చిల్లర పనులు
ABN , Publish Date - Sep 16 , 2025 | 01:02 AM
ఉత్తరాంధ్ర నుంచి ఓ భక్తుడు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చాడు. ముందుగా అమ్మవారికి తలనీలాలు సమర్పించాక దర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కేశఖండన శాల కౌంటర్‌లోకి వెళ్లి టికెట్ తీసుకోవడానికి రూ.100 ఇచ్చాడు. కౌంటర్‌లోని సిబ్బంది టికెట్‌తో పాటు తిరిగి రూ.50 చేతిలో పెట్టారు. టికెట్ రూ.40 కదా.. ఇంకా తనకు పది రూపాయలు వస్తాయని భక్తుడు అడిగాడు. తమ వద్ద చిల్లర లేదని కౌంటర్‌లోని సిబ్బంది సమాధానం చెప్పి ఆ భక్తుడిని పంపేశారు. తెలంగాణాకు చెందిన ఓ భక్తుడు కుటుంబంతో కలిసి ఇంద్రకీలాద్రి వచ్చాడు. అమ్మవారికి తలనీలాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కేశఖండన శాలలోకి వెళ్లి కౌంటర్‌లో ఉన్న సిబ్బందికి రూ.50 ఇచ్చాడు. దేవస్థానం నిర్ణయించిన టికెట్ ధర రూ.40. టికెట్‌తో పాటు రూ.10 తిరిగి ఇవ్వాల్సిన సిబ్బంది ఆ పని చేయలేదు. టికెట్ మాత్రమే చేతిలో పెట్టారు. పది రూపాయలు వస్తుందని భక్తుడు అడిగితే చిల్లర లేదని చెప్పి పంపేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దర్శనానికి వస్తున్న భక్తుల నుంచి సిబ్బంది ఎలా డబ్బు దండుకుంటున్నారో తెలియజేసే ఘటనలివి. ఇంద్రకీలాద్రిని కొంతమంది దళారులు, ఉద్యోగులు ఆదాయ వనరుగా మార్చేసుకుంటున్నారు. చిల్లర లేదు.. అన్న ఒక్కమాటతో కేశఖండన శాలలో భక్తుల నోళ్లను మూయించేస్తున్నారు.
దుర్గగుడి కేశఖండన శాలలో దోపిడీ
టికెట్ రూ.40 అయితే, రూ.50 వసూలు
మిగతా రూ.10 సిబ్బంది జేబుల్లోకి..
ప్రశ్నించిన భక్తులకు చిల్లర లేదని సమాధానం
తలనీలాల అనంతరం మరో రూ.50 వసూలు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఇంద్రకీలాద్రికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ముందుగా కేశఖండన శాలలోకి వెళ్లి తలనీలాలు సమర్పిస్తారు. తర్వాత దుర్గాఘాట్‌లో స్నానంచేసి దర్శనానికి వెళ్తారు. సాధారణ రోజుల్లో 25 వేల నుంచి 30 వేల మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. ఆది, మంగళ, శుక్రవారాల్లో 45 వేల నుంచి 50 వేల మంది వరకు ఉంటారు. ఇలా వచ్చిన భక్తుల్లో రోజుకు 2 వేల మంది అమ్మవారికి తలనీలాలు సమర్పిస్తారు. ఇక్కడి నుంచే దోపిడీ మొదలవుతుంది. టికెట్ ధరకు మించి డబ్బు వసూలు చేయొద్దని అధికారులు ఆదేశించినా సిబ్బంది ఖాతరు చేసే పరిస్థితి కనిపించట్లేదు. అధికారులు తనిఖీలకు వస్తే మాత్రం జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారు. నిత్యం తలనీలాలు సమర్పించడానికి వచ్చే భక్తుల్లో సగం మందికి తిరిగి చిల్లర ఇవ్వట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రోజుకు రూ.10 వేల చొప్పున అదనపు ఆదాయాన్ని కేశఖండన శాలలోని కౌంటర్ సిబ్బంది పక్కకు తీస్తున్నారు. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తుల నుంచి సేకరిస్తున్న ఐవీఆర్‌ఎస్ సర్వేలోనూ సిబ్బంది వసూళ్లపై ఫిర్యాదులు అందుతున్నాయి.
అదనపు చదివింపులు
తలనీలాలు సమర్పించాక కూడా డబ్బు చెల్లించాల్సి వస్తోంది. తలనీలాలు తీసినందుకు రూ.50 ఇవ్వాలని అడుగుతున్నారు. ఒక కుటుంబంలో నలుగురు తలనీలాలు సమర్పిస్తే రూ.200 క్షురకుడి చేతిలో పెట్టాల్సి వస్తోంది. అడిగినంత ఇవ్వని భక్తులపై పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు.