Share News

దళారుల దందా

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:44 AM

సామాజిక పింఛన్ల పంపిణీలో అనర్హుల ఏరివేత కార్యక్రమం దళారుల పంట పండిస్తోంది. వైసీపీ హయాంలో ఇబ్బడిముబ్బడిగా మంజూరు చేసిన పింఛన్లలో అనర్హుల తొలగింపు కార్యక్రమం జిల్లాలో వేగంగా జరుగుతుండగా, దళారులు రంగంలోకి దిగారు. అనర్హులకు పింఛన్లు తొలగించ కుండా ఉండేలా బేరాలు కుదుర్చుకుంటున్నారు. ఒక్కొక్కరు రూ.40 వేల నుంచి రూ.45 వేలు డిమాండ్‌ చేస్తున్నారు. వైసీపీ హయాంలో ఎవరైతే అనర్హులకు పింఛన్లు ఇప్పించారో వారే దళారులుగా మారి నేడు వసూళ్లకు పాల్పడుతుండటం గమనార్హం.

దళారుల దందా

పింఛన్ల పునఃపరిశీలన కార్యక్రమంలో హవా

మచిలీపట్నం, అవనిగడ్డ ఆసుపత్రుల్లో దోపిడీ

వైసీపీ హయాంలో అనర్హులకు పింఛన్లు ఇప్పించిన దళారులు

తొలగించకుండా చూసుకుంటామని నేడు భరోసా

పింఛన్‌ పోకూడదంటే రూ.45 వేలు ఇవ్వాలని బేరం

మచిలీపట్నంలో ఆసుపత్రిలో ఓ చోటా నేత వసూళ్లు

అవనిగడ్డ ఆసుపత్రిలో మధ్యవర్తుల మాయ

(ఆంధ్ర జ్యోతి-మచిలీపట్నం) : జిల్లాలో రెండు నెలలుగా పింఛన్ల పరిశీలన కార్యక్రమం జరుగుతోంది. మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో ఈ కార్యక్రమం కొనసాగుతుండగా, అవనిగడ్డ, తదితర ఏరియా ఆసుపత్రుల్లో దివ్యాంగుల పింఛన్ల పునఃపరిశీలన కొద్దిరోజుల నుంచి ప్రారంభమైంది. మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలోని ఆర్ధోపెడిక్‌ విభాగంలో పనిచేసే ఉద్యోగి ఒకరు అన్నీతానై వ్యవహరిస్తూ ఈ పింఛన్ల పరిశీలనలో తెరవెనుక చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఆసుపత్రిలో పనిచేసే ఈ ఉద్యోగి ఏజెంట్ల ద్వారా పింఛన్‌ పరిశీలనకు వచ్చేవారితో బేరాలు ఆడుతున్నారు. పూర్తిస్థాయిలో వైకల్యం ఉన్నట్టుగా సర్టిఫికెట్లు ఇప్పిస్తానని, ఒక్కొక్కరు రూ.40 వేల నుంచి రూ.45 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంత మొత్తం ఇచ్చుకోలేమని చెబుతున్న వారికి.. దివ్యాంగుల కోటాలో నెలకు రూ.6 వేల పెన్షన్‌ వస్తుందని, ఏడాదిలో ఏడెనిమిది నెలలు పింఛన్లు మీవి కాదనుకుంటే.. జీవిత కాలమంతా పింఛన్‌ పొందవచ్చని చెబుతున్నారు.

బహిరంగంగానే బేరాలు

అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా దివ్యాంగుల కోటాలో పింఛన్లు ఇప్పించడంలో కొందరు దళారులు గత ప్రభుత్వంలో చక్రం తిప్పారు. మళ్లీ వారే ఇప్పుడు కూడా తమ హవాను కొనసాగిస్తున్నారు. ఒక్కొక్కరు కనీసం రూ.40 వేలు తగ్గకుండా ఇస్తే పింఛనుకు ఢోకా లేదని బాహాటంగానే చెబుతున్నారు. అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో గురువారం నుంచి పింఛన్ల పరిశీలన కార్యక్రమం ప్రారంభం కాగా, నాలుగైదు రోజుల నుంచి దళారులు ఈ బేరాల పనిలో పడ్డారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అధికశాతం మందికి గతంలో దివ్యాంగుల పింఛన్లు ఇప్పించిన వైసీపీ నాయకులే ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా నగదు వసూళ్లకు పాల్పడుతున్నారు. అవనిగడ్డ, మచిలీపట్నం సర్వజన ఆసుపత్రుల్లో తమ మాట చెల్లుబాటు అవుతుందని, నగదు చెల్లిస్తే కథ తాము నడుపుతామని మాయమాటలు చెబుతున్నారు.

నేనే రాజు, నేనే మంత్రి..

మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో జరుగుతున్న పింఛన్ల పరిశీలనలో ఓ చోటా నాయకుడు హవా నడుపుతున్నాడు. ఆసుపత్రి వైద్యులు తాను చెప్పినట్టే వింటారని, తానే రాజు, తానే మంత్రినని చెబుతున్నాడు. ఈ విషయం అల్లరి కావడంతో ఆసుపత్రిలో పనిచేసే కొందరు వైద్యులు కొంతకాలంగా అతని సిఫార్సులను కొంతమేర పక్కన పెడుతున్నారు. దీంతో ఇతనికి నగదు ఇచ్చిన వారికి దివ్యాంగుల పింఛన్‌ వచ్చేలా సర్టిఫికెట్లు జారీ కాలేదు. అయినా తనకున్న పరిచయాలతో దివ్యాంగుల పింఛన్లు ఇప్పిస్తానని చెప్పి నగదు వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఇతనికి ఆసుపత్రిలో పనిచేసే సీనియర్‌ ఉద్యోగి సహకరిస్తుండటంతో వసూళ్లకు బ్రేక్‌ పడట్లేదు. ఈ చోటా నాయకుడికి అనుకూలంగా పనిచేసే ఆసుపత్రి వైద్యులపైనా చర్యలు తీసుకోవాలని కోరుతూ వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఇటీవల పలువురు ఫిర్యాదు చేశారు. ఈ చోటా నాయకుడి చేతిలో మోసపోయినవారు.. పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. పార్టీ పెద్దలు పిలిచి మందలించినా చోటా నాయకుడు వసూళ్లు ఆపకపోవడం గమనార్హం.

తొలివిడత పింఛన్ల పరిశీలన గడువు ఈనెల 20

జిల్లాలో 2.34 లక్షల మంది వివిధ రూపాల్లో సామాజిక పింఛన్లు పొందుతున్నారు. వీరిలో 34 వేల మంది దివ్యాంగుల కోటాలో పింఛన్లు పొందేవారే. డీఆర్‌డీఏ విభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విభాగం ద్వారా ఇప్పటివరకు 17 వేల మందికి పింఛన్ల పరిశీలనకు నోటీసులు జారీ చేశారు. షెడ్యూల్‌ ప్రకారం మండల స్థాయిలో ఎంపీడీవోలు, పురపాలక సంఘాల్లో మునిసిపల్‌ కమిషనర్‌ కార్యాలయాల నుంచి పింఛన్‌ పొందే లబ్ధిదారులను ఫలానా తేదీన ఆసుపత్రుల్లో పరీక్షల కోసం వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు వైకల్యం తక్కువగా ఉన్నట్టుగా చూపారని, మళ్లీ పరీక్షలు చేయాలని 4వేల మందికి పైగా అప్పీలు చేసుకున్నారు. వీరితో పాటు నోటీసులు అందుకుని, ఇంకా వైద్య పరీక్షలు చేయించుకోని వారికి ఈనెల 20వ తేదీలోగా పరీక్షలు చేయాల్సి ఉందని డీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. రెండో విడత నోటీసులు జనవరిలో జారీచేస్తామని పేర్కొంటున్నారు.

Updated Date - Dec 06 , 2025 | 12:44 AM