చలో సింగపూర్
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:43 AM
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న విజయవాడ-సింగపూర్ విమాన సర్వీసు శనివారం ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వ చొరవతో అంతర్జాతీయ సర్వీసు మొదలు కావడంపై అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సింగపూర్‌కు విమాన సర్వీసుల పునరుద్ధరణ
140 మందితో రాక.. 123 మందితో పోక
సర్వీసు ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ
చంద్రబాబు, లోకేశ్‌కు ప్రయాణికుల కృతజ్ఞతలు
(ఆంధ్రజ్యోతి, గన్నవరం) : ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న విజయవాడ-సింగపూర్ విమాన సర్వీసు శనివారం ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వ చొరవతో అంతర్జాతీయ సర్వీసు మొదలు కావడంపై అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారంలో మంగళ, గురు, శనివారాల్లో రాకపోకలు సాగించే ఈ సర్వీసును ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు గూడపాటి తులసీమోహన్ పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేశారు. అనంతరం ఇండిగో విమానానికి జెండా ఊపి సింగపూర్‌కు ప్రారంభించారు. శనివారం ఉదయం 7.30 గంటలకు 140 మంది ప్రయాణికులతో ఈ విమానం ఇక్కడికి వచ్చింది. అనంతరం 10.30 గంటలకు 123 మంది ప్రయాణికులతో సింగపూర్ వెళ్లింది.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు
సింగపూర్ నుంచి విజయవాడ వచ్చిన ప్రయాణికులు, విజయవాడ నుంచి సింగపూర్ వెళ్తున్న ప్రయాణికులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఫొటోలతో కూడిన మినీ పోస్టర్లను ప్రదర్శించారు. వారిద్దరికీ కృతజ్ఞతలు తెలిపారు.
విజయవాడ ఎయిర్‌పోర్టుకు పూర్వవైభవం : యార్లగడ్డ వెంకట్రావు
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతంలో విజయవాడ ఎయిర్‌పోర్టుకు వచ్చే విమానాల సంఖ్య తగ్గిందని, ప్రస్తుతం 45 విమానాలు తిరుగుతున్నాయని, రోజూ 4 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. 50 శాతం విమానాలు పెరిగాయని చెప్పారు. గతంలో టీడీపీ హయాంలో సింగపూర్‌కు విమానం తిరిగేదని, వైసీపీ దానిని రద్దు చేసిందని చెప్పారు. తాజాగా కేంద్రమ్రంతి రామ్మోహనాయుడు చొరవతో ఇండిగో విమాన సంస్థ ముందుకొచ్చి సింగపూర్‌కు సర్వీసు నడుపుతోందన్నారు. కృష్ణా, గుంటూరు, గోదావరి, ప్రకాశం ఉమ్మడి జిల్లాల్లోనే ఎన్నారైలు ఎక్కువగా ఉన్నారని, వారికి రాకపోకలు సాగించేందుకు దగ్గరగా ఉంటుందన్నారు. విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. రాబోయే 7 నెలల్లో అంతర్జాతీయ టెర్మినల్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని తెలిపారు.
సంతోషంగా ఉంది : ప్రయాణికుడు
గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసును ప్రారంభించటం సంతోషం. ఐదేళ్ల తరువాత మళ్లీ సింగపూర్ సర్వీసును ఏర్పాటు చేయటం బాగుంది. ఇంతకుముందు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్లి సింగపూర్ వెళ్లాల్సి వచ్చేంది. ఇప్పుడు డైరెక్ట్‌గా సింగపూర్ విమానం ఎక్కడం హ్యాపీగా ఉంది.