ఇంద్రకీలాద్రికి రోప్‌వే
ABN , Publish Date - Jun 29 , 2025 | 12:43 AM
జగన్మాత కనకదుర్గమ్మను దర్శించుకోవటానికి ఇంద్రకీలాద్రి వచ్చే భక్తుల కోసం దేవస్థాన అధికారులు రోప్‌వే ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. గతంలో రెండుసార్లు పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) అధికారులు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా, ఈసారి మాత్రం శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అధికారులే తెరపైకి తెచ్చారు.
సీతమ్మవారి పాదాలు-ఓం టర్నింగ్-భవానీ ఐల్యాండ్
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అధికారుల ప్రతిపాదన
గతంలో రెండుసార్లు ప్రతిపాదించిన ఏపీటీడీసీ అధికారులు
గందరగోళ అలైన్‌మెంట్ల కారణంగా తిరస్కరణ
దేవదాయ మంత్రి వద్దకు చేరిన తాజా ప్రతిపాదన
పర్వతమాల ప్రాజెక్టు కింద చేపట్టాలని భావన
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జగన్మాత కనకదుర్గమ్మను దర్శించుకోవటానికి ఇంద్రకీలాద్రి వచ్చే భక్తుల కోసం దేవస్థాన అధికారులు రోప్‌వే ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. గతంలో రెండుసార్లు పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) అధికారులు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా, ఈసారి మాత్రం శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అధికారులే తెరపైకి తెచ్చారు. రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దుర్గగుడి ఈవో శీనానాయక్ ఈ ప్రతిపాదన చేశారు. జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్ ) పర్వతమాల పథకం కింద దీనిని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సీతమ్మవారి పాదాల నుంచి ఇంద్రకీలాద్రిపై ఓం టర్నింగ్ వరకు, తిరిగి భవానీ ఐల్యాండ్ వరకు ఈ ప్రతిపాదన చేశారు. దేవస్థానం, ప్రభుత్వంపై ఖర్చు పడకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో దీనిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
గతంలో రెండుసార్లు ప్రతిపాదనలు
రోప్‌వే ప్రాజెక్టు కోసం గతంలో రెండుసార్లు ఏపీటీడీసీ అధికారులు ప్రతిపాదన పెట్టారు. రాజీవ్‌గాంధీ పార్కు నుంచి దుర్గగుడిపైకి ఒకటి, రాజీవ్‌గాంధీ పార్కు నుంచి దుర్గగుడికి.. అక్కడి నుంచి భవానీ ఐల్యాండ్‌కు రెండోది. కానీ, ఈ ప్రతిపాదనలు పట్టాలెక్కలేదు. మొదటి ప్రతిపాదన ఆగమశాస్ర్తానికి విరుద్ధంగా ఉందని వైదిక కమిటీ అభ్యంతరం వ్యక్తం చే సింది. రెండో ప్రతిపాదనకు అలైన్‌మెంట్ అక్కన్న, మాదన్న గుహలపైగా వెళ్తుండటంతో ఆర్కియాలజీ శాఖ అభ్యంతరం తెలిపింది. ఈసారి మాత్రం దేవస్థాన అధికారులు ఎవరికీ అభ్యంతరం లేకుండా ఉండేలా సీతమ్మవారి పాదాల నుంచి ఓం టర్నింగ్ వరకు, తిరిగి ఓం టర్నింగ్ నుంచి భవానీ ద్వీపం వరకు రోప్‌వేను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఇటు వైదిక కమిటీ కానీ, అటు ఆర్కియాలజీ శాఖ నుంచి కానీ అభ్యంతరాలు వచ్చే అవకాశం లేదు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదైన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి ఇటీవల భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోప్‌వే ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.