Share News

వెలగలేరుకు వెలుగులు

ABN , Publish Date - May 23 , 2025 | 12:42 AM

వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్వహణకు అడ్డంకులు తొలగిపోతున్నాయి. వరదల సమయంలో గేట్లు ఎత్తే సమస్యకు త్వరలో తెరపడనుంది. రెగ్యులేటర్‌ గేట్ల మరమ్మతులకు, పూడికతీత పనులకు కూటమి ప్రభుత్వం రూ.1.80 కోట్ల నిధులు కేటాయించడం, పనులు చకచకా జరుగుతుండటంతో స్థానిక రైతులతో పాటు సమీప గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వెలగలేరుకు వెలుగులు
వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ గేట్లకు రంగులు

హెడ్‌ రెగ్యులేటర్‌కు చకచకా మరమ్మతులు

11 గేట్లకు రిపేర్‌ వర్కులు పూర్తి

ఎగువ, దిగువన పూడిక పనులు

వరద నిర్వహణకు తొలగనున్న అడ్డంకులు

ఇబ్రహీంపట్నం, ఆంధ్రజ్యోతి : వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ మరమ్మతు పనులు చకచకా జరుగుతున్నాయి. 11 గేట్లను బయటకు తీసి రిపేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం రంగులు వేస్తున్నారు. పాడైన బేరింగ్స్‌ను, స్ర్కూరాడ్స్‌ను, హాయిస్ట్‌ బ్రిడ్జ్‌, మెకానిజం వంతెనపై ఉన్న మోటార్లను రీప్లేస్‌ చేస్తున్నారు. రెగ్యులేటర్‌ ఎగువన 200 మీటర్లు, దిగువన 200 మీటర్ల మేర పూడిక పనులు చేపట్టారు. ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుత అకాల వర్షాలకు వాగులు పొంగి, బుడమేరుకు వరదలు వచ్చి, నీరు రెగ్యులేటర్‌ వరకు చేరుకోకుండా, బుడమేరు వరద మళ్లింపు కాల్వ (బీడీసీ) ద్వారా కృష్ణానదిలోకి మళ్లించేలా రక్షణ గోడను నిర్మించారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేసి గోడల మధ్యలో గేట్లను ఏర్పాటు చేస్తామని, హాయిట్స్‌ బ్రిడ్జ్‌పై మోటార్లను రీప్లేస్‌ చేస్తామని ఏఈ వెంకటేశ్‌ తెలిపారు.

వైసీపీ పాపం.. రెగ్యులేటర్‌కు శాపం

1960లో రెగ్యులేటర్‌ నిర్మాణం జరిగాక ఎన్నడూ రానంత వరద గత సెప్టెంబరు 1న వచ్చింది. రెగ్యులేటర్‌ వద్దకు సుమారు 30 వేల క్యూసెక్కుల నీరు వచ్చింది. దీంతో గేట్లు ఎత్తకుండానే వరద నీరు బుడమేరు వరద మళ్లింపు కాల్వ ద్వారా మళ్లించారు. బీడీసీ సామర్థ్యానికి మించి వరద రావడంతో రెగ్యులేటర్‌ వద్ద నుంచి సుమారు నాల్గో కిలోమీటర్‌ వద్ద కట్టకు మూడుచోట్ల భారీ గండ్లు పడ్డాయి. ఆ వరద అంతా విజయవాడలోని పల్లపు ప్రాంతాలను ముంచేసింది. అయినా వరద తగ్గలేదు. గేట్లు ఎత్తకుంటే రెగ్యులేటర్‌ మొత్తం వరదకు కొట్టుకుపోయేది. తప్పనిసరి పరిస్థితుల్లో గేట్లు ఎత్తి వరదను దిగువకు విడుదల చేసి రెగ్యులేటర్‌ను కాపాడుకోగలిగారు. దీనివల్ల రెగ్యులేటర్‌ బేరింగ్స్‌, స్ర్కూరాడ్స్‌, మోటార్లు పాడయ్యాయి. 2019-24 వైసీపీ హయాంలో ఇరిగేషన్‌ శాఖను నిర్లక్ష్యం చేసింది. రెగ్యులేటర్‌ నిర్వహణకు పైసా విదల్చకపోవడం, గేట్లకు కనీసం గ్రీజ్‌ పెట్టకపోవడంతో పాడైపోయాయి. అప్పుడే రెగ్యులేటర్‌ మెయింటినెన్స్‌కు నిధులు ఇచ్చి ఉంటే గేట్లు సవ్యంగా పనిచేసి ఎంతో కొంత వరదను ఆపే వీలుండేది.

అన్నదాతలు, ప్రజల హర్షం

బుడమేరుకు వరద అనగానే వెలగలేరు, కవులూరు, ఈలప్రోలు, పైడూరుపాడు, రాయనపాడు గ్రామాల ప్రజలు హడలిపోతారు. వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్వహణ సరిగ్గా ఉంటే వరద ముంపు సాధ్యమైనంత వరకు నివారించవచ్చని వారు చెబుతారు. రెగ్యులేటర్‌ గేట్లు ఎత్తకుండా సుమారు 13,500 క్యూసెక్కుల వరద నీటిని బుడమేరు వరద మళ్లింపు కాల్వ ద్వారా కృష్ణానదిలో కలుపుతారు. అంతకుమించి వరద వస్తే రెగ్యులేటర్‌ గేట్లు కొంతమేర ఎత్తి, దాని దిగువ ఉన్న కాల్వ ద్వారా కొల్లేటిలోకి వరద వెళ్లేలా చూస్తారు. ఇందుకు రెగ్యులేటర్‌ గేట్లు ఎప్పటికప్పుడు కండీషన్‌లో ఉంచుకోవాలి. ప్రస్తుతం వీటి మరమ్మతులకు నిధులు కేటాయించడం, పనులు కొనసాగుతుండటంతో వరద నిర్వహణ సవ్యంగా సాగుతుందని అన్నదాతలు, పలు గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

Updated Date - May 23 , 2025 | 12:42 AM