కంగారుపడిన టీఎల్‌ఎఫ్‌ సభ్యులు యూసీడీని మరోమారు సంప్రదించారు. దీంతో అధికారులు.. జీఎస్టీ 18 శాతం మినహాయించుకుని చెల్లించాలని ఆదేశించారు. యూసీడీ విభాగం నుంచి రెండుసార్లు వేర్వేరుగా ఆదేశాలు రావడంతో అనుమానం వచ్చిన టీఎల్‌ఎఫ్‌ సభ్యులు ఆడిటర్‌ను సంప్రదించారు. ఆ లావాదేవీలకు కచ్చితంగా కొటేషన్స్‌, ఇన్వాయిస్‌ బిల్స్‌ను ఆడిటింగ్‌ సమయంలో సమర్పించాల్సి ఉంటుందని సదరు ఆడిటర్‌ స్పష్టం చేశారు. దీంతో టీఎల్‌ఎఫ్‌ సభ్యులు ఈ నగదును యూసీడీ చెప్పినట్టుగా వేరే ఖాతాలకు బదలాయించలేదు. అయితే, చెక్కులైనా ఇవ్వాలని ఉజ్వల టీఎల్‌ఎఫ్‌ సభ్యులపై యూసీడీ విభాగ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. చెక్కులు కూడా ఇవ్వబోమని, జీఎస్టీ సంగతి తేల్చాలని, లేకపోతే రూ.లక్షన్నరకు పైగా తాము సొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని ఉజ్వల టీఎల్‌ఎఫ్‌ సభ్యులు వాపోయారు. దీంతో యూసీడీ అధికారులు చెక్కులు ఇవ్వకపోతే టీఎల్‌ఎఫ్‌ను రద్దు చేస్తామని బెదిరించారు. చేసేదేమీ లేక సదరు టీఎల్‌ఎఫ్‌ సభ్యులంతా బుధవారం మెప్మా ఎండీని కలిసి ఫిర్యాదు చేశారు.

డబ్బు జమ చేసేది ఎవరికి?

ఉజ్వల టీఎల్‌ఎఫ్‌ ఖాతాలో పడిన డబ్బును ఆర్టీజీఎస్‌ ద్వారా కానీ, చెక్కుల ద్వారా కానీ ఇవ్వాలని ఒత్తిడి చేయటం వెనుక అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఎవరికైనా డబ్బు చెల్లించాలంటే.. వాటికి సంబంధించి ఇన్వాయిస్‌లు ఉండాలి. కొటేషన్స్‌ ఉండాలి. ఇవేమీ లేకుండా డబ్బు చెల్లించటానికి అవకాశం ఉండదు. అసలు ఎవరికి చెల్లిస్తున్నామన్నది కూడా రహస్యంగా ఉంచుతూ ఆర్‌టీజీఎస్‌ పేమెంట్లు కానీ, ఖాళీ చెక్కులు కానీ ఇవ్వమంటున్న యూసీడీ అధికారుల తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

తమకు తెలియదంటున్న టీఎల్‌ఎఫ్‌లు

డ్వాక్వా సంఘాలన్నింటిపై పర్యవేక్షణకు పట్టణ స్థాయి సమాఖ్య (టౌన్‌ లెవల్‌ ఫెడరేషన్‌ - టీఎల్‌ఎఫ్‌)లు ఉంటాయి. నగరంలో మొత్తం ఆరు టీఎల్‌ఎఫ్‌లు ఉన్నాయి. వీటిలో ఉజ్వల టీఎల్‌ఎఫ్‌కు చెందిన బ్యాంకు ఖాతాలో రెండు విడతలుగా రూ.18,90,476 డబ్బు ముంబయి నుంచి జమ అయ్యింది. మార్చి 1న రూ.1,33,381, మార్చి 14న రూ.17,57,095 జమ అయ్యాయి. అయితే, అసలు ఆ వస్తువులను యాప్‌ ద్వారా విక్రయించినట్టుగా తమకు తెలియదని టీఎల్‌ఎఫ్‌ సభ్యులు చెబుతున్నారు.

Updated Date - Apr 17 , 2025 | 01:11 AM