Share News

బదిలీల జాతర

ABN , Publish Date - May 24 , 2025 | 12:49 AM

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 2,680 పాఠశాలల్లో 12,250 మంది టీచర్లు ఉన్నారు. వీరిలో ఐదేళ్లు పూర్తిచేసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సెకండరీ గ్రేడ్‌ టీచర్లు దరఖాస్తు చేసుకోవాలి.

బదిలీల జాతర

జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల హడావిడి

స్కూల్‌ అసిస్టెంట్ల దరఖాస్తుకు నేడే తుది గడువు

సాంకేతిక ఇబ్బందులతో సతమతం

స్కూల్‌ ఆప్షన్లకు ఇంకా ఖరారు కాని తేదీ

మచిలీపట్నం టౌన్‌, మే 23 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి కృష్ణాజిల్లాలో 2,680 పాఠశాలల్లో 12,250 మంది టీచర్లు ఉన్నారు. వీరిలో ఐదేళ్లు పూర్తిచేసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సెకండరీ గ్రేడ్‌ టీచర్లు దరఖాస్తు చేసుకోవాలి. దీనిని అనుసరించి 4,315 మంది టీచర్లు బదిలీకి దరఖాస్తు చేసుకుంటున్నారు. 22 జీవో ప్రకారం, బదిలీ నియంత్రణ చట్టం-2025ను అనుసరించి ప్రభుత్వ, జిల్లా పరిషత, మండల పరిషత, మున్సిపల్‌, కార్పొరేషన్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. బాలికల ఉన్నత పాఠశాలల్లో 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పురుష హెడ్‌మాస్టర్లు తప్పనిసరిగా బదిలీ అవుతున్నారు. ఒకే పాఠశాలలో రెండేళ్ల పాటు సర్వీసు పూర్తిచేసిన గ్రేడ్‌-2 హెడ్‌మాస్టర్లు కూడా బదిలీ అవుతారు. ఇలా గ్రేడ్‌-2 ఉపాధ్యాయులు 142 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో బదిలీకి 40 మంది, రిక్వెస్టు బదిలీకి 102 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా రెండేళ్లలోపు పదవీ విరమణ చేస్తున్న గ్రేడ్‌-2 ఉపాధ్యాయులకు సొంత అభ్యర్థనపై బదిలీ ఉండదు. బాలికలపై దుర్వినియోగం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులకు బాలికల ఉన్నత పాఠశాలలో పోస్టింగ్‌ ఇవ్వరు. వేరే ప్రాంతానికి బదిలీ చేస్తారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ఈ బదిలీ జరగనుంది.

పాయింట్ల లెక్క

సర్వీసు, స్టేషన్‌, స్పెషల్‌ పాయింట్లు, ప్రాధాన్యతావర్గం, పనితీరును బట్టి ఉపాధ్యాయులకు కొన్ని పాయింట్లు కేటాయించారు. ఈ బదిలీలకు ఉపాధ్యాయులకు ఐదేసి పాయింట్లు ఇచ్చారు. అయితే వినికిడిలోపం ఉన్న ఉపాధ్యాయులకు 5 పాయింట్లు, అంగవైకల్యం ఉన్న టీచర్లకు 5 పాయింట్లు ఇచ్చారు. 40 ఏళ్లు పైబడిన అవివాహిత మహిళలకు కూడా 7 పాయింట్లు ఇచ్చారు. కాగా, 69 శాతం వైకల్యం ఉన్న ఉద్యోగులకు 7 పాయింట్లు ఇచ్చారు. గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల నాయకులకు 5 పాయింట్లు ఇచ్చారు. రెండేళ్లుగా స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ నడుపుతున్న టీచర్లకు 2 పాయింట్లు ఇచ్చారు. ఇలా బదిలీల కోసం దరఖాస్తు చేసుకుంటున్న ఉపాధ్యాయులు.. తమ పేర్లలో తప్పులు దొర్లితే సరిచేసుకునేందుకు డీఈవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అనారోగ్యంతో బాధపడే టీచర్లు తమ దరఖాస్తుతో పాటు ఆసుపత్రిలోని నివేదికలను జత చేస్తున్నారు. వాటిని మెడికల్‌ గ్రౌండ్స్‌కు విచారణకు పంపుతామని డీఈవో రామారావు తెలిపారు. కాగా టీచర్లు దరఖాస్తు చేసుకుంటున్నప్పటికీ వారు కోరుకునే స్కూల్‌ ఆప్షన్లు ఇంకా ఇచ్చేందుకు ప్రభుత్వం తేదీని ఖరారు చేయలేదు.

27లోగా ఎస్‌జీటీలకు అవకాశం

సెకండరీ గ్రేడ్‌ టీచర్లు ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రధానోపాధ్యాయుల ప్రొవిజనల్‌ సీనియారిటీ జాబితాలను 24న ప్రకటిస్తారు. 27న స్కూల్‌ అసిస్టెంట్ల ప్రొవిజనల్‌ సీనియారిటీ లిస్టు, 31న సెకండరీ గ్రేడ్‌ టీచర్ల సీనియారిటీ లిస్టు ప్రకటిస్తారు. 28న ప్రధానోపాధ్యాయులు వారు కోరుకునే పాఠశాలలకు వెబ్‌ ఆప్షన్‌ ఇచ్చుకోవాలి. స్కూల్‌ అసిస్టెంట్లు జూన్‌ 1, 2 తేదీల్లో వెబ్‌ ఆప్షన్‌ ఇచ్చుకోవాలి. సెకండరీ గ్రేడ్‌ టీచర్లు జూన్‌ 7 నుంచి 10వ తేదీలోగా వారు కోరుకునే పాఠశాల వెబ్‌ ఆప్షన్లు ఇస్తారు. పదోన్నతుల అనంతరం ఏర్పడే ఖాళీలకు అనుగుణంగా ఈ బదిలీలు ఉంటాయి.

Updated Date - May 24 , 2025 | 12:49 AM