Share News

కన్నయ్య వెంటే కన్నతల్లి

ABN , Publish Date - Aug 23 , 2025 | 12:27 AM

మూడు నెలలు కూడా నిండని తన చిన్నారి కన్నయ్యకు కృష్ణుడి వేషం వేసి మురిసిపోయింది ఆ కన్నతల్లి. అల్లరి కిట్టయ్యలా అంతకంతకూ ఎదిగిపోవాలని ఎన్నో కలలుకంది. సరిగ్గా వారం కిందట కృష్ణాష్టమి నాడు వేడుకలు చేసుకున్న ఆ ఇంట్లో నేడు ఆర్తనాదాలు మిన్నంటాయి. మూడు నెలల పసికందు పొత్తిళ్లలోనే కన్నుమూయగా, కంటికిరెప్పలా కాపాడుకున్న ఆ తల్లి తనయుడి వెంటే సాగిపోయింది. చూపరులకు కంటతడి పెట్టించిన ఈ హృదయ విదారకమైన రోడ్డు ప్రమాదం శుక్రవారం కంచికచర్ల మండలం కీసర టోల్‌గేట్‌ వద్ద జరిగింది.

కన్నయ్య వెంటే కన్నతల్లి
కృష్ణుడి అలంకరణలో మూడు నెలల అద్విక్‌ , ఆసుపత్రిలో మరణించిన తల్లి చైతన్య

కీసర టోల్‌గేట్‌ వద్ద రోడ్డు ప్రమాదం

మూడు నెలల పసికందు సహా తల్లి మృతి

బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి ఢీకొన్న లారీ

పెద్దమ్మ ఇంట్లో నిద్రచేయడానికి వెళ్తూ శాశ్వత నిద్రలోకి..

హృదయవిదారకంగా విలపించిన బంధువులు

కంచికచర్ల/రూరల్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి) : విజయవాడకు చెందిన నవీన్‌, చైతన్యకు 2024లో వివాహమైంది. నవీన్‌ ఆటోడ్రైవర్‌. వీరిద్దరికీ మూడు నెలల కిందట బాబు జన్మించాడు. అద్విక్‌ అని నామకరణం చేశారు. తల్లి చైతన్య తన మూడు నెలల అద్విక్‌తో కానూరులోని తల్లి మరియమ్మ ఇంట్లో ఉంటోంది. గత శనివారం కృష్ణాష్టమి సందర్భంగా బాబును కృష్ణుడిగా అలంకరించి మురిసిపోయింది. బాబుకు మూడో నెల రావటంతో కంచికచర్ల మండలం కీసర గ్రామంలో ఉంటున్న పెద్దమ్మ రేణుక ఇంట్లో ఒకరోజు నిద్ర చేయాలనుకున్నారు. శుక్రవారం ఉదయం కానూరు నుంచి తల్లి మరియమ్మ, అద్విక్‌తో కలిసి చైతన్య ఆర్టీసీ బస్సులో బయల్దేరింది. బస్సు కీసర శివారుకు చేరుకోగానే మరియమ్మ తన అక్క రేణుకకు ఫోన్‌ చేసి.. చైతన్యతో పాటు బాబును తీసుకెళ్లడానికి ఏదైనా బండి పంపమని అడిగింది. తన ఇంటి సమీపంలో ఉన్న శ్రీరామ్‌ అనే యువకుడికి బైక్‌ ఇచ్చి వారిని తీసుకురమ్మని రేణుక తెలిపింది. టోల్‌గేట్‌ వద్ద బస్సు దిగాక చైతన్య, బాబును తీసుకుని మోటార్‌ సైకిల్‌ ఎక్కింది. మోటారు సైకిల్‌ పెండ్యాల రూట్‌లోకి వెళ్లే క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బలమైన గాయాలు కావడంతో మూడు నెలల అద్విక్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తల్లి చైతన్యకు బలమైన గాయాలు కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. శ్రీరామ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. విగతజీవులుగా మారిన చైతన్య, అద్విక్‌లను చూసి తల్లి మరియమ్మ, ఇతర బంధువులు గుండెలవిసేలా రోదించారు. కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆక్రమణలు తొలగించండి మహాప్రభో

కీసర టోల్‌గేట్‌ వద్ద రెండువైపులా హోటళ్లు, కూల్‌డ్రింక్‌ షాపులు, బడ్డీకొట్లు, ఇతర తినుబండారాల దుకాణాలు ఎక్కువగా ఉన్నాయి. చిరు వ్యాపారులు రెండువైపులా రోడ్డు మార్జిన్లు ఆక్రమించారు. పగలు రాత్రి తేడా లేకుండా లారీలు, కార్లు, ఇతర వాహనాలను దుకాణాల ముందు ఆపుతున్నారు. అక్కడ రోడ్డు కూడా కొద్దిగా వంపు ఉండటం వల్ల వాహనాలు సరిగ్గా కనిపించట్లేదు. దీనివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఒకటికి రెండుసార్లు ఆక్రమణలు తొలగించారు. అయినప్పటికీ షరామామూలే అన్నట్టుగా పరిస్థితి మారింది. దుకాణాలకు పక్కనే ఉన్న టోల్‌గేట్‌ యాజమాన్యం, ఎన్‌హెచ్‌ అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు.

Updated Date - Aug 23 , 2025 | 12:27 AM